గిరగిరా తిరిగి ఢమాల్ అంటున్న రూపాయి

రూపాయి ‘అసాధారణ స్థాయి’లకు పడిపోదని భరోసా ఇచ్చేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారంనాడు రూపాయి పుంజుకోవడమే ఇందుకు కారణమని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ట్వీట్‌ చేశారు. ‘మంగళవారం వరకు మార్కెట్‌ పతనానికి ప్రధానమైన కారణమేదీ లేదు. మార్కెట్‌ ఆపరేటర్ల అత్యుత్సాహమే ఈ పరిస్థితికి దారి తీసింద’ని ఆయన చెప్పారు. వారాంతంలో ప్రధాని సమావేశం: దేశ ఆర్థిక స్థితిపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రూపాయి క్షీణత, చమురు ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపైనా ఈ సమావేశంలో చర్చించొచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌, పీఎంఈఏసీ ఛైర్మన్‌ వివేక్‌ దేవ్‌రాయ్‌ తదితరాలు సమవేశానికి హాజరుకావొచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
**రూపాయి పుంజుకుందోచ్‌!
హమ్మయ్యా.. వరుస పతనం నుంచి రూపాయి కోలుకుంది. రూపాయి క్షీణత నియంత్రణకు ఆర్‌బీఐ, ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతాయంటూ ఆర్థిక శాఖ భరోసా కల్పించడం ఇందుకు దోహదం చేసింది. దేశ ఆర్థిక స్థితిపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా ఇందుకు ఉపకరించాయి. బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభమయ్యాక ఒకానొక దశలో రూపాయి మారకపు 72.91 వరకు పతనమైంది. ఇది తాజా జీవన కాల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. అయితే ఆ తర్వాత అమాంతం 105 పైసలు పెరిగి 71.86 వరకు వెళ్లింది. చివరకు 51 పైసలు లాభపడి 72.18 వద్ద ముగిసింది. మే 25 తర్వాత ఒక రోజులో రూపాయి అత్యధికంగా పెరగడం ఇదే మొదటిసారి.
**పెట్రోలు నుంచి… బంగారం వరకు దిగుమతి చేసుకునే వస్తువులన్నిటికీ చెల్లించాల్సింది అమెరికన్‌ డాలర్లే!! ఆ డాలర్ల కోసం రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. కాకపోతే… 10 రోజుల కిందటి వరకూ ఒక డాలర్‌ కోసం 68–69 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే… ఇపుడది ఏకంగా 72–73 రూపాయల స్థాయికి చేరిపోయింది. ఫలితం… దిగుమతులన్నీ ఖరీదవుతున్నాయి. ఆ ప్రభావం దేశంలో తయారవుతున్న వస్తువుల పైనా పడుతోంది. మొత్తంగా రూపాయి పతనమవుతూ… అన్ని వస్తువుల ధరలూ పెంచేస్తోంది. ఈ పతనం ఇలాగే సాగితే… మున్ముందు మనం కొనే వస్తువులన్నిటి ధరలూ భారంగా మారతాయి. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా 8.2% వృద్ధి రేటును ప్రపంచానికి సగర్వంగా ప్రకటించిన కొద్దిరోజులకే… రూపాయి చుక్కలు చూపిస్తోంది. మంగళవారం రూపాయి విలువ అక్షరాలా 72.70 స్థాయికి పతనమయ్యింది. కేవలం 10 రోజుల్లో 330 పైసల వరకూ పడిపోయింది. ఈ పతనం ప్రత్యక్షంగా మార్కెట్‌ను కుదేలెత్తిస్తూ పరిశ్రమపై ప్రభావం చూపిస్తూ… పరోక్షంగా సామాన్యుడినీ దెబ్బ తీస్తోంది. పెట్రోల్, డీజిల్‌ దరలు రయ్యిన పెరిగి రికార్డు గరిష్టానికి చేరాయి. అవేకాదు. వంటనూనెలు, చక్కెర, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, బొగ్గు, ఆటోమొబైల్స్‌ ఒక్కటేమిటి… దిగుమతులతో లింకున్న ప్రతి వస్తువు ధరకూ రెక్కలొచ్చాయి.
