ఇంటికి పయనమైన నాదల్

ప్రపంచ నంబర్‌వన్‌ నాదల్‌, నొవాక్‌ జకోవిచ్‌ మధ్య యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ ఆశించిన అభిమానులకు నిరాశే. టోర్నీలో నాదల్‌ పోరాటం ముగిసింది. మోకాలి గాయం కారణంగా అతడు అర్ధంతరంగా సెమీస్‌ నుంచి తప్పుకున్నాడు. మ్యాచ్‌లో మూడోసీడ్‌ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7-6 (7/3), 6-2తో ఆధిక్యంలో ఉన్నప్పుడు నాదల్‌ వైదొలిగాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో గత మూడు సందర్భాల్లో పొట్రోను ఓడించిన నాదల్‌ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగాడు. ఐతే పాత గాయం అతడిని ఇబ్బందిపెట్టింది. వేడితో ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ యుఎస్‌ ఓపెన్‌లో అత్యధిక సమయం కోర్టులో ఉన్న ఆటగాడు నాదలే. 15 గంటల 54 నిమిషాలు అతడు పోరాడాడు. బహుశా అది డిఫెండింగ్‌ ఛాంపియన్‌పై బాగానే ప్రభావం చూపినట్టుంది. మ్యాచ్‌లో నాలుగో గేమ్‌ నుంచే అతడు నొప్పితో సతమతమయ్యాడు. ఏడో గేమ్‌లో మోకాలికి పట్టీ కట్టుకున్నాక కాస్త కోలుకున్నట్లే కనపించాడు. 5-4తో ఆధిక్యంలో ఉండి సెట్‌ కోసం సర్వ్‌ చేసిన డెల్‌పొట్రోను అడ్డుకున్నాడు. రెండు సెట్‌ పాయింట్లను కాపాడుకుని సెట్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లాడు. అయినా ఫలితం లేకపోయింది. మరోవైపు అర్జెంటీనా పొడగరి పదునైన షాట్‌లతో చెలరేగటంతో 70 నిమిషాల పోరాటం అనంతరం.. నాదల్‌ తొలి సెట్లో ఓటమి అంగీకరించాడు. రెండో సెట్‌లో మూడు గేమ్‌ల తర్వాత నాదల్‌ చికిత్స తీసుకున్నాడు. అసౌకర్యంగా ఉన్నప్పటికీ పోరాడాడు. అప్పటికి మంచి జోరు మీదున్న పొట్రో రెండుసార్లు నాదల్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 6-2తో సెట్‌ గెలుచుకున్నాడు. పరుగెత్తడానికి ఇబ్బందిపడుతున్న నాదల్‌.. ఇక ఆడలేనని చైర్‌ అంపైర్‌తో చెప్పాడు. 2009లో యుఎస్‌ ఓపెన్‌ నెగ్గిన డెల్‌పొట్రో మరోసారి టైటిల్‌ అందుకోవాలంటే జకోవిచ్‌ను ఓడించాలి. రెండో సెమీస్‌లో జకోవిచ్‌ అలవోకగా విజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో జకోవిచ్‌ 6-3, 6-4, 6-2తో కీ నిషికోరి (జపాన్‌)ను ఓడించాడు. మ్యాచ్‌లో ఏ దశలోనూ నిషికోరి పోటీ ఇవ్వలేకపోయాడు. యుఎస్‌ ఓపెన్‌లో జకోవిచ్‌ ఫైనల్‌ చేరడం ఇది ఎనిమిదోసారి. ఐతే అతడు రెండు సందర్భాల్లో మాత్రమే టైటిల్‌ గెలిచాడు. మొత్తంమీద 23వసారి జకోవిచ్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌ చేరాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com