తెలంగాణాలో ఎన్నికల రణరంగం-TNI ప్రత్యేక వార్తా కథనాలు


తేదేపాకు దూరంగా ఆర్‌.కృష్ణయ్య
తెదేపా అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌భవన్‌కు వచ్చి పార్టీ సమావేశంలో పాల్గొన్నా తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య రాలేదు. తనకు సమాచారం లేనందున రాలేదని ఆయన చెప్పారు. తెదేపా వర్గాలు పిలిస్తే రావడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని వివరించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్నదానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తెరాస తప్ప మిగిలిన పార్టీలన్నీ తనను పిలుస్తున్నాయని కృష్ణయ్య వివరించారు.
*మూడు కమిటీలకు చంద్రబాబు ఆమోదం
ఎన్నికల కోసం తెలంగాణ తెదేపా సమన్వయ కమిటీ, మ్యానిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలను ఏర్పాటుచేసుకుంది. వీటికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. పొత్తులపై బాధ్యతలను ఎల్‌.రమణ, టి.దేవేందర్‌గౌడ్‌, రావుల చంద్రశేఖరరెడ్డి, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు ఉన్న సమన్వయ కమిటీకి అప్పగించారు.
*తేదేపాకు 15సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ సుముఖం!
కాంగ్రెస్‌ పార్టీ తెలుగుదేశానికి గరిష్ఠంగా 15 సీట్లు ఇవ్వడానికి సుముఖంగా ఉంది. తెదేపా నుంచి ఎలాంటి డిమాండ్‌ ఉంది? ఏయే స్థానాలను కోరుతున్నారనే అంశంపై పూర్తి స్పష్టత వచ్చాక పొత్తుల కమిటీ చర్చలు ముందుకు వెళ్లనున్నాయని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు. పొత్తులపై ఏఐసీసీ అధిష్ఠానం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని పేర్కొంటున్న నేతలు రాహుల్‌గాంధీని మూడు నాలుగు రోజుల్లో కలవనున్నారు.
2. 11న తెలంగాణ సీపీఎం నేతలతో జనసేన చర్చలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై ఈ నెల 11, 12వ తేదీల్లో తెలంగాణ సీపీఎం నేతలతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చర్చించనున్నారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(ప్యాక్‌) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు. ఇటీవల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ ప్రతినిధి బృందంతో జరిపిన చర్చలు సామరస్యంగా, ఫలవంతంగా జరిగాయని వాటి సారాంశాన్ని ప్యాక్‌ సభ్యులు తొలుత పవన్‌కల్యాణ్‌కు వివరించారు. అనంతరం తదుపరి చర్చల కోసం సీపీఎం నేతలను ఆహ్వానించాలని ఆయన రాజకీయ వ్యవహారాల కమిటీకి సూచించారు.
3. ఎన్నికల నిర్వహణకు రూ. 308 కోట్లు ఖర్చు
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రకాల అనుమతులు, వనరుల సమీకరణ కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఎన్నికల నిర్వహణ ఖర్చుల కోసం రూ.308 కోట్ల నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషికి ప్రతిపాదనలు పంపారు. మరోవైపు ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించే జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లకు ఎన్నికల సంఘం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనుంది.
4. జానారెడ్డి పై నిప్పులు చెరిగిన నోముల
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే జానా రెడ్డికి కొన్ని అంశాలు గుర్తు చేయాల్సిన సమయం వచ్చిందని టీఆర్‌ఎస్‌ నేత నోముల నర్సింహ్మయ్య వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తే మా పార్టీకి ప్రచారం చేస్తానని జానారెడ్డి గతంలో అన్నారని వెల్లడించారు. వరద కాలువకు ఇరవై ఏండ్ల కింద శంకుస్థాపన చేస్తే మీ హయాం వరకు ఎందుకు పని పూర్తి కాలేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోనే రైతుబంధు కింద రూ.100 కోట్లు వచ్చాయి…జానారెడ్డి చెక్కులు పంపిణీకి వస్తే మంచిదని అన్నారు. జానారెడ్డి మాకు ప్రచారం చేసినా, మా కండువా కప్పుకున్నా నాకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
5. కేసీఆర్.. ముందస్తు కు ఎందుకు వెళ్లారు ప్రజలకు చెప్పాలి.
పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని గతంలో చెప్పిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అర్ధంతరంగా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలపై జూలై 6న లా కమిషన్‌కు లేఖ రాసిన కేసీఆర్, సెప్టెంబర్‌ 6న అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు దిగారని, అందుకు కారణాలను చెప్పకుండా దాటవేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదలతో కేసీఆర్‌కు భయం పట్టుకుందని, టీఆర్‌ఎస్‌కు ఓట్లు దక్కవన్న భయంతో తొమ్మిది నెలల ముందే ఎన్నికలకు పరుగులు పెడుతున్నారన్నారు.
6. దిష్టి బొమ్మలు తగులబెట్టిన వారికీ కేసీఆర్ సీటిచ్చారు.
‘’ఉద్యమకారులకు సీట్లు కేటాయించకుండా కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం సరికాదని, దీనితో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నష్టపోవడం ఖాయమని తెరాస పార్టీ పఠాన్ చేరు నియోజక ఇంచార్జి గాలి అనిల్ కుమార్ అన్నారు .సంగారెడ్డి జిల్లా.. పఠాన్ చేరు నియోజక వర్గ పరిధి లో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ కాలం నుండి గులాబి జెండా మోసి ఉద్యమ సైన్యాన్ని తయారు చేయడంలో ముందున్న నాయకులను కెసిఆర్ విస్మరించాన్నారు. కేసీఆర్ దిష్టి బొమ్మ తగల బెట్టిన వారికీ సీట్లు కేటాయించిన వారికీ గతంలో తెరాస పార్టీని నిలబెట్టు కోడానికి కష్ట బడినామని తెలిపారు. కానీ కేసీఆర్ ఉద్యమ నాయకులను పక్కన బెట్టి తిరిగి వారికే సీట్లో కేటాయించడంతో అంతర్యమేంటని ప్రశ్నించారు. . స్వార్థపూరితంగా కేటాయించిన సీట్లను ఉద్యమకారులకు ఇవ్వకపోతే స్వతంత్రగా బరిలో దిగి కేసీఆర్ కేటాయించిన అభ్యర్థులకు ఓడించడాని సిద్ధమని గాలి అనిల్ కుమార్ హెచ్చరించారు.
7. కోదండరాం పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారు’
ప్రొఫెసర్‌ కోదండరాం తెలంగాణ జనసమితి (టీజేఎస్‌)పై ఆ పార్టీ మహిళా నేత జోత్స్న సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారని, పార్టీలోని సీనియర్‌ నేత కపిల్‌వాయి దిలీప్‌ కుమార్‌ ఈ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. టీజేఎస్‌ బిజినెస్‌ సెంటర్‌గా మారిపోయిందని, ఇది కోదండరాంకు తెలుసో.. తెలియదో అన్నారు. పార్టీలో వసూల్‌ రాజాలు ఎక్కువ మందే ఉన్నారని, దిలీప్‌ కుమార్‌ మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. చులకన భావంతో తనపై దాడిచేస్తున్నారని, సత్యం అనే వ్యక్తిని తనపై దాడికి దింపుతున్నారని బాధపడ్డారు. విశాల్‌ అనే వ్యక్తి తనకు, తన భర్తకు ఫోన్‌ చేసి చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పారు.
8. ఎట్టకేలకు మౌనం వీడిన దానం
ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ నేత దానం నాగేందర్‌కు గులాబీ అధినేత కేసీఆర్‌ ఇంకా టికెట్‌ ఖరారు చేయని సంగతి తెలిసిందే. దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండగా.. గోషామహల్‌ నుంచి పోటీచేయాల్సిందిగా ఆయనను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశించినట్టు కథనాలు వస్తున్నాయి. టికెట్‌ ఖరారు చేయకపోవడంతో దానం అసంతృప్తిగా ఉన్నారని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఎట్టకేలకు మౌనం వీడారు. తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న కథనాలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.
9. జలగం ప్రసాద్ కు ఉత్తమ ఆహ్వానం
హైదరాబాద్ లో మాజీ మంత్రి జలగం ప్రసాదరావు నివాసానికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించిన టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com