DailyDose

సుజనా అమెరికా వెళ్లవచ్చు-తాజావార్తలు

సుజనా అమెరికా వెళ్లవచ్చు-తాజావార్తలు

* కేంద్రం జారీచేసిన లుక్‌ఔట్‌ నోటీసులతో ఆగిన ఎంపీ సుజనాచౌదరి అమెరికా ప్రయాణానికి తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈనెల 15 నుంచి రెండు వారాల పాటు అమెరికా వెళ్లడానికి అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. తనపై ఉన్న లుక్‌ఔట్‌ నోటీసులను సవాలు చేస్తూ.. న్యూయార్క్‌లో తన మామ అనారోగ్యంతో ఉన్నారని, అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని సుజనాచౌదరి అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ చల్లా కోదండరాం ఇంటి వద్ద విచారించారు. సీబీఐ, కేంద్రం తరఫు న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం.. పిటిషనర్‌ ఎంపీ అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రెండు వారాలపాటు అమెరికా వెళ్లడానికి అనుమతించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గడువులోగా తిరిగి రాగానే ఇమ్మిగ్రేషన్‌ శాఖకు, సీబీఐకి సమాచారం ఇస్తాననే హామీ ఇవ్వాలని షరతు విధించారు.

* అప్పులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసిన రంగారెడ్డి జిల్లా కాశగూడెం సర్పంచ్‌ షేక్‌ అజారుద్దీన్‌ ఆత్మహత్యకు సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి బదులు ఆత్మహత్యలే కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు సీఎంకు కోమటిరెడ్డి బహిరంగ లేఖ రాశారు. పాల‌న గాలికి వదిలేసి గ్రామాలు అభివృద్ధి చెందకుండా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. అందుకే కాశగూడెం సర్పంచ్‌ అప్పులు చేసి గ్రామాభివృద్ధికి ఖర్చుచేశారని.. చివరికి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసి ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైన యువ సర్పంచ్‌ బతికేవాడని చెప్పారు. అజారుద్దీన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఏక‌గ్రీవంగా ఎన్నికైన గ్రామాల‌కు వెంట‌నే నిధులు విడుద‌ల చేయాలని ఆయన కోరారు.

* ఏపీ సీఎం జగన్‌ రోజుకో దుష్ట సంప్రదాయంతో రాష్ట్ర ప్రజల ప్రతిష్ట, లౌకిక విలువల్ని దిగజారుస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈనెల 18న విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానంద పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 23 దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలన్న దేవాదాయ శాఖ ఆదేశాలను యనమల తప్పుబట్టారు.

* తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చిన్నారులందరికీ ట్విటర్‌ వేదికగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాల్యంలోనే కొందరు భయంకర అఘాయిత్యాలను ఎదర్కోవాల్సి వస్తుందన్నారు. అఘాయిత్యాలు ఇలాగే కొనసాగితే రేపటి సమాజాన్ని ఊహించుకుంటేనే భయమేస్తోందని పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి రేపటి పౌరుల గురించి ఆలోచించాలని సూచించారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి యువత ఉపాధికి గండికొట్టడం విషాధకరమన్నారు. ఇలాగైతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలని చంద్రబాబు ప్రశ్నించారు.

* సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ నాయకత్వంలో మన సైన్యం పాకిస్థాన్‌ కవ్వింపులను గట్టిగా తిప్పికొట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రికి ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి.. కిషన్‌ రెడ్డికి శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్లు అందజేశారు.

* ఉత్తరప్రదేశ్‌లో భాజపా హయాంలో అవినీతి పెరిగిపోయిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. రాబోయే 2022 ఎన్నికల్లో ఎస్పీ నుంచి విడిపోయి ప్రత్యేక పార్టీ పెట్టిన తన బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌తో కలిసి బరిలోకి దిగేందుకు సానుకూల సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రాబోయే ఎన్నికల్లో చిన్న పార్టీలతోనే సర్దుకు పోతాం కానీ.. పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. బీఎస్పీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. శివపాల్‌ యాదవ్‌కు చెందిన ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు కుదిరితే ఆ పార్టీ నాయకుడికి కేబినెట్‌ బెర్త్‌ ఇవ్వడానికి సిద్ధం’ అని అఖిలేశ్‌ తెలిపారు.

* నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ బలగాల కాల్పులపై భారత్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిన్నటి కాల్పుల ఘటనపై పాకిస్థాన్‌ తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత్‌లోని పాకిస్థాన్‌ హైకమిషనర్‌కు సమన్లు జారీచేసిన విదేశాంగ మంత్రిత్వశాఖ నిరసన తెలిపింది. దీపావళి వేళ ఉద్దేశపూర్వకంగానే పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పౌరులపై దాడులను ఖండించింది. ఎలాంటి కవ్వింపులు లేకుండానే పలు సెక్టార్లలో పాక్‌ జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోయారని, మరో 19మంది గాయపడ్డారని మండిపడింది.

* అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించారు. ఫలితాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని బైడెన్‌ సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించాయి అమెరికా ప్రధాన మీడియా సంస్థలు. కాగా.. శుక్రవారం నాటికి అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. కీలకమైన జార్జియా డెమొక్రాట్ల వశమవగా.. ఉత్తరకరోలినాలో ట్రంప్‌ గెలిచినట్లు యూఎస్‌ మీడియా వెల్లడించింది. తాజా ఫలితాలతో బైడెన్‌ ఖాతాలో 306 ఎలక్టోరల్‌ ఓట్లు చేరగా.. ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి.

* ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలను హైదరాబాద్‌లో జరుపుకొన్నారు. నగరంలోని ఆయన కుమారుడి నివాసంలో దీపాలు వెలిగించారు. తన సతీమణి ఉషానాయుడుతో కలిసి వెంకయ్యనాయుడు దీపాలు వెలిగించి వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీపం వెలుగులతో చీకటి మాయమైనట్లే.. దీపావళి కాంతులతో అందరి జీవితాల్లో మంచి మార్పు రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

* కరోనావైరస్ కట్టడికి ప్రస్తుత ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాల్సి ఉందని అమెరికాకు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ హెచ్చరించారు. ఆ దేశంలో మహమ్మారి విజృంభణ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ రోజుకు లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం సర్వసాధారణంగా మారింది. దాంతో ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

* సంవత్‌ 2077కు దేశీయ మార్కెట్లు లాభాలతో స్వాగతం పలికాయి. దీపావళిని పురస్కరించుకుని గంటపాటు జరిగే మూరత్‌ ట్రేడింగ్‌లో సూచీలు అదరగొట్టాయి. ఆరంభంలో భారీ లాభాల్లోకి వెళ్లినప్పటికీ.. స్వల్పంగా లాభాలను పోగొట్టుకున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమైన ట్రేడింగ్‌లో సూచీలు తొలుత భారీ లాభాలను నమోదు చేశాయి. కాసేపటికి మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు కొంతమేర ఆవిరయ్యాయి. సెన్సెక్స్‌ 194.98 పాయింట్ల లాభంతో 43,637.98 వద్ద ముగిసింది. నిఫ్టీ 50.60 పాయింట్ల లాభంతో 12,770.60 వద్ద స్థిరపడింది.

* కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో వెలువరించిన అభిప్రాయాన్ని శనివారం శివసేన పార్టీ తప్పుపట్టింది. పని పూర్తి చేసి ఉపాధ్యాయుడి మెప్పును పొందాలని విద్యార్థి ఎలా ఆరాటపడతారో అలాంటిదే తప్పిస్తే ప్రావీణ్యం సంపాదించాలనే తపన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలో లేదని ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్’ పేరుతో రాసిన పుస్తకంలో ఒబామా అభిప్రాయడ్డారు. కాగా, దీనిపై సేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు.

* చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఇండో-టిబెటిన్‌ జవాన్లు -20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో శనివారం దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న లద్దాఖ్‌ మంచుప్రాంత ఉష్ణోగ్రత ప్రస్తుతం సున్నా డిగ్రీల కన్నా తక్కువగా ఉంటుంది.. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా దీపావళి సందర్భంగా జవాన్లు ఆనందంగా నృత్యాలు చేశారు. భారత మాజీ ప్రధాని వాజ్‌పేయ్ కంపోజ్‌ చేసిన ‘అహో ఫిర్‌ ఫిర్‌ దియా జాలేనా’అనే పాటను పాడుతూ నృత్యాలు చేశారు.

* ఇన్‌స్టాగ్రామ్‌.. కుర్రకారు హృదయాల్లో మారుమోగుతున్న పేరు. ఉదయం స్టోరీతో మొదలెడితే.. రాత్రి ఇన్‌స్టాఫీడ్‌తో ముగిస్తున్నారు నేటితరం. అంతలా ఇన్‌స్టాని ఇష్టపడుతోంది యువత. మరి ఇన్‌స్టాగ్రామ్‌ మీ ఖాతాని ధ్రువీకరించాలంటే.. అది అంత సులభమే అంటారా? అసలీ వెరిఫైడ్‌ అకౌంట్‌ అంటే ఏంటి? ఎవరి ఖాతాను ఇన్‌స్టా ధ్రువీకరిస్తుంది?అసలీ ధ్రువీకరణ వల్ల ఉపయోగాలేంటి? మీరే చదవండి.

* టీమిండియాతో జరగనున్న టెస్టు సిరీస్‌పై ఏకాగ్రత ఉంచడానికి ఆస్ట్రేలియా యువ క్రికెటర్‌ విల్‌ పకోస్కీ సామాజిక మాధ్యమాలకు దూరమయ్యాడు. గత కొన్ని రోజులుగా పకోస్కీ గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 22 ఏళ్ల అతడు షెఫీల్డ్ షీల్డ్‌ టోర్నీలో వరుసగా రెండు డబుల్‌ సెంచరీలతో సత్తాచాటి భారత్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యాడు. అంతేగాక బర్న్స్‌ స్థానంలో పకోస్కీ తుదిజట్టులో చోటు సంపాదించి వార్నర్‌తో ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 79,823 కరోనా పరీక్షల నిర్వహించగా.. 1,657 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. ఏడుగురు బాధితులు మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,52,955కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,854 మంది కొవిడ్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.