* మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. కరోనా నేపథ్యం తర్వాత మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి.10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది. అయితే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరలు క్రమేపి తగ్గుముఖం పట్టాయి.గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.48,010 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 52,370 కి చేరింది. బంగారం ధరలు కాస్త పెరిగితే, వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ. 900 పెరిగి.రూ.65,400కి చేరింది. అయితే.బంగారం రేట్లు హెచ్చుతగ్గులు సాధారణమే అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
* వరుస లాభాల్లో దూసుకెళుతున్న దేశీయ మార్కెట్లు మరో రికార్డును తిరగరాశాయి. కొవిడ్ తర్వాత కోలుకుని గత కొన్ని రోజులుగా లాభాల బాట పట్టిన సూచీలు ఆల్‌టైమ్ హై (జీవనకాల గరిష్ఠాల)కు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం, త్వరలో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన వెలువడనుందన్న అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది. జో బైడెన్ హయాంలో భారతీయ ఐటీ కంపెనీలకు శుభవార్త చెబుతారన్న అంచనాల నడుమ ఐటీ, ఫైనాన్షియల్ షేర్లు రాణించాయి. మరోవైపు దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కడం మదుపరుల్లో ఉత్సాహం నింపింది. తయారీ డేటా, విద్యుత్ డిమాండ్ పెరగడం వంటివి కరోనా, ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న భయాలను తొలగిపోయేలా చేశాయి. ఈ క్రమంలో సూచీలు వరుసగా ఆరో రోజూ దూసుకెళ్లాయి. ఈ ఏడాది జనవరిలో ఆల్‌టైమ్ రికార్డులను తిరగరాసిన సూచీలు మళ్లీ నవంబర్ 9 నాటి ట్రేడింగ్‌లో కొత్త రికార్డులను నమోదు చేశాయి.
* పూర్తి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన కొవిడ్-19 పరీక్షా కిట్లను భారత్‌కు చెందిన పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూపు విడుదల చేసింది. తమ కరోనా నిర్ధారణ కిట్లు దేశవ్యాప్తంగా డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తాయని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి గిరీశ్ కృష్ణమూర్తి తెలిపారు. ప్రభుత్వ అనుమతి పొందిన తమ పరీక్షా విధానంలో అంతిమ ఫలితాలు కేవలం గంటన్నర వ్యవధిలోనే వెలువడతాయని ఆయన వివరించారు. చెన్నైలో ఉన్న సంస్థ కర్మాగారంలో త్వరలోనే ఉత్పత్తి మొదలు కానుందని ఆయన వెల్లడించారు. ఈ కర్మాగారానికి నెలకు పదిలక్షల టెస్ట్ కిట్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నట్టు ఆయన తెలిపారు.
* అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన జోష్ దేశీయ మార్కెట్లలోనూ కనిపిస్తోంది. ఇదే కారణంతోనూ ఆసియా మార్కెట్లూ పుంజుకోవడం దేశీయ సూచీలకు మరింత బలాన్నిచ్చింది. దీనికితోడు కొన్ని కీలక కంపెనీల షేర్లు రాణిస్తుండడం కలిసొచ్చింది. సోమవారం ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్ 655 పాయింట్ల లాభంతో 42,548 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 180 పాయింట్లు ఎగబాకి 12,443 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.99 వద్ద కొనసాగుతోంది. బైడెన్ ఎన్నిక అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరదించే అవకాశం ఉందన్న అంచనాలు మదుపర్ల సెంటిమెంటును పెంచింది.
* అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించడాన్ని భారతీయ ఐటీ పరిశ్రమ స్వాగతిస్తోంది. అమెరికా సరికొత్త పాలనా యంత్రాంగంతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నామని పరిశ్రమ సంఘం నాస్కామ్ ఆదివారం పేర్కొంది. భారతీయ ఐటీ పరిశ్రమకు అమెరికా అతి పెద్ద మార్కెట్ అన్న సంగతి తెలిసిందే.‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు నాస్కామ్ తరఫున అభినందనలు. అమెరికాలో సాంకేతికత, నైపుణ్యాలు, డిజిటల్ పరివర్తన కోసం బైడెన్ యంత్రాంగంతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామ’ని నాస్కామ్ ట్వీట్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) ఐటీ రంగ ఆదాయం 7.7 శాతం వృద్ధితో 191 బిలియన్ డాలర్ల (సుమారు రూ.14.13 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని నాస్కామ్ అంచనా వేసింది. ఈ పరిశ్రమ నికరంగా 2 లక్షల కొత్త ఉద్యోగాల్ని సృష్టించే అవకాశం ఉండటంతో ఈ రంగంలోని ఉద్యోగుల సంఖ్య 43.6 లక్షలకు చేరొచ్చని తెలిపింది.
* అక్టోబర్ నెల ప్యాసెంజర్ వాహన విక్రయాల్లో 9శాతం క్షీణత నమోదైనట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఎఫ్‌ఏడీఏ) వెల్లడించింది. క్రితం సంవత్సరం అక్టోబర్‌లో 2,73,980 యూనిట్లు అమ్ముడవగా.. ఈ సారి ఆ సంఖ్య 2,49,860 పరిమితమైనట్లు తెలిపింది. ద్విచక్రవాహన విక్రయాలు 26.82 శాతం క్షీణించినట్లు పేర్కొంది. 2019 అక్టోబర్‌లో 14,23,394 యూనిట్లను విక్రయించగా.. ఈ సారి అమ్మకాలు 10,41,682 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక వాణిజ్య వాహనాల విషయంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. ఈ విభాగపు విక్రయాలు 30.32 శాతం తగ్గాయి. ఇక త్రీవీలర్స్ అమ్మకాలు 64.5 శాతం కుంగాయి.