బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన తిరుమల

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13న ధ్వజారోహణంతో ఆరంభం కానున్నాయి. ఆలయ శుద్ధిలో భాగంగా కోయిల్ఆళ్వారు తిరుమంజనం మంగళవారం జరగనుంది. ఉదయం ఆరింటికి శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసి స్వామివారి సన్నిధి నుంచి ఉపఆలయాలతో పాటు మందిరాన్ని శుభ్రపర్చనున్నారు. ఇందుకోసం దాదాపు ఆరు గంటలపాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయనున్నారు. ఈనెల 12న ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 13వతేదీ రాత్రి నుంచి వాహనసేవలు ప్రారంభమవుతాయి. వాహనసేవల్లో రాత్రి వేళ సమయాన్ని గంట ముందుకు జరిపి ఎనిమిదింటి నుంచి పది గంటల వరకు నిర్వహించనున్నారు. గరుడసేవను రాత్రి ఏడింటికి ప్రారంభించి అర్ధరాత్రి వరకు కొనసాగించనున్నారు.
ఈ ఏడాది అధికమాసం కారణంగా శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు 13నుంచి, దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలను అక్టోబరు 10 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు ఈ నెల 13వతేదీ రాత్రి శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
2. అష్టలక్ష్ములకు లక్ష గాజుల పూజ
గుంటూరు అరండల్పేట 4/4లోని అష్టలక్ష్మీ ఆలయంలో లక్ష గాజులతో చేపట్టిన ప్రత్యేక అలంకరణ ఆకట్టుకుంది. ఆదివారం శాంతిహోమం, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా కోటి కుంకుమార్చన పూజల అనంతరం అష్టలక్ష్ములకు లక్షగాజుల అలంకరణ చేపట్టారు.
3. 13 నుంచి గణపతి నవరాత్రి మహోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 13 నుంచి 22 వరకు గణపతి మహోత్సవాలు వైభవంగా జరగనున్నట్లు ఆదివారం దేవస్థానం ఈవో శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భ గణపతిస్వామికి, యాగశాలలోని పంచలోహమూర్తికి, సాక్షి గణపతిస్వామికి వ్రతకల్ప విశేషార్చనలు నిర్వహించనున్నట్లు వివరించారు. సాక్షిగణపతి ఆలయం వద్ద మృత్తికా గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.13వ తేదిన ఉదయం 8.30 గంటలకు యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కంకణపూజ, ఋత్విగ్వరణం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 22న ఉదయం 7.30 గంటల నుంచి పూర్ణాహుతి కార్యక్రమంతోఉత్సవాలు ముగుస్తాయన్నారు.
4. శ్రీవారి ఆలయంలో అపచారం నేలను తాకిన శ్రీమలయప్పస్వామి విగ్రహం వెంటనే లఘు సంప్రోక్షణ నిర్వహణ
తిరుమల శ్రీవేెంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం అపచారం చోటు చేసుకుంది. అర్చకుని చేతిలోని శ్రీమలయప్పస్వామి విగ్రహం పట్టుతప్పి నేలను తాకింది. శ్రీవారికి నిత్యం సాయంత్రం వేళ వేయి నేతి దీపాలతో ‘సహస్రదీపాలంకరణ’ సేవ జరుగుతుంది. తిరువీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. శనివారం కూడా తిరువీధి ఉత్సవం అనంతరం ఆలయంలోని గరుడాళ్వారు విగ్రహం పక్కనున్న ఖాళీ ప్రదేశంలో తిరుచ్చి వాహనాన్ని తీసుకువచ్చి ఉంచారు. అందులోని శ్రీదేవి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని శ్రీవారి సన్నిధికి అర్చకులు తీసుకెళ్లారు. అనంతరం మరో అర్చకుడు మలయప్పస్వామి విగ్రహాన్ని స్వామి సన్నిధికి తీసుకొస్తున్న సమయంలో…. జయవిజయుల విగ్రహాల ఎదుట అర్చకుని కాలు మడత పడింది. అర్చకుడు పట్టుతప్పడంతో విగ్రహం నేలను తాకింది. వెంటనే శ్రీవారి యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా లఘు సంప్రోక్షణ నిర్వహించారు. శాంతి యాగం నిర్వహించిన అనంతరం నిలిపివేసిన శ్రీవారి దర్శనాన్ని తిరిగి పునరుద్ధరించారు.
5. అమరావతిలో.. ఆనంద నిలయం
కోరికలు తీర్చే కోనేటిరాయడు, తిరుమల సార్వభౌముడైన వేంకటేశ్వరస్వామి ఏడుకొండలు దిగి అమరావతికి రానున్నాడు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి రెండో తిరుమలగా రూపుదిద్దుకోనుంది. పవిత్ర కృష్ణానదీ తీరంలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.140 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం అమరావతిలో నిర్మాణం కానుంది. ప్రాచీన శిల్పకళా నిలయంగా, అపురూప ప్రకృతి సౌందర్యాన్ని ప్రకటించేలా నిర్మాణాన్ని తీర్చిదిద్దేందుకు ఇప్పటికే స్థపతులు తగిన ప్రణాళికలు సిద్ధం చేశారు.ఆంధ్రులకే కాదు.. దేశానికే కొంగుబంగారమైన దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి. వేలాది సంవత్సరాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్న తిరుమలలోని శిల్పకళ, అక్కడి ప్రకృతి రమణీయత చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇంతటి మధురానుభూతి కలిగించే శ్రీవారిని దర్శించుకోవాలంటే… నిజంగా ఓ సాహసయాత్ర చేయాల్సిందే.. కానీ, ఈ ఇబ్బందులేమీ లేకుండా ఎంతో ప్రశాంతంగా శ్రీవారి దర్శనభాగ్యం అమరావతివాసులకు త్వరలో కలగనుంది. పూర్తిగా తిరుమల తరహాలోనే శ్రీవారి ఆలయాన్ని నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించేందుకు తితిదే శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
**అపురూప శిల్పకళా నిలయం
శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా తిరుమల తరహాలో భారతీయ సనాతన శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించనున్నారు. పూర్తిగా రాతికట్టడంగా నిర్మిస్తున్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళా రీతులు ప్రతిబింబించేలా నిర్మిస్తారు. ఈ తరహాలో స్థపతులు ఆలయ ప్రాకారం, ఆనందనిలయం, ఉపాలయాల ఊహాచిత్రాల్ని తయారుచేశారు. వీటన్నిటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించి, ఆమోదం తెలిపారు. దీంతో నిర్మాణపనులు అధికారికంగా ప్రారంభించటానికి మార్గం సుగమమైంది.
