కాంగ్రెస్ తోక తెదేపానా? ఎన్‌టీఆర్ క్షోభిస్తున్నారు.

తెలంగాణకు అడ్డం పడిన రెండు గడ్డాలు ఒక్కటవుతున్నాయని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ సభాపతి కేఆర్ సురేశ్‌రెడ్డి తెరాసలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, తెదేపా పొత్తుపై తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, చంద్రబాబు తెలంగాణలో ఒక్కటవుతున్నారని, కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన తెదేపాను కాంగ్రెస్‌కు తోక పార్టీగా మార్చిన ఘనత చంద్రబాబు, ఎల్‌.రమణలకే దక్కిందన్నారు. ఈ రోజు ఉదయం పేపర్లో ఉత్తమ్‌, రమణ ఇంకా కొందరు నేతల ఫొటో చూస్తే తనకెంతో సంతోషమన్పించిందన్నారు. జుగుప్సాకరమైన, అపవిత్రమైన, నీచమైన కలయికతో రాజకీయంగా వారికి ఏం ఒరుగుతుందో తెలియదు గానీ ప్రజలకు మాత్రం ఓ ప్రత్యామ్నాయం ఎంచుకొనేందుకు ఇదో సువర్ణావకాశమన్నారు. తెలంగాణను 50 ఏళ్లు కాంగ్రెస్‌, 17 ఏళ్లు తెదేపా పాలించిన తరువాత కేవలం నాలుగున్నరేళ్లు మాత్రమే తెరాస పాలించిందన్నారు. రైతులను రాబందుల్లా పీక్కుతిన్నవారు కావాలా? రైతుబంధువై అన్నదాతల మనస్సు గెలుచుకున్న తెరాస కావాలో ప్రజలు తేల్చుకొనే సమయం వచ్చిందన్నారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన చంద్రబాబు, ముదిగొండలో కాల్పులు జరిపిన కాంగ్రెస్‌ ఒక్కటవుతున్నాయని మండిపడ్డారు. రైతులపై కాల్పులు జరిపినవారు ఒక్కటయ్యారని, తాము మాత్రం రైతులకు ఎంతగానో మేలుచేస్తున్నారని తెలిపారు. దశాబ్దాల పాటు పాలించినా కరెంటు ఇవ్వకుండా కోతలతో సతాయించి రాష్ట్రాన్ని దౌర్భాగ్యంలోకి నెట్టిన వారు ఒకవైపు.. 24గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ మరో వైపు ఉన్నారని అన్నారు. ఆ రెండు పార్టీలను వాయించి వాయించి ఒకటే సారి దెబ్బకొట్టే అవకాశం ప్రజలకు దక్కిందన్నారు. తెలంగాణ పోరాటం ఆత్మగౌరవం కోసం జరిగిందన్న కేటీఆర్‌.. తెలంగాణవాళ్లే ఈ రాష్ట్రాన్ని పాలిస్తే న్యాయం జరుగుతుందని ఆచార్య జయశంకర్‌సార్‌ చెప్పిన విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతిదానికోసం అమరావతి, దిల్లీ వైపు చూద్దామా? గల్లీలోనే నిర్ణయాలు తీసుకుందామా ఆలోచించుకోండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ను గద్దె దించేవరకు గడ్డం తీయబోనని ఉత్తమ్‌కుమార్‌ అంటున్నారనీ.. ఆయన గడ్డం తీయకపోతే ఎవరికీ వచ్చిన నష్టంలేదని అన్నారు. గడ్డం పెంచుకున్నవాళ్లంతా గబ్బర్‌సింగ్‌ అయిపోతారా? అని ప్రశ్నించారు. ఎన్నికలు అర్ధరాత్రి వచ్చినా మేం రెడీ అంటూ ప్రగల్భాలు పలికిన నేతలంతా నిన్న ఎన్నికల సంఘం అడిగితే ఎన్నికలకు తొందరేముందన్న రీతిలో మాట్లాడారని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీ ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టపడదని, ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికలు రావాలని కోరుకుంటాయన్నారు. కానీ తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com