చరిత్ర సృష్టించిన టీటీడీ అన్నప్రసాద ట్రస్టు–ఆధ్యాత్మిక వార్తలు

ఉదయం నుంచి రాత్రి వరకు… కేవలం రెండు గంటల విరామంతో… సంఖ్యతో నిమిత్తం లేకుండా వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం అందించగలమా? తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు వచ్చిన సందేహమిది! ‘ముందు మొదలుపెడదాం! ఆ తర్వాత అన్నీ స్వామి చూసుకుంటారు’ అని అనుకున్నారు. మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ప్రారంభించారు. వారు అనుకున్నట్లే జరిగింది! స్వామి కరుణ కురిసింది. విరాళాల వరద ప్రవహించింది. ఒకటీ రెండూ కాదు… అన్నప్రసాద ట్రస్టు విరాళాల మొత్తం గురువారంతో వెయ్యి కోట్ల రూపాయలకు చేరింది. ఒక ప్రత్యేకమైన కారణంతో నడిచే ట్రస్టుకు ఈ స్థాయిలో నిధులు రావడం ఒక చరిత్ర! పేద, ధనిక భేదం లేకుండా కనీసం ఒక్కసారైనా అన్నదాన భవనంలో ప్రసాదం ఆరగించాలని ప్రతి ఒక్క రూ భావిస్తారు.నిజానికి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ ఈనాటిది కాదు. తొలిరోజుల్లో శ్రీవారి భక్తురాలు తరిగొండ వెంగమాంబ ఇక్కడ అన్నదానం ప్రారంభించినట్టు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఆస్థాన మండపం ఉన్న ప్రదేశంలో చెట్లకిందనే అన్నప్రసాదాల వితరణ జరిగేది. కాలం గడిచే కొద్దీ తిరుమలకు భక్తులరాక పెరుగుతూ వచ్చింది. 1985 ఏప్రిల్‌ 6వ తేదీన అప్పటి సీఎం ఎన్టీఆర్‌ నిత్యాన్నదాన పథకం ప్రారంభించారు. ప్రధాన కల్యాణకట్ట ఎదుట ఉన్న భవనంలో అన్న వితరణ జరిగేది. ఈ పథకానికి తొలిసారిగా చెన్నైకు చెందిన ఎల్‌వీ రమణ అనే భక్తుడు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. అప్పట్లో పరిమిత సమయంలోనే టోకెన్లను జారీ చేసేవారు.
**మారిన పేరు… తీరు!
నిత్యాన్నదాన పథకాన్ని 1994 ఏప్రిల్‌ 1వ తేదీన శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదాన ట్రస్టుగా పేరు మార్చారు. ఆ తర్వాత ‘నిత్యాన్నదాన’ స్థానంలో ‘నిత్యాన్నప్రసాద’ అనే పదం చేర్చారు. ఆ తర్వాత భక్తుల రద్దీని దృష్టి లో పెట్టుకుని వరాహస్వామి ఆలయం సమీపంలో ఓ భారీ భవనాన్ని నిర్మించారు. అదే.. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనం! 2011 జూలై 7న అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఈ భవనాన్ని ప్రారంభించారు. షిరిడీ, ధర్మస్థలలాంటి క్షేత్రాల్లో నిత్యం సగటున 50 వేల మందికి అన్న వితరణ జరుగుతుండగా.. తిరుమలలో లక్షన్నర మందికి భోజనాలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే ఇది చరిత్ర సృష్టించింది.అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు ఉప్మా, పొంగలి, వర్మిసెల్లి ఉప్మా తో అల్పాహారం అందిస్తారు. మధ్యాహ్నం 11.30 నుంచి సాయంత్రం 4 వరకు, తిరిగి 5 నుంచి రాత్రి 10.30 గంటల వరకు చక్కెర పొంగలి, పచ్చడి, అన్నం, సాంబారు, రసం, మజ్జిగతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేస్తున్నారు. అంటే… ఉదయం 9 గంటలకు మొదలయ్యే వితరణ కేవలం రెండుగంటల విరామంతో రాత్రి 10.30 గంటల వరకు సాగుతుంది. ఈ పథకం నిర్వహణకు ఏటా రూ.96 కోట్లు ఖర్చు అవుతోంది. ట్రస్టుకు వచ్చిన విరాళాలను వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తారు. వాటిపై రూ.60 కోట్ల వరకు వడ్డీ వస్తోంది. పూర్తిగా ట్రస్టు నిధులపై వచ్చే వడ్డీతోనే అన్నప్రసాదాల వితరణ జరగాలన్నది టీటీడీ లక్ష్యం.
