DailyDose

ట్రంప్‌పై చర్యలకు ఉపక్రమిస్తున్న బైడెన్-తాజావార్తలు

Breaking News - Biden Team Moves To Legal Action Against Trump

* అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడుస్తు్న్నా.. అధికార మార్పిడిపై ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు. అధ్యక్షుడు ట్రంప్‌ ఓటమిని అంగీకరించేందుకు ఇంకా నిరాకరిస్తుండడంతో ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. మరోవైపు అధికార బదిలీలో కీలక పాత్ర పోషించే ‘జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌’(జీఎస్‌ఏ) విభాగం బైడెన్‌ గెలుపును ఇంకా అధికారికంగా గుర్తించలేదు. దీంతో బైడెన్‌ బృందం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యోచిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

* దీపావళి వేడుకలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘనంగా జరుపుకున్నారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో ట్రంప్‌ సతీసమేతంగా పాల్గొన్నారు. అధికారులతో కలిసి దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైట్ హౌస్ సిబ్బందితోపాటు పలువురు భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికా చాలా నమ్మకమైన దేశమని, ప్రతిఒక్కరు అమెరికన్‌ రాజ్యాంగబద్దంగా స్వేచ్ఛగా జీవించేలా తన పాలన కొనసాగినందుకు గర్విస్తున్నానని తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటామని గుర్తుచేశారు. దీపావళి కాంతుల్లా.. అమెరికా ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలని, ప్రజలంతా మతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించాలని ఆకాంక్షించారు.

* కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నెలలో కరోనా పాజిటివ్‌గా తేటడంతో గుర్‌గ్రామ్‌లోని ప్రముఖ మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆరోగ్యం విషమంగా మారడంతో ఐసీయూలోకి తరలించారు. అక్టోబర్‌ 1 నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తలెత్తిందని చెప్పారు. మరోవైపు అ‍హ్మద్‌ పటేల్‌ ఆరోగ్యంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా కోలుకుని అరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు.

* కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దేశ రాజధానిలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. దీపావళి తర్వాత వైరస్‌ ఉధృతి, దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు, కోవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు.

* పోలవరంపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని మంత్రి అనిల్ కుమార్‌ అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించారని తప్పుడు కథనం ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు తుడుచుకోవడానికి కూడా ఆ పేపర్ పనికి రాదని ఎద్దేవా చేశారు. దిక్కుమాలిన పేపర్లు అడ్డం పెట్టుకుని చంద్రబాబు పిచ్చి రాతలు రాయిస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రంలో దాక్కుని కారు కూతలు కూయొద్దని హెచ్చరించారు.

* దుబ్బాకలో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో పీసీసీ మార్పు అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. సీనియర్ల నుంచి పార్టీ కార్యకర్తలు సైతం ఉత్తమ్‌ను తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. విజయశాంతి, మధుయాష్కీ, జంగారెడ్డి లాంటి నేతలు నిరసన స్వరం వినిపించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని మార్చకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఎంపీ రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్‌ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం డిమాండ్‌ చేస్తోంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై దూకుడుగా వ్యవహరిస్తూ.. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న రేవంత్‌కు పార్టీ పగ్గాల అప్పగిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే హస్తం పార్టీలోని ఓ వర్గం మాత్రం రేవంత్‌ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 17నెలల్లోనే అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని తెలిపారు. సాంబశివ రావుపేటలో గుంటూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 90శాతం పైగా కేవలం అధికారంలోకి వచ్చిన 15నెలల లోపు అమలు చేశామని ఆయన తెలిపారు.

* నగర ప్రజలకు పంచతత్వ పార్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్‌లో నిర్మించిన ఆక్యుప్రెజర్‌ వాకింగ్‌ ట్రాక్‌ను మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎనిమిది అంశాలతో ఎకరం విస్తీర్ణంలో ఈ ట్రాక్‌ను నిర్మించారు. కంకర రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో నిర్మించిన ఈ ట్రాక్‌ మీద నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా ట్రాక్‌ సర్కిల్‌లో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ ‌గౌడ్‌‌, నగర మేయర్‌ బొంతు రామ్మెహన్, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పాల్గొన్నారు.

* ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కొరడాతో కొట్టించుకున్నారు. ఆదివారం దుర్గ్‌ జిల్లాలోని జజంగిర్‌ గ్రామంలో జరిగిన గోవర్ధన్‌ పూజలో ఆయన పాల్గొన్నారు. రాష్ర్ట ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని చేతి మీద కొరడాతో పలుమార్లు కొట్టించుకున్నారు. ఆ రాష్ర్టంలో ఏటా దీపావళి అనంతరం గోవర్ధన్‌ పూజ జరుగుతుంది. ఈ పూజలో ప్రతి సంవత్సరం పాల్గొనే సీఎం ప్రజల శ్రేయస్సు కోసం కొరడాతో కొట్టించుకునే ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.

* సీట్ల పంపకంలో ఆలస్యం జరగడం వల్లే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి ఓటమి పాలైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తారిఖ్‌ అన్వర్‌ అన్నారు. దీన్నుంచి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గుణ పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రదర్శన చాలా పేలవంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఫలితాలపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉందని, దీనిపై ఆత్మపరిశీలన, సమగ్ర విశ్లేషణ అవసరమని పేర్కొన్నారు. బిహార్‌ ఎన్నికల ఫలితాలపై ఆయన ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

* కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సర్వీసురోడ్‌లోని ఓ హార్డ్‌వేర్‌ దుకాణంలో తెల్లవారుజామున విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటీన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు భారీ శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. దుకాణంలో ఎలక్ట్రిక్‌ గృహోపకరణాలు, పెయింట్‌ డబ్బాలు, ప్లైవుడ్‌ సామగ్రి ఉండటంతో పైఅంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆస్తి నష్టం రూ.లక్షల్లో ఉంటుందని సమాచారం.

* పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉపేక్షించేది లేదని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రాజెక్టు విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేదుకు పోలవరం ఆ పార్టీ నేతల ఇంటి ప్రహరీ కాదని ఆక్షేపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖను దోపిడీ చేస్తూ అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప విశాఖకు వైకాపా చేసిందేముంది? అని నిలదీశారు. ఉన్న పెట్టుబడులు తరిమేయడం తప్ప గొప్పగా విశాఖకు వైకాపా చేసిందేమీ లేదని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖలో విధ్వంసం ప్రారంభమైందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

* పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. ప్రణాళిక ప్రకారమే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో మహానగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ మారథాన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ పోలవరంపై కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. నిధుల కొరత ప్రతి ప్రభుత్వానికీ సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని విజయసాయిరెడ్డి చెప్పారు.

* నగరంలో రెండు నెలలుగా వరదనీటితో ఇబ్బంది పడుతున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రెండు నెలల నుంచి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలుకాలనీల్లో వరదనీటిలో వెయ్యి ఇళ్లు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా బురద నీటిలో విలవిల్లాడుతున్న ఉస్మాన్ నగర్, సయిఫ్ నగర్, అబ్దుల్లా యహియా నగర్ వాసులు పడుతున్న బాధలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటివరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రాలేదని ఆక్షేపించారు.

* బిహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి తరఫున ముఖ్యమంత్రిగా మరోసారి నీతీశ్‌ కుమార్‌ ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ఎన్డీయే శాసనసభ పక్ష నేతగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో భాజపా పక్ష నేతగా తార్‌ కిషోర్‌ ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సుశీల్‌ కుమార్‌ మోదీ తెలిపారు. సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసిన నీతీశ్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. కూటమి సమావేశంలో భాజపా నుంచి రాజ్‌నాథ్‌ సింగ్, భూపేంద్ర యాదవ్‌, దేవేంద్ర ఫడణవీస్‌ వంటి నేతలు పాల్గొన్నారు. బిహార్‌ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి సమావేశమవడం ఇదే తొలిసారి.

* ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అక్టోబర్‌ 5న కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్‌ 14న ఆయనకు కరోనా నెగెటివ్‌ వచ్చింది. అయితే ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందారు.