* అగ్రరాజ్యం అమెరికాలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ..యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ట్రంప్ మరోసారి అధికారంలోకి రావాలని కొందరు కోరుకుంటుండగా మరికొన్ని దేశాలు మాత్రం అధ్యక్షుడి మార్పును కోరుకుంటున్నాయి. అమెరికా ఎన్నికల తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని ట్రంప్ ప్రకటించడంతో, బైడెన్ కూడా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఒకవేళ కోర్టుకు వెళితే ఫలితం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
* అమ్మాయిల ధనాధన్‌కు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా లీగ్ మూడో సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్‌నోవాస్, మిథాలీరాజ్ నాయకత్వంలోని వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన మిథాలీ బౌలింగ్ ఎంచుకుంది. గత రెండు సీజన్లలో సూపర్‌నోవాస్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. లీగ్‌లో మూడో జట్టు ట్రయల్ బ్లేజర్స్. ఆ జట్టుకు స్మృతి మంధాన కెప్టెన్. కాగా, ఈ సీజన్‌లో ఒక్కో జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. 3 మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈనెల 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.
* దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే వేగంగా పుంజుకుంటోందని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. జీఎస్టీ వసూళ్లు, విద్యుత్ వినియోగం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తదితరాలు పెరగడాన్ని ఉదాహరణగా చూపుతూ ఆయన ఈ విధంగా అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
* ప్రస్తుతం జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో పది కోట్ల మంది అమెరికా పౌరులు ముందస్తు ఓట్లు వేసినట్లు అధికారుల అంచనా. ఇలా ముందస్తు ఓటు వేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోలింగ్ తేదీన అందుబాటులో ఉండలేమని భావించేవాళ్లు, పోలింగ్ కోసం పనిచేసే సిబ్బంది, పార్టీల ప్రచారానికి పనిచేసిన వాళ్లు, వైద్య అవసరాలు ఉన్నవాళ్లు నిర్దేశించిన పోలింగ్ తేదీ కంటే ముందే ఓటు వేయొచ్చు. ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ముందస్తు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గానీ, మెయిల్ ద్వారా గానీ ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నారు. ఈ అవకాశం సాధారణంగా పోలింగ్ తేదీకి ముందు నాలుగు రోజుల నుంచి 45 రోజుల వరకు ఉంటుంది. ఈ మధ్య ముందస్తు ఓటింగ్ విపరీతంగా పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో ఇటీవల జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో, తాజాగా అమెరికా ఎన్నికల్లో వీటి సంఖ్యభారీగా పెరిగింది. అయితే పలువురు సామాజిక నిపుణులు మాత్రం ఈ ముందస్తు ఓటింగ్‌ను వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియకు ఇది విఘాతం కలిగిస్తోందని ఆరోపిస్తున్నారు. అయినా ఈ ముందస్తు పోలింగ్‌కు ఆదరణ పెరగడం గమనార్హం.
* దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో ప్రతిపక్షాలకు దిమ్మతిరగడం ఖాయమని మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా చేస్తున్న విమర్శలకు ఎన్నిక ఫలితాలే సమాధానం చెబుతాయని వ్యాఖ్యానించారు. నగరంలోని ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడారు.
* గుంటూరు నగరంలోని మురుగునీటి వ్యవస్థ పనులు నిలిపివేశారని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీకి ఆయన లేఖ రాశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గుంటూరుకు రూ.500కోట్లు కేటాయించారని….దాంతో పాటు అప్పటి తెదేపా ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసిందని చెప్పారు. 2019 జులై నాటికి షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ 50 శాతం పనులు పూర్తి చేసిందని లేఖలో వివరించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పనులు నిలిపివేశారని…..ఈ నెల 23 జిల్లా కలెక్టర్‌తో జరిగిన సమావేశంలో ఈ విషయం పూర్తిగా తెలిసిందని జయదేవ్ పేర్కొన్నారు. పనులు చేపట్టిన నిర్మాణ సంస్థ కూడా గుంటూరు నుంచి వెళ్లిపోయినట్లు ఆయన చెప్పారు. కేంద్రం నిధులతో చేపడుతున్న ప్రాజెక్టును నిలిపివేయడంపై వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో కేంద్రమంత్రిని జయదేవ్ కోరారు.
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రం ఇవ్వాల్సిందేనని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఈ ప్రాజెక్టు వ్యవహారంలో తెదేపా ప్రభుత్వం లేనిపోని గందరగోళం సృష్టించిందని.. అందుకే ఇప్పుడు నిధుల విషయంలో వివాదం రేగిందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలు కలిసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు యత్నించాలని ఆయన కోరారు.
* రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి అరెస్టును భాజపా తీవ్రంగా ఖండిస్తోంది. దీనిపై బుధవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవడేకర్, స్మృతి ఇరానీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ….మహారాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు.