**పలుచోట్లకు విస్తరణ..
అన్నప్రసాద వితరణ కేవలం తిరుమలకు మాత్రమే పరిమితం కాదు. తిరుచానూరుతోపాటు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం వసతి కేంద్రాలలో భక్తులకు… రుయా, బర్డు, స్విమ్స్‌, ఆయుర్వేద ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు కూడా ఆహారా న్ని అందిస్తున్నారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాం ప్లెక్స్‌ 1, 2లోని కంపార్టుమెంట్లు, బయటికి వ్యాపించే క్యూలైన్లు వద్ద కూడా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఇక… దివ్యదర్శనం, సర్వదర్శన కాంప్లెక్స్‌, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్‌, ప్రధాన కల్యాణకట్టల్లో తేనీరు, కాఫీ, పాలు పంపిణీ చేస్తారు. రోజుకు పదివేల లీటర్ల పాలు వినియోగిస్తారు.
***విరాళల వెల్లువ ఇలా…
2013-14: రూ.507.05 కోట్లు
2014-15: రూ.592.23 కోట్లు
2015-16: రూ.693.91 కోట్లు
2016-17: రూ.809.82 కోట్లు
2017-18 సెప్టెంబరు 6 నాటికి రూ.వెయ్యి కోట్లు
2.శ్రీవారి తిరువాభరణాలన్నీ భద్రం
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదాన ట్రస్టు నిధులు రూ.వెయ్యి కోట్లకు చేరాయి. 1985 నుంచి ఈనెల 6వరకు అందిన విరాళాల మొత్తం వెయ్యి కోట్లకు చేరిందని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. దీంతో పాటే ప్రాణదాన, గో సంరక్షణ పథకాలకు కూడా విశేషంగా విరాళాలు సమకూరుతున్నాయని చెప్పారు. శుక్రవారం ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమం అనంతరం జేఈవోలు శ్రీనివాసరాజు, భాస్కర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి హుండీ ఆదాయం కాస్త తగ్గిందన్నారు. గతేడాది ఆగస్టులో రూ.93 కోట్లు లభించగా ప్రస్తుతం రూ.82.85 కోట్లు సమకూరిందన్నారు.2019 నూ తన క్యాలెండర్‌, డైరీలను 13న సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారని, 14నుంచి వాటికి ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నా రు. కాగా, మూడు పథకాలకు రూ.3.02 కోట్లు విరాళంగా అందాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం బెంగళూరుకు చెందిన కొట్టు మురళీకృష్ణ తన కంపెనీలైన సైబర్‌హోమ్స్‌ సంస్థపై ఎస్వీ నిత్యాన్న ప్రసాదానికి రూ.1.01కోట్లు, ఐకానిక కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థపై ప్రాణదానానికి రూ.1.01కోట్లు చొప్పు న రెండు డీడీలను జేఈవోకు అందజేశారు. ఇక ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు ముంబై భక్తుడు చందన సల్గోకర్‌ రూ.కోటి విరాళం అందించారు.
