చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం నేతల గృహ నిర్బంధాలను నిరసిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీరు తీసుకురావాలని కోరుతూ రామకుప్పం మండలంలో తెదేపా నేతలు సోమవారం చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో నేతల గృహ నిర్బంధాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి మంగళవారం లేఖ రాశారు. శాంతియుత ఆందోళనల ద్వారా సాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు కుప్పం ప్రజలు ప్రయత్నం చేశారని లేఖలో తెలిపారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం ప్రభుత్వం బాధ్యత అని, వాటికంటే ప్రభుత్వానికి వేరే ఇతర ప్రాధాన్యాంశాలు ఉన్నట్లు కనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు. తమ నాయకులను గృహనిర్బంధానికి గురిచేయటం ద్వారా చిత్తూరు జిల్లా పోలీసులు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశారని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ నిర్బంధాలకు గురైన వ్యక్తులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేక, అప్రజాస్వామిక అరెస్టులకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య విస్తృత ప్రయోజనాలను కాపాడాలని జిల్లా ఎస్పీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
చిత్తూరు ఎస్పీకి చంద్రబాబు లేఖ
Related tags :