Sports

బ్యాట్ విసిరినందుకు గేల్‌కు జరిమానా

బ్యాట్ విసిరినందుకు గేల్‌కు జరిమానా

పంజాబ్‌ సీనియర్‌ ఆటగాడు క్రిస్‌గేల్‌కు షాక్‌! ఐపీఎల్‌ నిర్వాహకులు అతడికి జరిమానా విధించారు. రాజస్థాన్‌ మ్యాచులో బ్యాటు విసిరేసినందుకు అతడి మ్యాచ్‌ ఫీజులో 10% కోత విధిస్తున్నట్టు మ్యాచ్‌ రిఫరీ ప్రకటించారు. లీగ్‌ నియమావళిని ఉల్లంఘించినట్టు గేల్‌ అంగీకరించాడని తెలిపారు.

అబుదాబి వేదికగా శుక్రవారం సాయంత్రం పంజాబ్‌, రాజస్థాన్‌ హోరాహోరీగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 185 పరుగులు చేసింది. 41 ఏళ్ల వయసులోనూ యూనివర్స్‌ బాస్‌ ‘క్రిస్‌ గేల్‌’ అద్భుతంగా ఆడాడు. వికెట్ల మధ్యన సింగిల్స్‌, డబుల్స్‌తో అలరించాడు. కళ్లుచెదిరే సిక్సర్లను బాదేసి ఆకట్టుకున్నాడు. టీ20 కెరీర్‌లో 1000 సిక్సర్లు బాదేసిన ఏకైక ఆటగాడిగా అవతరించాడు. ఈ మ్యాచులో జోఫ్రా ఆర్చర్‌ వేసిన 19.3వ బంతిని గేల్‌ భారీ సిక్సర్‌గా మలిచి 99 పరుగులకు చేరుకున్నాడు.

అంతలోనే పుంజుకున్న ఆర్చర్‌ తర్వాతి బంతికే గేల్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఒక పరుగు తేడాతో శతకం చేజారడంతో గేల్‌ ఆవేశంతో తన బ్యాటును విసిరికొట్టాడు. పెవిలియన్‌ వైపు నడుచుకుంటూ వస్తూ ఆర్చర్‌ను అభినందించాడు. అతడితో చేయికలిపాడు. గేల్‌ బ్యాటును మాక్స్‌వెల్‌‌ అందించడంతో దానిపై హెల్మెట్‌ను ఉంచుతూ తనదైన రీతిలో డగౌట్‌కు చేరుకున్నాడు. బ్యాటును అలా విసిరేయడం లీగ్‌ నిబంధనలకు వ్యతిరేకం కావడంతో నిర్వాహకులు జరిమానా విధించారు. లీగులో గేల్‌ 99 పరుగుల వద్ద ఔటవ్వడం ఇది రెండోసారి.