3.అయ్యప్ప భక్తులూ.. ఆందోళన వద్దు! -రహదారులు పునరుద్ధరిస్తున్నాం -కేరళ పర్యాటకశాఖ
కేరళకు వచ్చే అయ్యప్ప భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, గుడికి వెళ్లే మార్గాలన్నింటినీ పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తున్నామని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి రాణి జార్జ్‌ పేర్కొన్నారు. భారత పర్యాటక నిర్వాహకుల సంఘం(ఐ.ఎ.టి.ఒ.) 34వ వార్షికోత్సవ సమావేశాలకు హాజరైన ఆమె మాట్లాడారు. వరదల కారణంగా శబరిమలకు వెళ్లే మార్గంలో పంబ నది వద్ద కొంత మార్గం దెబ్బతిందని, భక్తుల రాక మొదలయ్యే నవంబరు నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తిచేస్తామన్నారు. కేరళలోని ఇతర అన్ని పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు నిరభ్యంతరంగా వెళ్లొచ్చని చెప్పారు. వరదల ప్రభావిత పర్యాటక ప్రాంతాలను పదిహేను రోజుల సమయంలోనే పూర్తిస్థాయిలో పూర్వస్థితికి తేగలిగామని చెప్పారు. కేరళ పర్యాటక విశేషాలతో భారీఎత్తున కేరళ ట్రావెల్‌మార్ట్‌-2018ను ఈ నెల 27 నుంచి ప్రారంభించబోతున్నామని ఆమె చెప్పారు.
4.తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అలాగే దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు మూడు గంటల సమయం పడుతోంది. నిన్నశ్రీవారికి హుండీ ద్వారా రూ.3.30కోట్ల ఆదాయం వచ్చింది.
5.దుర్గమ్మకు బంగారు రాళ్లహారం
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు శుక్రవారం చలుమూరు వెంకటేశ్వరరావు చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ సిహెచ్‌.గోవిందమ్మ ఆధ్వర్యంలో 10 లక్షలు విలువ చేసే 241 గ్రాముల బంగారంతో చేసిన రాళ్ల హారాన్ని దేవస్ధానం ఈవో వి.కోటేశ్వరమ్మకు విరాళంగా అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన సి.వీరే్‌షరెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారికి విరాళంగా రూ. 88 వేల విలువైన బంగారు డైమండ్‌ నత్తును అందజేశారు.
6. వేములవాడ రాజన్న ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం
శ్రావణ చతుర్దశి, మాస శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చకులు రుద్రాహావనం, పూర్ణాహుతిని నిర్వహించారు. అలాగే సాయంత్రం అద్దాల మండపంలో స్వామివారికి మహాలింగార్చన చేయనున్నారు.
7. 12 నుంచి 21 వరకు ప్రత్యేక, బ్రేక్‌ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 12 నుంచి 21 వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా ప్రతి రోజూ వృద్ధులు, దివ్యాంగులు, ఏడాదిలోపు చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేశారు.
8. రెండు రోజుల ముందు నుంచే ఖైరతాబాద్‌ గణపతి దర్శనం
ప్రతి సంవత్సరం భక్తులను ఎంతగానో ఆకట్టుకునే ఖైరతాబాద్‌ మహాగణపతి ఈసారి శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా దర్శనమివ్వబోతున్నాడు. విగ్రహ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. పండగకి రెండు రోజుల ముందే భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. వినాయకుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపున శివపార్వతుల కుటుంబాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 150 మంది కళాకారులు విగ్రహ నిర్మాణానికి శ్రమిస్తున్నారని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.
9. దసరా మహోత్సవంలో ఆర్జిత సేవలు నిలుపుదల
దుర్గగుడిలో అక్టోబరు 10 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న దసరా మహోత్సవాల సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా మహోత్సవాల సమ యంలో జరుగు ప్రత్యేక చండీహోమం, ప్రత్యేక కుంకు మార్చన జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఉభయ రుసుం, టిక్కెట్లు విక్రయ ప్రారంభించే తేదీ త్వరలో తెలియపరుస్తామని దేవస్థానం వైదిక కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.