* దేశ రాజధానిలో తెరాస కార్యాలయం నిర్మాణ కోసం కేటాయించిన స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు అప్పగించింది. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని భూమి, అభివృద్ధి కార్యాలయం జేఈ సుమిత్‌కుమార్.. తెరాస నేత, తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి భూమి పత్రాలను అప్పగించి సరిహద్దులు నిర్ధారించారు. దిల్లీలోని వసంత్‌విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని తెరాస కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేటాయించింది. త్వరలోనే సీఎం కేసీఆర్ ఈ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
* అమెరికా ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాకముందే ఈ ఎన్నికల్లో తామే గెలిచినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అంతేకాకుండా ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు. ఫలితాలు కీలకంగా మారుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పోలింగ్‌ను అనుమతిస్తున్నారని దీన్ని వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్‌లను అనుమతించడం వెంటనే ఆపివేయాలని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టంచేశారు.
* అమెరికా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యర్థి బైడెన్‌ల మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లోనూ వీరిద్దరి మధ్య కేవలం స్వల్ప తేడానే ఉంది. అయితే కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో బైడెన్ విజయం సాధించారు. అయితే, అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ(డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా)ని మాత్రం డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ క్లీన్ స్వీప్‌చేశారు. ఇప్పటివరకు ఆయనకు దాదాపు 93శాతం పాపులర్ ఓట్లు లభించాయి. ట్రంప్‌నకు కేవలం 5.6శాతం మాత్రమే వచ్చాయి.
* అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ గెలుపు లాంఛనమే అని అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు సాధించిన విజయం అసాధారణమైనదని ఆయన వ్యాఖ్యానించారు. అత్యద్భుతంగా మద్దతు తెలిపినందుకు అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ విజయోత్సవానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. శ్వేతసౌధంలోని దాదాపు 250 మంది పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
* రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి అరెస్టును భాజపా తీవ్రంగా ఖండిస్తోంది. దీనిపై బుధవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, స్మృతి ఇరానీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ..మహారాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు. ఈ వ్యవహారంపై అమిత్ షా ట్విటర్ వేదికగా స్పందించారు. ‘రిపబ్లిక్ టీవీ, అర్ణబ్ గోస్వామికి వ్యతిరేకంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడం వ్యక్తి స్వేచ్ఛను, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉండే మీడియాపై దాడి వంటిదే. ఇది మాకు అత్యయిక పరిస్థితిని గుర్తు చేస్తోంది’ అని మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
* నేడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నేడు అమెరికా పారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది. అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకొన్న అత్యంత వివాదాస్పద నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. ఈ నిర్ణయం 2017లో తీసుకొన్నా.. ఇది నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. మళ్లీ అమెరికా ఈ ఒప్పందంలో చేరాలని భావిస్తే మాత్రం చేరవచ్చు.
* వాట్సాప్ తన యూజర్ల కోసం అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. బల్క్ ఐటమ్‌లను డిలీట్ చేసుకుని స్టోరేజీ కెపాసిటీని పెంచుకునేలా ఫీచర్‌ను తీసుకు వస్తామని వాట్సాప్ ప్రకటించింది. గత కొన్నిరోజులుగా ఇలాంటి ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాట్సాప్ అధికారికంగా వెల్లడించడంతో యూజర్లలో నెలకొన్న అనుమానాలు తీరిపోయాయి.
* రోహిత్‌శర్మ గాయం విషయంలో బీసీసీఐ వ్యవహార శైలి బాగాలేదని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించారు. హిట్‌మ్యాన్ పరిస్థితి ఏంటో కోచ్ రవిశాస్త్రికి తెలియదంటే తాను ఒప్పుకోనని పేర్కొన్నారు. గాయపడి విశ్రాంతి తీసుకున్న రోహిత్ హైదరాబాద్ మ్యాచులో బరిలోకి దిగడంతో వీరూ బోర్డుపై ఘాటుగా విమర్శలు చేశారు.
* వ్యవసాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్‌గాంధీ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. బిహార్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన అరారియాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ లను ఉద్దేశిస్తూ ‘అవి ఈవీఎంలు కాదని.. మోదీ ఓటింగ్ మెషీలు’ అని ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం బిహార్ యువత ఎంతో కోపంగా ఉన్నారని.. అవి ఈవీఎంలు అయినా ఎంవీఎంలు అయినా మహాకూటమే గెలుస్తుందని రాహుల్ అన్నారు.
* తాము భారీ గెలుపును సాధించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. అయితే తమ ప్రత్యర్థి జో బైడెన్ వర్గం ఎన్నికలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ‘‘మేము చాలా ఆధిక్యంలో ఉన్నాం. అయితే వారు ఎన్నికలను దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా వారిని ఎప్పటికీ చేయనీయం. ఎన్నికలు ముగిసిన అనంతరం ఓట్లు వేయడం కుదరదు. ఈ రాత్రి నేను ఓ ప్రకటన చేయబోతున్నాను. ఓ పెద్ద విజయం!’’ అని ఆయన ట్వీట్ చేశారు.
* అనారోగ్యం బారిన పడిన బాలీవుడ్ నటుడు ఫరాజ్‌ఖాన్(50) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు, నటి పూజా భట్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. హెర్పస్ సింప్లెక్స్ వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురైన ఈ నటుడు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఇన్నాళ్లు చికిత్స పొందారు. వైరస్ ఛాతీ నుంచి మెదడుకు వ్యాపించడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఫరాజ్‌ఖాన్ మరణించారు.