ScienceAndTech

ఉచిత ఇంటర్నెట్ కోసం “ట్విఫియా” అని పేరు

ఉచిత ఇంటర్నెట్ కోసం “ట్విఫియా” అని పేరు

సాధారణంగా పుట్టిన బిడ్డకు వారికి ఇష్టమైన పేర్లో, కుటుంబంలోని పూర్వీకుల పేర్లో పెడుతుంటారు. కొన్ని పేర్లకు విచిత్రమైన నేపథ్యం ఉంటుంది. విమానంలో పుట్టారని ఆ విమానం పేరు పెట్టడం.. ఆపద నుంచి తమను కాపాడిన వ్యక్తుల పేర్లు పెట్టడం..చివరికి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ పేరును పెట్టడం గురించి వార్తల్లో విన్నాం.. చూశాం. అయితే, ఓ జంట ఉచిత ఇంటర్నెట్‌ కోసం తమ బిడ్డకు ఏకంగా ఇంటర్నెట్‌ సర్వీస్‌ కంపెనీ పేరు పెట్టి అందర్నీ నివ్వెరపర్చింది. స్విట్జర్లాండ్‌లో ట్విఫి అనే ఇంటర్నెట్‌ సర్వీస్‌ కంపెనీ ఉంది. ఇటీవల ఆ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎవరైతే వారి బిడ్డకు తమ కంపెనీ పేరు కలిసి వచ్చేలా ‘ట్విఫియస్‌’ లేదా ‘ట్విఫియా’ అని పేరు పెడతారో వారికి 18 ఏళ్లపాటు ఉచితంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇస్తామని ప్రకటనలో వెల్లడించింది. ఉచిత ఇంటర్నెట్‌ పొందాలంటే తల్లిదండ్రులు వారికి పుట్టిన బిడ్డ ఫొటో, జనన ధ్రువపత్రం ట్విఫి అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వివరాలు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేశాక వారి ఇంటికి ఇంటర్నెట్‌ సేవలు అందిస్తారట. చాలా మంది ఉచిత ఇంటర్నెట్‌ కోసం బిడ్డకు అలాంటి పేర్లు ఎందుకు పెడతాం? అని ఊరుకున్నారు. కానీ, ఓ జంట మాత్రం ఆ ప్రకటనను సీరియస్‌గా తీసుకొని నిజంగానే ‘ట్విఫియా’ అని పేరు పెట్టేశారు. దీంతో ట్విఫి సంస్థ వారి ఇంటికి ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చింది. ప్రకటనలో పేర్కొన్నట్లుగా 18 ఏళ్లపాటు ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామని తెలిపింది. తమ బిడ్డకు ఆ పేరు పెట్టడంపై ఆ జంట మాట్లాడుతూ.. తమ బిడ్డకు పెట్టిన పేరు బాగానే ఉందని, ప్రపంచంలో ఇంత కన్నా దారుణమైన పేర్లు ఉన్నాయని అన్నారు. ఈ ఉచిత ఇంటర్నెట్‌తో డబ్బులు ఆదా అవుతాయని వాటిని బ్యాంక్‌లో వేసి తమ బిడ్డ చదువుకు ఉపయోగిస్తామని చెప్పుకొచ్చారు.