**2013 పరిస్థితులు పునరావృతం..
నిజానికిప్పటి పరిస్థితి ఐదేళ్ల క్రితం కంటే భిన్నమేమీ కాదు. 2013 ఆగస్టులోనూ ఇదే పరిస్థితి. అప్పట్లో డాలరుతో రూపాయి మారకపు విలువ ఏకంగా 68.85 వద్దకు పతనమై, సామాన్యుడి నుం చి పారిశ్రామికవేత్తలవరకూ అందర్నీ బెంబేలెత్తించింది. అప్పటి రికార్డు కనిష్టస్థాయి దిగువకు సైతం ఇప్పుడు పడిపోయి… మార్కెట్లో వణుకు పుట్టిస్తోంది. దాంతో ఈ వారం సోమ, మం గళవారాల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ దాదాపు వెయ్యి పాయింట్ల వరకూ పతనమయింది. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర స్థిరంగా వున్నా, ఇక్కడ రూపాయి పతనం వల్ల… దాని ధర 1.5 శాతం వరకూ పెరిగిపోయింది. అంటే మరోసారి పెట్రోల్, డీజిల్‌ వడ్డన. దాంతో రవాణాతో సంబంధమున్న ప్రతి ఉత్పత్తీ ఖరీదుగా మారుతుంది.
**మరో కారణం చైనా….
అమెరికా ప్రకటించిన వాణిజ్యయుద్ధ ప్రభావంతో చైనా ఉత్పాదక రంగం కొద్ది నెలలుగా కుంచించుకుపోయింది.అంతర్జాతీయ మార్కెట్లో ఆ రంగా న్ని పోటీలో నిలిపేందుకు చైనా తన కరెన్సీ యువాన్‌ను తనే క్రమంగా క్షీణింపచేస్తోంది. ఈ కరెన్సీ రెండు నెలలుగా 7 శాతానికి పైగానే పతనమైంది. ప్రపంచ మార్కెట్లో చైనా పోటీని తట్టుకునేందుకు భారత్, ఇతర వర్ధమాన దేశాలకు సైతం వేరే మార్గం లేక, కరెన్సీ పతనాన్ని అడ్డుకోకుండా స్వేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. రూపాయి విలువ 68–69 మధ్య ఉన్నపుడు ఆర్‌బీఐ జోరుగా జోక్యం చేసుకుని తనవద్దనున్న డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయి పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇపుడా చర్యలకు స్వస్తిచెప్పింది. దీంతో మన రూపాయితో పాటు రష్యా రూబుల్, ఇండో నేషియా రుపయ్యా, చైనా యువాన్, ఫిలిప్పీన్స్‌ పెసో తదితర కరెన్సీలు పతనమవుతున్నాయి.
**ఫెడ్‌ వడ్డీ రేట్లూ ముంచుతున్నాయ్‌…
అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ సెప్టెంబర్‌ 25, 26 తేదీల్లో జరిపే సమీక్షా సమావేశంలో మరో 0.25 శాతం వడ్డీ రేట్లు పెంచుతుందన్న అం చనాలున్నాయి. అలా పెంచితే విదేశీ ఇన్వెస్టర్లు. తమ పెట్టుబడుల్ని ఇక్కడి డెట్‌ మార్కెట్‌ నుంచి తరలించుకుపోయే అవకాశం ఉంటుంది. వారు అక్కడ తక్కువ వడ్డీకి నిధుల్ని తీసుకొచ్చి, ఇక్కడ బాండ్లలో పెట్టుబడులు పెట్టి లబ్ధి పొందుతున్నారు. అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతూ, ఇక్కడ రూపాయి క్షీణిస్తే వారికి నష్టాలొస్తాయి. అందుకే వారు అక్కడికి తరలించుకుపోతారు. రూపాయి తగ్గుతూ ఉంటే వారి అమ్మకాలు మరింత పెరగడం, రూపాయి మరింత క్షీణించడం జరుగుతుంది.
