* కొవిడ్ ముందు వరకు పెట్రోలియం ఉత్పత్తులకు గిరాకీ ప్రతి నెలా పెరుగుతూ వచ్చేది. ఒక నెల వినియోగాన్ని, అంతకుముందు ఏడాది అదే నెల గిరాకీతో పోల్చి ఎంత వృద్ధి లభించిందీ ఇంధన సంస్థలు వెల్లడిస్తుంటాయి. అయితే ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్త లాక్డౌన్ విధించినప్పటి నుంచి పరిస్థితులు మారాయి. ప్రజా రవాణా, వ్యక్తిగత వాహనాల రాకపోకలకు ఆంక్షలు ఉన్న సమయంలో, ఇంధనానికి గిరాకీ బాగా తగ్గింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలైన ఏప్రిల్ అయితే ఇంధన గిరాకీ 49 శాతం తగ్గడం గమనార్హం. మే నుంచి అన్లాక్ ప్రారంభమయ్యాక, క్రమంగా ఇంధనానికి గిరాకీ క్రమంగా పెరుగుతోంది. అయితే 2019 అదే నెలలతో పోలిస్తే వార్షిక వృద్ధి మాత్రం లభించలేదు. పండుగ సీజన్ రావడంతో గత నెల (అక్టోబరు)లో ఇంధన గిరాకీ 2.5 శాతం అధికమై 17.77 మిలియన్ టన్నులకు చేరింది. 2019 అక్టోబరులో 17.34 మిలియన్ టన్నుల ఇంధనమే వినిమయమైంది. కొవిడ్ సంక్షోభం ఆరంభమయ్యాక, ఒక నెలలో వార్షిక వృద్ధి లభించడం ఇదే తొలిసారి. పండుగ సీజన్ కావడంతో, ప్రజా-సరకు రవాణా వాహనాల రాకపోకలు అధికమై, డీజిల్ వినియోగం కొవిడ్ ముందటి స్థాయికి చేరడమే ఇందుకు కారణం. వ్యక్తిగత రవాణా వల్ల పెట్రోల్ వినియోగం సెప్టెంబరులోనే కొవిడ్ ముందటి స్థాయికి చేరింది. విద్యా సంస్థలు ప్రారంభమైతే, ఇంధన గిరాకీ మరింత పెరుగుతుంది.
* సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత ప్రయాణ పరిమితుల్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సడలించడంతో పాటు పండుగల సీజన్ కావడంతో ప్రజలు ప్రయాణాలకు ఉత్సుకత కనబరుస్తున్నారని ఆన్లైన్ టికెటింగ్ సంస్థ అభిబస్ వెల్లడించింది. కొవిడ్ లాక్డౌన్ అనంతరం జూన్-అక్టోబరులో ఆన్లైన్ బస్ బుకింగ్లు 100 శాతం మేర పెరిగి, 50 లక్షల టికెట్లు బుక్ అయ్యాయని తెలిపింది. ఈ సంస్థ 300కు పైగా ప్రైవేటు, 5 ఆర్టీసీ (రోడ్డు రవాణా సంస్థలు) ఆపరేటర్లకు ఆన్లైన్ రిజర్వేషన్లకు సేవలు అందిస్తోంది. గత ఏడాది నవంబరులో కంపెనీ బస్ టికెట్ల బుకింగ్లతో పోలిస్తే ప్రస్తుత నెలలో మొత్తం బుకింగ్ల సంఖ్య అధిగమించే అవకాశం ఉందని తెలిపింది. ‘కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో రాష్ట్రం లోపల 80 శాతం, అంతర్రాష్ట్రాల మధ్య 20 శాతం మాత్రమే ప్రయాణ బుకింగ్లు జరిగాయి. అన్లాక్ 5.0 తర్వాత అంతరాష్ట్ర ప్రయాణాలు 70 శాతానికి, రాష్ట్రం లోపల ప్రయాణాలు 30 శాతానికి చేరాయ’ని అభిబస్ ముఖ్య నిర్వహణాధికారి రోహిత్ శర్మ వెల్లడించారు. దసరా వారాంతంలో సరాసరి రోజువారీ బుకింగ్లు 50,000 నమోదయ్యాయని అభిబస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం జరిగి, అక్టోబరు చివర్లో కార్యకలాపాలు ప్రారంభమైనా, హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఏకంగా 84,000 బస్ బుకింగ్లు అయ్యాయని అభిబస్ తెలిపింది. దిల్లీ-జమ్ము మార్గంలో 31,000 బుకింగ్లు నమోదయ్యాయి. నవరాత్రుల సందర్భంగా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో రావడం కలిసొచ్చిందని అభిబస్ పేర్కొంది.
