Movies

యుద్ధంలాంటిది

Charmi says she is waging a war with her life-tnilive-యుద్ధంలాంటిది

‘‘చేసే వృత్తిని ఎప్పుడూ కష్టంగా భావించకూడదు. సవాలుగా స్వీకరించాలి. నా వరకు నిద్రలేచి ఫోన్‌ ఆన్‌ చేయగానే సవాళ్ల పరంపర మొదలవుతుంది. వాటిని ఎంత చాకచక్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్తానా అనే అంశంపైనే దృష్టి సారిస్తాను. నటించే రోజులతో పోలిస్తే, ఇప్పుడు నిర్మాతగా జీవితాన్ని మరింత ఆస్వాదిస్తున్నాను. పూరి జగన్నాథ్‌గారు చెప్పినట్టు జీవితం అనేది యుద్ధంలాంటిది. ప్రతిరోజూ మనం పోరాడుతూనే ఉండాలి. నేనిప్పుడు అదే చేస్తున్నాను’’ అని నటి, నిర్మాత ఛార్మి అన్నారు. ఆమె ప్రస్తుతం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘రొమాంటిక్‌’ను పూరి జగన్నాథ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. శుక్రవారం పుట్టినరోజు జరుపుకొంటున్న ఛార్మి మాట్లాడుతూ ‘‘నాకు పుట్టినరోజు వేడుక అంటే చాలా ఇష్టం. నా చిన్నతనం నుంచీ మా అమ్మానాన్న నా పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా నిర్వహించేవారు. ఈ ఏడాది ఈ సెలబ్రేషన్స్‌ కొంచెం ముందుగానే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సెట్లో మొదలయ్యాయి. హీరో రామ్‌ పుట్టినరోజును ఇటీవలే జరుపుకొన్నాం. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు వస్తున్న అద్భుతమైన స్పందనతో సెట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రోజూ పండుగలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఎలాగైనా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బంపర్‌ హిట్‌ సాధించాలన్నదే నా ధ్యేయం. ఇందులో రామ్‌ పాత్రతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. తెలంగాణ యాసలో రామ్‌ చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆయన ఎదురుగా ఉన్నప్పుడు నాక్కూడా అదే యాస వచ్చేస్తోంది. ఆకాష్‌ హీరోగా పూరిగారితో కలిసి చేస్తున్న మరో సినిమా ‘రొమాంటిక్‌’ 50 శాతం షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ఉంటుంది’’ అని అన్నారు. పెళ్లి గురించి ప్రస్తావించగా ‘‘నేను జీవితంలో ఎంతో నేర్చుకుని ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు కెరీర్‌ పట్ల ఫోక్‌సగా ఉన్నాను. మా అమ్మా నాన్నలకు దూరంగా జరిగి, ఇంకొకరి ఇంటికెళ్లి, అక్కడ వాళ్ల మధ్య ఉంటూ, వారికి జీవితాన్ని అంకితం చేయాలనే ఆలోచనలు నాకు లేవు. సినిమా, ట్రావెల్‌ నాకిష్టమైన అంశాలు. జీవితాంతం అమ్మానాన్నలతోనే ఉండాలనుకుంటున్నా. అందుకే పెళ్లి చేసుకోదలుచుకోవడం లేదు’’ అని అన్నారు.