ఆలయ నిర్మాణానికి సంబంధించి ఆగమశాస్త్రాలు చెబుతున్న నిబంధనల్ని పూర్తిగా అమలుచేస్తున్నారు. కాశ్యప శిల్పశాస్త్రం, మానససరం స్ఫూర్తిగా తీసుకుని, ఎక్కడెక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలనే విషయంలో ఇప్పటికే ఆగమపండితులు స్పష్టమైన నిర్ణయం చేశారు. స్వామి వారి విగ్రహం పడుకుని ఉన్నట్లు భావిస్తే గర్భాలయం శిరస్సుగా, అంతరాలయం మెడభాగంగా, మహామంటపం భుజాలుగా, తర్వాతి దిగువ భాగంగా; స్వామి వారి పాదాలు ఉండే ప్రాంతం నంది, ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ గోపురం ఉండే ప్రాంతాలుగా ఉండేట్లు నిర్మించనున్నారు. తమిళనాడులోని కాంచీపురం కైలాసనాథ ఆలయం, వైకుంఠ పెరుమాళ్‌ ఆలయాలకు దీటుగా ఉండేలా నవీన ఆలయం రూపుదిద్దుకుంటుంది. తంజావూరులోని ద్రవిడ తరహా నిర్మాణాలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన హంపి విఠలాలయం, ఇతర ఆలయాల తీరు కూడా మేళవించి, ఇతర ప్రాకారాలను నిర్మింస్తారు. మొత్తంగా విభిన్న భారతీయ శిల్పకళా సంస్కృతుల నిలయంగా అమరావతి ఆలయం నిర్మాణం జరుపుకుంటుంది. యోగశాస్త్రపరంగా మనిషిలో ఉండే మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలను పోలిఉండేలా నూతన ఆలయంలో నిర్మాణాలు ఉంటాయి. ఆధ్మాత్మికపరంగా, యోగశాస్త్రపరంగా భక్తులకు ఉత్తేజాన్ని కల్పించేలా శ్రీవారి నూతన ఆలయాన్ని నిర్మిస్తారు.
**ప్రారంభమైన పనులు
ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే స్థల నిర్ణయం జరిగింది. ప్రస్తుతం స్థలాన్ని చదునుచేసి, వ్యర్థాలు తొలగించే పనులు జరుగుతున్నాయి. అవసరమైన అనుమతులు, ఇతర వ్యవస్థాపరమైన పనులు పూర్తిచేసి, నవంబరులో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తితిదే కార్యనిర్వహణాధికారి అనిల్‌సింఘాల్‌ ప్రకటించారు. రెండేళ్ల కాలవ్యవధిలో నిర్మాణం పూర్తవుతుంది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తికావటంతో ఇక్కడి ఆధ్యాత్మిక ముఖచిత్రం పూర్తిగా మారనుంది. పంచారామాల్లో మొదటిక్షేత్రంగా, ప్రముఖ శైవక్షేత్రంగా అమరావతి ఇప్పటికే ప్రపంచప్రసిద్ధి పొందింది. ఇప్పుడు శ్రీవారి ఆలయం కూడా నిర్మితం కానుండటంతో శివకేశవుల అద్భుత ఆలయాల కొలువుగా అమరావతి సరికొత్త ఖ్యాతి సంతరించుకుంటంది. అంతర్జాతీయ యాత్రికులు కూడా అమరావతిని సందర్శించే అవకాశాలు మరింతగా మెరుగవుతాయి.
6. తిరుమల సమాచారం
ఉ!! 6 గంటల సమయానికి
తిరుమల°:21C° – 25C°,
నిన్న *85,007* మంది
భక్తులకు స్వామివారి దర్శన
భాగ్యం కల్గినది,
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *23* గదుల్లో భక్తులు సర్వదర్శనం* కోసం
వేచియున్నారు,
శీఘ్రసర్వదర్శనం* టోకెన్
పొందినవారి వారికి *03*
గంటల సమయం
పట్టవచ్చును,
ఈ సమయం సర్వదర్శనం
*టైమ్ స్లాట్* టోకెన్
పొందువారిని *20* గంటల
అనంతరం క్యూ లోకి
అనుమతిస్తారు,
ప్రత్యేక దర్శనం* Online
(₹: 300) వారికి *02
గంటల సమయం
పట్టవచ్చును,
శ్రీవారి *దివ్యదర్శనం*
(కాలినడక మార్గం ద్వారా)
అలిపిరి లో *14* వేలు
శ్రీవారి మెట్టు లో *6* వేలు
టోకెన్లు జారీ చేయబడును,
దివ్యదర్శనం *(20వేలు)
కోటా పూర్తి అయిన
తరువాత వచ్చే భక్తులు,
సర్వదర్శనం భక్తులతో కలిసి
శ్రీవారిని దర్శించుకోవాల్సి
ఉంటుంది,
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹:3.50* కోట్లు,
నిన్న *29,989* మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com