మీరు పాత మోడల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నారా అయితే త్వరలోనే మీ ఫోన్లో కొన్ని రకాల సెక్యూర్ వెబ్సైట్లు (Https యూఆర్ఎల్తో ప్రారంభమయ్యే వెబ్ పేజీలు) తెరుచుకోవు. ఎందుకంటే పాత వెర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేసే ఫోన్లలో ఉండే రూట్ ట్రస్ట్ సర్టిఫికెట్‌ను కొన్ని వెబ్సైట్లు సపోర్ట్ చేయబోవని లెట్స్ ఎన్‌క్రిప్ట్ అనే నాన్-ప్రాఫిట్ సర్టిఫికెట్ అథారిటీ హెచ్చరించినట్లు ఆండ్రాయిడ్ పోలీస్ తన కథనంలో పేర్కొంది. 2021 సెప్టెంబరు నెల నుంచి ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ వెర్షన్ కన్నా ముందు ఓఎస్‌లతో పనిచేసే ఫోన్లలో చాలా వరకు సెక్యూర్ వెబ్సైట్లు తెరుచుకోవని తెలిపింది. ఇందుకు కారణం లెట్స్ ఎన్‌క్రిప్ట్ కంపెనీ ఐడెన్ ట్రస్ట్ అనే కంపెనీతో చేసుకున్న ఒప్పందం.
లెట్స్ ఎన్‌క్రిప్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వెబ్ డొమైన్లకు ట్రస్ట్ సర్టిఫికెట్లను జారీ చేస్తుంది. గతంలో ఈ కంపెనీ జారీ చేసిన ట్రస్ట్ సర్టిఫికెట్లనే ఇప్పటి వరకు వివిధ వెబ్ బ్రౌజర్లు, ఆపరేటింగ్ సిస్టంలు వెబ్సైట్లు తెరుకునేందుకు ఉపయోగిస్తున్నాయి. గతంలో ఈ ట్రస్ట్ సర్టిఫికెట్ల కోసం లెట్స్ ఎన్‌క్రిప్ట్, ఐడెన్ ట్రస్ట్‌తో ఒప్పదం చేసుకుంది. తాజాగా 2021 సెప్టెంబరు 1తో ఆ ఒప్పందం ముగియనుంది. దీంతో లెట్స్ ఎన్‌క్రిప్ట్ ట్రస్ట్ సర్టిఫికెట్ లేని బ్రౌజర్స్, ఆపరేటింగ్ సిస్టంలలో పలు సెక్యూర్ వెబ్సైట్లు పనిచేయవు. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ వెర్షన్ కన్నా ముందు వెర్షన్ ఓఎస్‌లకు లెట్స్ ఎన్‌క్రిప్ట్ ట్రస్ట్ సర్టిఫికెట్ లేదు. దీని వల్ల ఆయా ఫోన్లలో సెక్యూర్ వెబ్సైట్లు తెరుచుకోవు.
లెట్స్ ఎన్‌క్రిప్ట్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 33.8 శాతం ఫోన్లు ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ముందు వెర్షన్ ఓఎస్‌తో పనిచేస్తున్నాయట. దీని ప్రకారం 2016 కన్నా ముందు కొనుగోలు చేసిన ఆండ్రాయిడ్ ఫోన్లలో కొన్ని వెబ్సైట్లకు యాక్సెస్ ఉండకపోవచ్చని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ప్రత్యామ్నాయంగా ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఫైర్ఫాక్స్ సొంత ట్రస్ట్ సర్టిఫికెట్లను ఉపయోగించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. దాని వల్ల ఈ బ్రౌజర్లో అన్ని రకాల వెబ్సైట్లూ ఓపెన్ అవుతాయని పేర్కొంటున్నారు.