**మన వడ్డీ రేట్లూ పెరుగుతాయ్‌….
రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్‌బీఐ తన దగ్గరున్న డాలర్లను ఖర్చుచేస్తే… ఆర్‌బీఐ వద్దనున్న నిల్వలు హరించుకుపోవటం తప్ప ప్రపంచ ట్రెండ్‌కు భిన్నంగా రూపాయి మెరుగుపడేదేమీ ఉండదు. ఇక్కడ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా రూపాయి నిట్టనిలువునా కూలకుండా చూడొచ్చు. ఇక్కడ వడ్డీ రేట్లు పెరిగితే డెట్‌ మార్కెట్‌ నుంచి విదేశీ నిధులు వెళ్లడం ఆగుతుంది. తద్వారా రూపాయి స్థిరత్వం పొందుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్‌బీఐ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలున్నాయి. ఈ అంచనాలకు అనుగుణంగా భారత ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌ సైతం 2014 సంవత్సరపు గరిష్టస్థాయి 8.87 స్థాయిని ఈ సోమవారం అందుకుంది.
**లాభాలకంటే నష్టాలే ఎక్కువ..
రూపాయి క్షీణతవల్ల భారత్‌కు లాభాలకం టే నష్టాలే ఎక్కువ. ఎందుకంటే మనం అధికంగా వినియోగించే పెట్రో ఉత్పత్తులకు దిగుమతులపైనే ఆధారపడు తున్నాం. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నా రూపాయి కారణంగా మన దిగు మతి ధర మాత్రం పెరుగుతోంది. దీంతో ఇక్కడ పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగిపోతాయ్‌. వీటితో పాటే రవాణా వ్యయాలు పెరిగి, మిగిలిన ఉత్పత్తుల ధరలూ పరుగులు తీస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఇటీవలికనిష్టస్థాయి నుంచి 6% పెరగ్గా, ఇక్కడ ఎంసీఎక్స్‌లో ట్రేడయ్యే క్రూడ్‌ బ్యారల్‌ ధర రూపాయి క్షీణత ఫలితంగా 10% ఎగిసింది. అలాగే బంగారం కూడా!!. అంతర్జాతీయ మార్కెట్లో ఏమీ పెరక్కపోయినా, ఇక్కడ మాత్రం 3% పెరిగింది. మనం దిగుమతి చేసుకునే మొబైల్‌ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలూ రూపాయి క్షీణతతో పెరుగుతాయి. ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానమై ట్రేడయ్యే చక్కెర, వంటనూనెలు, కొన్ని రకాల పప్పు దిను సుల ధరలకూ రెక్కలొస్తాయి. చివరికి న్యూస్‌ప్రింట్‌ ధర కూడా ఖరీదైపోతుంది.
**ఎగుమతులకు కాస్త ప్రయోజనం
రూపాయి క్షీణత ఎగుమతి రంగాలకు బాగా కలిసివస్తుంది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల లాభాల మార్జిన్లు 0.25–0.50% పెరగవచ్చని అంచనా. కరెన్సీ క్షీణతతో లాభంపొందే మరో రంగం ఫార్మా. అయి తే ఇది ట్రంప్‌ విధానాలపై ఆధారపడి ఉంటుంది.
**తక్షణ లాభం రెమిటెన్సులకే….
విదేశాల నుంచి ఇక్కడికి తరలివచ్చే రెమిటెన్సులకు మాత్రం తక్షణ ప్రయోజనం కలుగుతుంది. ఎన్నారైలు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఇక్కడి బంధువులకు, పెట్టుబడుల కోసం పంపే డబ్బు రూపాయిల్లో పెరగడం ద్వారా లబ్ధి్ద చేకూరుతుంది. కానీ విదేశాల్లో విద్యనార్జించేందుకు తీసుకున్న రుణాలు భారమైపోతాయి. విదేశీ ప్రయాణాలు ఖరీదవుతాయి.