* సంవత్ 2077కు దేశీయ మార్కెట్లు లాభాలతో స్వాగతం పలికాయి. దీపావళిని పురస్కరించుకుని గంటపాటు జరిగే మూరత్ ట్రేడింగ్లో సూచీలు అదరగొట్టాయి. ఆరంభంలో భారీ లాభాల్లోకి వెళ్లినప్పటికీ.. స్వల్పంగా లాభాలను పోగొట్టుకున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమైన ట్రేడింగ్లో సూచీలు తొలుత భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 380 పాయింట్ల మేర దూసుకెళ్లింది. కాసేపటికి మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు కొంతమేర ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 194.98 పాయింట్ల లాభంతో 43,637.98 వద్ద ముగిసింది. నిఫ్టీ 50.60 పాయింట్ల లాభంతో 12,770.60 వద్ద స్థిరపడింది.
* కర్ణాటక రాజధాని బెంగళూరు పురపాలక సిబ్బందికి ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా సర్ప్రైజ్ ఇచ్చారు. దీపావళిని పురస్కరించుకుని బెంగళూరు పరిధిలోని 27వేల మంది పురపాలక సిబ్బందికి స్వీట్ బాక్సులను పండగ కానుకగా పంపించారు. పండగ రోజు వారి జీవితాల్లో సంతోషం నింపేందుకు మిఠాయిలు పంపించానని కిరణ్ మజుందార్ షా తెలిపారు.
* సెప్టెంబరులో భారత సేవల ఎగుమతులు 1.4 శాతం తగ్గి 17.29 బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు స్పష్టం చేశాయి. సేవల ఎగుమతులు 2019 సెప్టెంబరులో 17.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సేవల దిగుమతులు సైతం 11.10 బిలియన్ డాలర్ల నుంచి 8.7 శాతం తగ్గి 101.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్- సెప్టెంబరు మధ్య సేవల ఎగుమతులు 100.97 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 58.98 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
* మన విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు తాజా జీవన కాల గరిష్ఠానికి చేరాయి. ఈ నెల 6తో ముగిసిన వారానికి అంత క్రితం వారంతో పోలిస్తే ఫారెక్స్ నిల్వలు 777.9 కోట్ల డాలర్లు పెరిగి, 56,849.4 కోట్ల డాలర్లకు చేరాయి. గత నెల 30తో ముగిసిన వారంలో 18.3 కోట్ల డాలర్ల మేర నిల్వలు పెరగడంతో 56,071.5 కోట్ల డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే. సమీక్షా వారంలో ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్సీఏ) బాగా పెరగడంతోనే మొత్తం నిల్వలు పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఎఫ్సీఏలు 640.3 కోట్ల డాలర్లు పెరిగి, 52,474.2 కోట్ల డాలర్లు నమోదయ్యాయి. పసిడి నిల్వలు కూడా 132.8 కోట్ల డాలర్ల మేర పెరిగి, 3,758.7 కోట్ల డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) వద్ద మన దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు 70 లక్షల డాలర్ల మేర పెరిగి, 148.8 కోట్ల డాలర్లకు చేరాయి. అలాగే దేశ నిల్వల స్థితి కూడా 4 కోట్ల డాలర్ల మేర పెరిగి, 467.6 కోట్ల డాలర్లకు చేరింది.