* నేడు మార్కెట్లు జోరుమీద ట్రేడవుతున్నాయి. తొలిసారి సెన్సెక్స్ 43 వేల మార్కును దాటింది. ఉదయం 11.45 సమయంలో సెన్సెక్స్ 428 పాయింట్లు పెరిగి 43,026 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు పెరిగి 12,566 వద్ద కొనసాగుతున్నాయి. ఫైజర్-బయోఎన్‌టెక్ కొవిడ్ టీకా అనుమతులకు చేరువకావడంతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మర్కెట్లు ఆశిస్తున్నాయి. దీంతోపాటు బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు అనుకూలంగా ఉండటం సూచీల్లో జోష్ నింపింది. ఫైజర్ షేర్లు భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి.
* దేశీయ మార్కెట్లు వరుసగా ఏడో రోజూ లాభాల్లో ముగిశాయి. సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నెలకొల్పాయి. కొవిడ్ టీకా వస్తుందన్న ఆశల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీనికి తోడు బిహార్ ఎన్నికల ఫలితాల్లోనూ ఎన్డీయే మరోసారి అధికారంలోకి రానుందన్న వార్తలు మదుపరుల్లో జోష్‌ను నింపింది. దీంతో నిఫ్టీ 12,600 మార్కును దాటింది.
* కొవిడ్‌పై తమ టీకా 90శాతం విజయం సాధించిందని ఫైజర్-బయో ఎన్ టెక్‌లు చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ఆశలు రేకెత్తించింది. కానీ, ఈ టీకా వచ్చేందుకు మరింత సమయం పట్టవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ నెలాఖరుకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రెగ్యూలేటరీల సంతకాలు పూర్తియితే.. దీని రవాణాను ప్రారంభించవచ్చు. ఇక్కడే అసలు సమస్య మొదలు కానుంది. ఈ టీకా రవాణా చేయాలంటే అతిశీతల కంటైనర్లు అవసరం. అమెరికాలోనే అత్యాధునిక ఆసుపత్రుల్లో ఈ సౌకర్యాలు దొరకడం కష్టం. దీంతో గ్రామీణ ప్రాంతాలకు దీనిని అందుబాటులోకి తీసుకురావడం సవాళ్లతో కూడుకొన్న పని.
* దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.33గం. సమయంలో సెన్సెక్స్ 140 పాయింట్ల లాభంతో 42,738 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 12,498 వద్ద ఉన్నాయి. టీకా ఫలితాలు 90శాతం సానుకూలంగా వచ్చాయని ఫైజర్ సంస్థ ప్రకటించడంతో ఆ షేర్లు నేడు భారీగా ర్యాలీ చేస్తున్నాయి. దాదాపు 13.75శాతం పెరిగాయి. ఒక దశలో 19శాతం దూసుకుపోయింది. ఫోనిక్స్ మిల్స్, ఇండియన్ హోటల్స్, పీవీఆర్ లిమిటెడ్, యునైటెడ్ బ్రూవరీస్ షేర్లు లాభాల్లో ఉండగా.. డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఇప్కా ల్యాబ్స్, ఎన్వోసీఐఎల్, బేయర్ క్రాప్సైన్స్ల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నేడు మొత్తం 535 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో గెయిల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కో, టాటాపవర్ వంటి కంపెనీలు ఉన్నాయి.
* దేశీయంగా ప్రతిష్ఠాత్మక టెలికాం రంగ కార్యక్రమం భారత మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) డిసెంబరు 8-10 తేదీల్లో వర్చువల్ పద్ధతిలో జరగనుంది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో సంస్థలు పాలు పంచుకుంటాయని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కాయ్) డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది కార్యక్రమ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందని, అయితే సవాళ్లనే భారీ అవకాశాలుగా ఐఎంసీ మలుస్తుందని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్ తెలిపారు. ఐఎంసీ 2020 విజయవంతం కావడానికి టెలికాం విభాగం (డాట్) పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కనీసం 30 చిన్న, మధ్య తరహా సంస్థలు, అంకురాలు పాల్గొనేందుకు డాట్ నిధులు అందిస్తున్నట్లు వివరించారు. ఐఎంసీలో ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొనే అవకాశం ఉన్నట్లు కాయ్ ఛైర్మన్ అజయ్ పురి తెలిపారు. 15,000 మందికి పైగా ఇందులో పాల్గొనవచ్చని అన్నారు.
* కేంద్ర ప్రభుత్వానికి 19 వాణిజ్య బొగ్గు గనుల వేలం ద్వారా సుమారు రూ.7,000 కోట్ల వార్షికాదాయం లభించనుంది. వాటిల్లో ఒకసారి తవ్వకం (మైనింగ్) ప్రారంభమైతే 69,000కు పైగా కొత్త ఉద్యోగాలు కూడా లభిస్తాయని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు గనుల్ని వేలం వేయడం ద్వారా ఈ రంగంలో ప్రైవేటు సంస్థలకు తలుపులు తెరిచినట్లు అయ్యింది. ‘ఏడాదికి 51 ఎంటీల సంయుక్త సామర్థ్యంతో ఈ 19 బొగ్గు గనుల ద్వారా సుమారు రూ.7 వేల కోట్ల ఆదాయం కేంద్రానికి సమకూరుతుంది. వేలంలో ప్రైవేటు సంస్థలు పోటాపోటీగా పాల్గొని మంచి ప్రీమియంతో బిడ్లు దాఖలు చేశాయ’ని మంత్రి వివరించారు. మొత్తం 38 గనుల వేలంలో ఇప్పటికే 19 గనుల వేలం విజయవంతంగా పూర్తి చేయడంతో 50 శాతం విజయం సాధించామని ఆయన తెలిపారు. ‘గనులు దక్కించుకున్న బిడ్డర్లకు సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా. బొగ్గు గనుల్లో ఒకసారి కార్యకలాపాలు ప్రారంభమైతే, మీకు కూడా ఆదాయం బాగా వస్తుంద’ని ఆయన పేర్కొన్నారు. కోకింగ్ కోల్ మినహా అన్ని బొగ్గు దిగుమతుల్ని వచ్చే కొన్నేళ్ల పాటు నిలిపివేస్తామని ఆయన తెలిపారు. ‘వేలం ప్రారంభించడానికి ముందు గనుల తవ్వకం, విద్యుత్, బొగ్గు రంగాల నుంచి అత్యధిక సంఖ్యలో పెట్టుబడిదార్లు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంటారని అనుకున్నాం. అయితే ఊహించని విధంగా స్థిరాస్తి, మౌలిక, ఔషధ రంగాల నుంచి కూడా సంస్థలు వేలంలో పాల్గొన్నాయ’ని జోషి వివరించారు. వేలంలో 42 కంపెనీలు పాల్గొనగా, అందులో 40 సంస్థలు ప్రైవేటు రంగంలోనివే. 23 గనులకు 76 బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో 19 గనులకు రెండు అంతకంటే ఎక్కువ సంస్థలు బిడ్లు దాఖలు చేయడం విశేషం.