**పతనానికి కేంద్ర బిందువు అమెరికా..
రూపాయి పతనం.. మన కరెన్సీ బలహీనత కాదని, అమెరికా డాలరు బలపడటమే ఇందుకు కారణమంటూ కొద్దిరోజుల కిం దట ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన వాదనను పూర్తిగా కొట్టి పడేయలేం. కొంతమంది బ్యాంకర్లూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ బలోపేతం కావడంతో అక్కడి కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ క్రమేపీ వడ్డీ రేట్లను పెంచుతోంది. దాంతో మన దేశంతో సహా పలు వర్థమాన దేశాల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో నిధులు తరలిపోతున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెరతీసిన వాణిజ్య యుద్ధ ప్రభావం కూడా కరెన్సీ మార్కెట్‌పై ప్రతిఫలిస్తోంది. చైనా, యూరప్, కెనడా తదితర దేశాల నుంచి జరిగే దిగుమతులపై ట్రంప్‌ విధించిన టారి ఫ్‌ల ప్రతికూల ప్రభావమేదీ అమెరికాపై పడకపోగా, అక్కడి ఉత్పాదక రంగం బాగా మెరుగుపడుతున్నదన్న సంకేతాలొస్తున్నాయి. ఉపాధి పెరుగుతోందన్న గణాంకాలు వెలువడటంతో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలరు బలపడుతోంది. డాలరు నిధులు స్వదేశానికి (అమెరికాకు) తరలిరావడం, ఫెడ్‌ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందన్న అంచనాలతో అక్కడి బాండ్‌ ఈల్డ్‌ పెరగడం వంటి కారణాలు కూడా డాలరును బలోపేతం
చేస్తున్నాయి.
**డాలరుకు ఎందుకీ బలం!!
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తూ ఇబ్బడిముబ్బడి లాభాలను ఆర్జించే కార్పొరేట్‌ కంపెనీలు.. అమెరికాలోనే ఎక్కువ. వాటితో లావాదేవీలు సాగించాలి కనక డాలరును రిజర్వు కరెన్సీగా ప్రపంచదేశాలు అంగీకరిం చక తప్పటం లేదు. అందుకే ప్రపంచ వాణి జ్యంలో 70% డాలర్ల రూపంలోనే జరుగు తోంది. మరి ఆయా దేశాలు వాటి దిగుమతుల కోసం డాలర్లనే చెల్లించాలి కదా!!. అలాగని దేశాలు గనక వాటి కరెన్సీల్ని అధికంగా ముద్రిస్తే ఏం జరుగుతుంది? లభ్యత ఎక్కువై… ధరలు పెరిగి… ద్రవ్యోల్బణం పడగ విప్పుతుంది. అమెరికాకు అలా కాదు. తన దిగుమతుల చెల్లింపుల కోసం, ఆస్తులు, టెక్నాలజీ కొనుగోళ్ల కోసం, కావల్సినన్ని డాలర్లను ముద్రించి వదిలిపెడుతుంటుంది. అలా ముద్రించిన డాలర్లను ఆ దేశానికి ఎగుమతులు జరిపే ప్రపంచదేశాలన్నీ తీసేసుకుంటా యి. అందుకనిద్రవ్యోల్బణం పెరగదు. ఇలా.. రూపాయి, రూబుల్, యువాన్, యూరో, బ్రిటన్‌ పౌండ్‌ తదితర కరెన్సీలపై కొన్నేళ్లుగా డాలర్‌ బలపడుతూ వస్తోంది. కానీ జపాన్‌ యెన్, స్విస్‌ ఫ్రాంక్, ఆస్ట్రేలియా డాలరుతో పోలిస్తే మాత్రం అమెరికా డాలరు బలహీనపడుతోంది. ఈ దేశాలు డాలరు నిధులమీద, అమెరికాకు ఎగుమతులపై ఆధారపడటం లేదు. దాంతో 6 కరెన్సీలు కూడి వున్న డాలరు ఇండెక్స్‌ రెండేళ్ల క్రితం 105 గరిష్టస్థాయి నుంచి ఇప్పుడు 95.5 వద్దకు తగ్గినప్పటికీ, ఆ డాలరు ఇండెక్స్‌లో లేని భారత్‌ రూపాయి, చైనా యువాన్‌ వంటి కరెన్సీలు డాలరుతో పోలిస్తే బాగా బలహీనమయ్యాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com