* ప్రముఖ సాంకేతిక సంస్థలన్నీ తమ ఉద్యోగులకు మరికొన్ని రోజుల పాటు ఇంటి నుంచి పనిచేసే(వర్క్ ఫ్రమ్ హోం) అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాతో విప్రో కూడా చేరింది. భారత్, అమెరికాలో ఉన్న తమ ఉద్యోగులంతా జనవరి 18, 2021 వరకు ఇంటి నుంచే పనిచేయాలని కోరింది. కంపెనీ ఉద్యోగుల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఈ రెండు దేశాలకు చెందిన వారే. భారత్‌లో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. ఇంకా భారీ స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఇక అమెరికాలో కరోనాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పూర్తి వివరాలను ఈ మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది.
* ఫైనాన్షియల్, లోహ రంగ షేర్లు దూసుకెళ్లిన వేళ దేశీయ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 503 పాయింట్లు లాభపడి, 40,261 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో 11,813 పాయింట్ల వద్ద స్థిరపడింది.
* పండుగ ఆఫర్లో భాగంగా హీరో ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్లపై రూ.5,000 నగదు రాయితీతో పాటు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. వినియోగదార్లు తమ పాత ద్విచక్ర వాహనాల్ని మార్పిడి చేసుకోవడం ద్వారా మరో రూ.5,000 అదనపు రాయితీ లేదంటే వడ్డీ రహిత ఫైనాన్స్ (ఎంపిక చేసిన ప్రాంతాల్లో) పొందే అవకాశం కల్పించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ లిథియం-అయాన్, లెడ్-యాసిడ్ శ్రేణి ఇ-స్కూటర్లకు వర్తిస్తుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న 500 డీలర్ల వద్ద ఈ నెల 14 వరకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. లెడ్-యాసిడ్ మోడళ్లపై రూ.3,000 నగదు రాయితీ, ఇతర మోడళ్లపై రూ.5,000 వరకు రాయితీ పొందవచ్చని పేర్కొంది. రిఫరల్ పథకంలో భాగంగా కొనుగోలు చేసే వినియోగదార్లకు అదనంగా మరో రూ.1,000 ప్రయోజనాలుంటాయని పేర్కొంది. ఇటీవల విడుదల చేసిన ఆప్టిమా హెచ్ఎక్స్ సిటీ స్పీడ్, నిక్స్ హెచ్ఎక్స్ సిటీ స్పీడ్లు ఈ ఆఫర్ పరిధిలోకి రావని వివరించింది.
* అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపులోని రిలయన్స్ క్యాపిటల్ (ఆర్సీఎల్) తన అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయానికి సిద్ధమైంది. ఆసక్తి గల కొనుగోలుదార్ల నుంచి బిడ్లను సంస్థ ఆహ్వానించింది. వాటాల విక్రయం ద్వారా వచ్చే సొమ్ముతో సుమారు రూ.20,000 కోట్ల రుణాలు చెల్లిస్తామని సంస్థ తెలిపింది. మొత్తం వాటాలకు గానీ లేదంటే అనుబంధ సంస్థలైన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ ఫైనాన్షియల్ లిమిటెడ్, రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ లిమిటెడ్‌లలో కొంత భాగం వాటాలకు గానీ బిడ్లను (ఈఓఐ) ఆహ్వానించింది.
* పండుగ సీజన్ దృష్ట్యా అమేజ్, డబ్ల్యూఆర్-వీ మోడళ్లలో ప్రత్యేక ఎడిషన్లను హోండా కార్స్ ఇండియా విడుదల చేసింది. టాప్-గ్రేడ్ వీఎక్స్లో డీజిల్, పెట్రోల్ విభాగాల్లో ‘ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ల’ను మెరుగైన ప్రీమియం ప్యాకేజీ ఆఫర్‌తో అందిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. అమేజ్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ మాన్యువల్ పెట్రోల్ వెర్షన్ రూ.7.96 లక్షలు కాగా, సీవీటీ రకం ధరను రూ.8.79 లక్షలు. డీజిల్ మాన్యువల్ వెర్షన్ ధర రూ.9.26 లక్షలు కాగా, సీవీటీ రకం ధరను రూ.9.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, దిల్లీ) హోండా నిర్ణయించింది. డబ్ల్యూఆర్-వీ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.9.7 లక్షలు, డీజిల్ రకం ధర రూ.10.99 లక్షలుగా ఉంది.
* ఇటాలియన్ సూపర్‌బైక్‌ల తయారీ సంస్థ డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఎస్‌లో సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. భారత్‌లో దీని ధర రూ.15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త మల్టీస్ట్రాడా 950ని 937 సీసీ ఇంజిన్‌తో రూపొందించామని, సురక్షిత ప్రయాణానికి అనువుగా, మరింత ఆనందించేలా అద్భుతమైన డిజైన్‌తో దీన్ని ఉత్పత్తి చేశామని కంపెనీ తెలిపింది. ఏబీఎస్ ట్రాక్షన్ కంట్రోల్, వెహికల్ హోల్డ్ కంట్రోల్ (వీహెచ్సీ), ఐకానిక్ సెమీ-యాక్టివ్ స్కైహూక్ సస్పెన్షన్ (ఫోర్క్, షాక్ అబ్జార్బర్లను నిరంతరం సర్దుబాటు చేసే వ్యవస్థ) ఈ సూపర్ బైక్ ప్రత్యేకతలని కంపెనీ పేర్కొంది.
* జీఎస్టీ పరిహారం కింద 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘స్పెషల్ బారోయింగ్ విండో’ కింద రూ.6వేల కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ విండో కింద రూ.12,000 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ రుణాలుగా ఇచ్చింది. జీఎస్టీ పరిహారం సెస్ కొరతను తీర్చడానికి రాష్ట్రాలకు ఈ విండో ద్వారా నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఇటీవల అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన భేటీలో జీఎస్టీ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
* దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. మంగళవారం ఉదయం 9:37 గంటల సమయంలో సెన్సెక్స్ 423 పాయింట్ల లాభంతో 40,180 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 122 పాయింట్లు ఎగబాకి 11,791 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.34 వద్ద కొనసాగుతోంది. వివిధ దేశాల్లో తయారీ రంగం పుంజుకుంటోందన్న సానుకూల సంకేతాలు మదుపర్ల సెంటిమెంటును పెంచాయి. దీంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. అక్టోబర్‌లో ఇటు భారత్‌తో పాటు అమెరికాలో ఉత్పత్తి కార్యకలాపాలు భారీగా పుంజుకున్నాయి. చైనా సహా ఐరోపాలోనూ తయారీ పరుగులు పెడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.
* ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ కస్టమర్లకు షాకిచ్చింది. బ్యాంకు పనివేళలు కాని సమయంలో జరిపే కొన్ని నగదు లావాదేవీలపై సౌలభ్య ఫీజు విధిస్తున్నట్లు వెల్లడించింది. సెలవు రోజులు, సాధారణ రోజుల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు క్యాష్ ఆక్సెప్టార్/రిసైక్లర్ మిషన్లలో చేసే ప్రతి డిపాజిట్‌పై రూ. 50(ట్యాక్స్‌లు అదనం) చొప్పున కన్వీనియెన్స్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఐసీఐసీఐ స్పష్టం చేసింది. నవంబరు 1 నుంచి ఈ ఛార్జీలను అమల్లోకి తెచ్చినట్లు తెలిపింది.