వివిధ సంస్థలు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ప్రయోగాల కోసం ఇప్పటికే వాలంటీర్ల ఎంపిక పూర్తయ్యింది. తాజాగా రెండు, మూడో దశ ప్రయోగాలను కాన్పూర్‌లో జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే వారంలోగా వ్యాక్సిన్ డోసులు కాన్పూర్‌కు చేరుకుంటాయని అక్కడి గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీ వెల్లడించింది. రష్యా వ్యాక్సిన్ ప్రయోగాలను భారత్‌లో చేపట్టేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అనుమతి పొందిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగాలను కాన్పూర్‌లో నిర్వహిస్తుండగా, దాదాపు 180 మంది వాలంటీర్ల ఎంపిక పూర్తయ్యింది. వీరికి తొలుత ఒక డోసు వ్యాక్సిన్ అందిస్తారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన తర్వాత మరో డోసు ఇవ్వాలా? లేదా? అనే విషయాన్ని నిపుణులు నిర్ణయిస్తారు. ఒకవేళ రెండు, మూడు డోసులు వేయాల్సి వస్తే ప్రతి 21రోజులకు ఒకసారి వ్యాక్సిన్ డోసులను ఇస్తారు. ప్రతినెల వ్యాక్సిన్ పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నివేదికలు రూపొందిస్తారు. ఇలా, వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం ఏడు నెలలపాటు వాలంటీర్ల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని కాలేజీ ప్రిన్సిపల్ ఆర్‌బీ కమల్ వెల్లడించారు. అయితే, ఈ వ్యాక్సిన్‌ను -20 నుంచి -70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌తోపాటు సరఫరా చేసేందుకు భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అనుమతి పొందింది. ప్రయోగాలు విజయవంతమై, నియంత్రణ సంస్థల అనుమతి పొందిన తర్వాత, పదికోట్ల వ్యాక్సిన్ డోసులను భారత్‌లో సరఫరా చేసేందుకు రష్యా వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థ ఆర్‌డీఐఎఫ్‌తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం చేసుకుంది.
ఇండియాలో రష్యా టీకా ప్రయోగాలు
Related tags :