Sports

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు కరోనా దెబ్బ

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు కరోనా దెబ్బ

సార్‌లార్లక్స్‌ ఓపెన్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లక్ష్యసేన్‌ తండ్రి, కోచ్‌ డీకే సేన్‌ కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ ప్రభావం భారత ఆటగాళ్లపై పడింది. ఇప్పటికే లక్ష్యసేన్‌ టోర్నీ నుంచి తప్పుకోగా.. తాజాగా అజయ్‌ జయరాం, శుభంకర్‌ డేలు కూడా దూరం కావాల్సొచ్చింది. డీకే సేన్‌ను కలవడంతో వీరిద్దరిని కూడా ఐసోలేషన్‌లో ఉండమని నిర్వాహకులు ఆదేశించారు. అయితే డీకే సేన్‌కు ఇప్పటికీ కరోనా లక్షణాలు లేవు. ‘‘సార్‌లార్లక్స్‌ ఓపెన్‌ 2020 టోర్నీకి ముగ్గురు ఆటగాళ్లు దూరమయ్యారు. జట్టు సభ్యుల్లో ఒకరికి కోవిడ్‌-19 పాజిటివ్‌ రావడంతో టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారుల్ని దృష్టిపెట్టుకుని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీలో లక్ష్యసేన్‌, అజయ్‌ జయరాం, శుభంకర్‌ డే పాల్గొనడం లేదు’’ అని బీడబ్ల్యూఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఐసోలేషన్‌లో ఉండాలని సూచించిన నిర్వాహకులు తమను పట్టించుకోవడం లేదంటూ జయరాం, శుభంకర్‌లు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు, బాయ్‌, బీడబ్ల్యూఎఫ్‌కు ట్వీట్‌ చేశారు.