10. మస్జిద్‌ అంటే..
‘మస్జిద్‌’ అంటే ‘సజ్దా’ (మోకరిల్లి ప్రార్థన) చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్‌ ఆరాధన కోసం నిర్మించిన ఆలయాన్ని ‘మస్జిద్‌’ అంటారు. నమాజ్‌ చేయాలనుకొనేవారందరూ అక్కడికి వెళ్తారు. సామూహికంగా నమాజ్‌ చేస్తారు. మస్జిద్‌ను కేవలం ఆరాధనాలయంగా మాత్రమే భావించకూడదు. వాస్తవానికి ఈ మస్జిద్‌లు ఇస్లామీయ కోటలు. ఇస్లాం ధర్మ కేంద్రాలు. ఇక్కడి నుంచే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలు దిశలకూ వ్యాపించి, విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్‌ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం పొందుతాయి. స్వచ్ఛమైన ఏకదైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది. మస్జిద్‌లో ముస్లింలందరూ తమతమ బేధాలన్నీ కట్టిపెట్టి, పాలూనీళ్ళలా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బు, అరబ్బేతరుడు, పట్టణవాసి, పల్లెవాసి, నల్లవాడు, తెల్లవాడు అనే బేధభావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు.అంతిమ దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా తెలిపారు:‘‘అల్లా్‌హనూ, అంతిమ దినాన్నీ విశ్వసించి నమాజును స్థాపించేవారూ, జకాత్‌ను ఇచ్చేవారూ, అల్లా్‌హకు తప్ప మరెవరికీ భయపడని వారూ మాత్రమే అల్లా్‌హకు చెందిన మస్జిద్‌కు సంరక్షకులూ, సేవకులూ కాగలుగుతారు’’ (దివ్య ఖుర్‌ఆన్‌ 9:18)అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ ఇలా సెలవిచ్చారు:
మీరు ఒక వ్యక్తిని మస్జిద్‌కు వస్తూ, పోతూ ఉండగా చూసినట్టయితే, అతవిశ్వాసం (ఈమాన్‌) గురించి సాక్ష్యం ఇవ్వండి.అల్లాహ్‌ దృష్టిలో అన్ని ప్రదేశాలలో అత్యంత శ్రేయస్కరమైన చోటు పవిత్ర మస్జిద్‌.ఎవరయితే ఐదు పూటలూ మస్జిద్‌కు వెళ్తారో వారి ఆతిథ్యం కోసం స్వర్గంలో బసను అల్లాహ్‌ ఏర్పాటు చేస్తాడు.
ఎవరయినా అల్లాహ్‌ కోసం మస్జిద్‌ను నిర్మిస్తే, అతని కోసం స్వర్గంలో ఒక అందమైన ఇంటిని అల్లాహ్‌ నిర్మిస్తాడు.ఎవరయినా ఇంటి దగ్గర వుజా చేసుకొని (ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కొని) మస్జిద్‌కు వెళ్ళి, నమాజ్‌ చేసి వస్తే, అతను ప్రతి అడుగూ ఒక పాపాన్ని తుడిచివేస్తుంది. మరోవైపు ఒక అంతస్తును పెంచుతుంది. అంటే అతను వేసే ప్రతి అడుగుకూ బదులుగా అతని కర్మల పత్రంలో ఒక పుణ్యం లిఖితం అవుతుంది. అతని పరలోకపు అంతస్తులు పెరుగుతాయి. పాపాల్ని మన్నించడం జరుగుతుంది.మస్జిదె నబవీ (మదీన)లో చేసే ఒక నమాజ్‌ ఇతర మస్జిద్‌లలో చేసే వెయ్యి నమాజుల కంటే శ్రేష్ఠమైనది.
మస్జిదె హరామ్‌ (మక్కా)లో చేసే ఒక నమాజ్‌ ఇతర మస్జిద్‌లలో చేసే లక్ష నమాజుల కంటే శ్రేష్ఠమైనది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com