NRI-NRT

కాంగ్రెస్ సభ్యుల్లో భారతీయ అమెరికన్ల హవా

కాంగ్రెస్ సభ్యుల్లో భారతీయ అమెరికన్ల హవా

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు మరోసారి తమ హవా కొనసాగించారు. గత ఫలితాలను పునరావృతం చేస్తూ.. నలుగురు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
*అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్​ల హవా కొనసాగిస్తూ.. మరోసారి నలుగురు అభ్యర్థులు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. డెమొక్రటిక్​ పార్టీ తరఫున శాసనసభ్యులుగా బరిలోకి దిగిన డాక్టర్​ అమీ బెరా, ప్రమీలా జయపాల్​, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
*విస్తరించనున్న ‘సమోసా కాకస్​’ పరిధి
తాజా ఫలితాలతో ‘సమోసా కాకస్’గా పిలిచే అమెరికన్​ పార్లమెంటుకు ఎన్నికైన భారత సంతతి సభ్యుల పరిధి మరింత విస్తృతం కానుంది. చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తి తొలిసారిగా ఈ పదబంధాన్ని ఉపయోగించారు. అమెరికన్​ దిగువసభ తరఫున అరిజోనా ఆరో కాంగ్రెస్​ జిల్లా నుంచి బరిలోకి దిగిన డాక్టర్​ హీరాల్​ తిపిర్నేని ప్రత్యర్థి(డేవిడ్​ ష్వీకర్ట్)పై ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. 52 ఏళ్ల తిపిర్నేని ఈ సారి ఎన్నికైతే.. రెండో భారతీయ-అమెరికన్​ మహిళగా నిలవనున్నారు. 2016లో ప్రతినిధుల సభకు ఎన్నికైన జయపాల్​(55).. తొలి భారత సంతతి మహిళగా గుర్తింపు పొందారు.
*’సమోసా కాకస్’లో ప్రస్తుతం ఐదుగురు భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యులు ఉన్నారు. ఇందులో నలుగురు ప్రతినిధుల సభ నుంచి ఎన్నికవ్వగా.. డెమొక్రటిక్​ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన కమలా హ్యారిస్​(56) సెనేటర్​గా ఉన్నారు.
**డెమొక్రటిక్​ పార్టీ తరఫున గెలుపొందిన భారతీయ అమెరికన్లు..
*రాజా కృష్ణమూర్తి(47)
లిబర్టేరియన్​ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్​ నెల్సన్​(30)పై అలవోక విజయం సాధించారు. 71 శాతం ఓట్లు కైవసం చేసుకొని ప్రత్యర్థిని ఓడించారు కృష్ణమూర్తి. ఫలితంగా వరుసగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
*రో ఖన్నా(44)
రిపబ్లికన్​ పార్టీకి చెందిన తోటి భారత సంతతి వ్యక్తి రితేశ్​ టాండన్​(48)పై 50 శాతం ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్​ జిల్లాలో ఆయనకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం.
*’సమోసా కాకస్​’లో అత్యంత సీనియర్​ సభ్యులైన డాక్టర్​ అమీ బెరా(55) వరుసగా ఐదోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెస్ జిల్లా తరఫున బరిలోకి దిగిన బెరా.. రిపబ్లికన్​ అభ్యర్థి బజ్​ ప్యాటర్సన్​పై 25 శాతం పాయింట్ల ఆధిక్యం ప్రదర్శించారు.
*వాషింగ్టన్ రాష్ట్రం నుంచి బరిలోకి దిగిన ప్రమీలా జయపాల్‌ మూడోసారి విజయం సాధించారు.
*42 ఏళ్ల శ్రీ ప్రెస్టన్​ కులకర్ణి..
జీఓపీ అభ్యర్థి ట్రాయ్​ నెహ్ల్స్​(52)పై గెలుపు దిశగా సాగుతున్నారు. టెక్సాస్​లోని 22 కాంగ్రెస్​ జిల్లాలో బరిలోకి దిగిన కులకర్ణి.. ప్రత్యర్థి కంటే కేవలం 5 శాతం పాయింట్లు వెనుకంజలో ఉన్నారు.
*తొలిసారి ఓటమితో సరి
ఈ ఎన్నికల్లో తొలిసారిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మంగా అనంతాత్ముల.. డెమొక్రటిక్​ అభ్యర్థి జెర్రె కోన్నొలీ చేతుల్లో పరాజయం పాలయ్యారు. రిపబ్లిక్​ పార్టీకి చెందిన నిషా శర్మ కూడా తన తొలి ప్రయత్నంలో విఫలమయ్యారు. డెమొక్రటిక్​ పార్టీకి చెందిన మార్క్​ డిసౌల్నియర్.. ఆమెను 50 శాతానికిపైగా పాయింట్ల తేడాతో ఓడించారు.