ఏలూరు వైకాపాలో గ్రూపుల పోరు

పార్టీని నమ్ముకుంటే చాలు..ఎన్ని పదవులు ఉన్నా..ఇంకా పదవులు వస్తూనే ఉంటాయి..అధిష్టానం ఆశీస్సులు ఉంటే చాలు..బంతిలో ఎక్కడ ఉన్నా.. వరుసలో ఎంత మంది ఉన్నా…వడ్డించే వాడు మన దగ్గరకే వస్తాడు..ఈ కబుర్లు ఏమిటీ .? .ఇలా ఎక్కడ జరిగింది ..?అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. ఇదంతా పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న ఒక రాజకీయ ప్రక్రియ..అందులోనూ ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో జరుగుతున్న వ్యవహారం. అవును మరి, ఏలూరు అసెంబ్లీ టికెట్ ను ఎవరికి ఇస్తారు..? రేసులో ఎవరెవరు ఉన్నారు..? అనే అంశాలతో సంబంధం లేకుండా… పార్టీ హైకమాండ్ అభ్యర్ధిని ప్రకటించేసింది. ఇలా అభ్యర్థిని హైకమాండ్ ఎలాంటి సంకోచం లేకుండా ప్రకటించడంపై పార్టీలో కొన్ని లుకలుకలు ఉన్నా..ఎవరు పైకి చెప్పుకోలేని పరిస్థితి..అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి.పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరును అత్యంత ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీ నియోజకవర్గంగా భావిస్తోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ హైకమాండ్‌.. ఇప్పుడంటే కొన్ని పరిణామాల కారణంగా ఏలూరుపై జగన్మోహన్‌రెడ్డి పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ.. గతంలో అయితే ఏ కార్యక్రమం చేపట్టినా ఏలూరు నుంచే చేసేవారు.. ఒక ఓదార్పు యాత్ర మొదలుపెట్టినా.. విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌ రీయింబర్స్‌మెంట్‌పై పోరాటం అయినా ఏలూరు నుంచే మొదలు పెట్టారు.. అంతటి ప్రాధాన్యం ఇచ్చేవారు పార్టీ పెద్దలు.. అలాంటి ఏలూరు అసెంబ్లీ టికెట్‌ కోసం నాలుగేళ్ల కాలంలో అనేకమంది ప్రయత్నాలు చేశారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. పార్టీలో కొందరు నాయకుల వల్ల అవమానాలకు కూడా గురయ్యారు. అయినా టికెట్‌ మళ్లీ ఆళ్ల నానికే దక్కింది.. పార్టీకి వీర విధేయుడిగా.. ముఖ్యంగా జగన్మోహన్‌రెడ్డికి అత్యంత అనుంగు అనుచరుడిగా ఉన్న ఆళ్ల నానికి టికెట్‌ నిర్ధారణ అవ్వడం.. పార్టీలో కొన్ని వర్గాలకు ఆశ్చర్యం కలిగించకపోయినా టికెట్‌ ఆశించినవారికి మాత్రం మింగుడు పడని అంశంగా మారింది..ఏలూరు నుంచి 2004…2009 ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన ఆళ్ల నాని.. అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్నారు.. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత కూడా చాలా కాలం ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు.. జగన్మోహన్‌రెడ్డి సొంతపార్టీ పెట్టుకున్నా.. నాని మాత్రం చాలాకాలం అందులో చేరలేదు.. అంతేకాదు.. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చాలా సన్నిహితంగా మెలిగారు.. ఏలూరు అభివృద్ధికి భారీగానే నిధులు సమీకరించారు. దాంతో నాని కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని అందరూ భావించారు. జగన్‌ పక్షాన చేరరని అనుకున్నారు. కానీ అనూహ్యంగా 2013లో ఆళ్లనాని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుని… 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి తెలుగుదేశంపార్టీ అభ్యర్థి బడేటి బుజ్జి చేతిలో ఓడిపోయారు.. తర్వాత నాని పార్టీకి కొంతకాలం దూరంగా ఉన్నా.. జగన్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉండటంతో ఆయనకే పార్టీ జిల్లా సారథ్య బాధ్యతలు వచ్చాయి.. తర్వాతి కాలంలో ఎమ్మెల్సీగా జగన్‌ సహకారంతో నాని తేలిగ్గానే పదవిని పొందారు.ఇదంతా ఒక ఎత్తయితే.. ఏలూరు టికెట్‌ను ఆశిస్తూ చాలామంది నాయకులు పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో పార్టీ మహిళా నాయకురాలు పిల్లంగోళ లక్ష్మి.. వాటన్నింటిని భుజస్కంధాలపై మోసినట్లు పార్టీ వర్గాల్లోనే టాక్‌ ఉంది.. దాదాపు రెండేళ్లపాటు ప్రతీ కార్యక్రమానికి వేల రూపాయలు ఆమె ఖర్చు చేశారట! అదే సమయంలో మరో అభ్యర్థి తెరపైకి వచ్చారు. టీడీపీ హయాంలో ఏలూరు మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన మధ్యాహ్నపు ఈశ్వరి వైకాపాలో చేరి పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం మొదలుపెట్టారు. దాంతో నానికి ఎలాగూ ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి.. అసెంబ్లీ టికెట్‌ వేరే వారికి ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆశావహులు అలాగే భావించారు. కానీ హైకమాండ్‌ ఆశావహులతో మైండ్‌గేమ్‌ ఆడుతుందన్న విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. ఆ విషయాన్ని వారు తెలుసుకునేలోపే ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఆళ్ల నాని పేరును జగన్‌ ఖరారు చేశారు.అయితే నాని పేరు ఖరారు చేయడం వెనుక జగన్‌ రహస్యంగా చేసిన ఒక సర్వే కారణమంటారు పార్టీ నాయకులు.. ఆ సర్వేలో ఇతర ఆశావహులకు పెద్దగా మార్కులు రాలేదట..! మహిళా ఆశావహులు పేర్లతో పాటు కొందరు పేర్లను ఈ సర్వేలో పరిశీలించగా, నానికే ఎక్కువ మార్కులు వచ్చాయట…! దాంతో జగన్ ఏమి ఆలోచించకుండా నాని పేరునే ఖరారు చేసేసారట..! అలా ఖరారు చేయడం వెనుక రుసరుసలు వినిపిస్తున్నాయనుకోండి…!ఇప్పటికే ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి, ఎమ్మెల్సీ పదవి ఉండగా, అసెంబ్లీ టికెట్‌ను ఆయనకే ఇస్తారా అని వాపోతున్నవారు ఉన్నారనుకోండి…! నాని ఎమ్మెల్యేగా ఎన్నికయితే, ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తారు కదా..! అన్నీ తెలుసుండే, కొందరు ఇలా మా ఆళ్ల నానిని ఆడిపోసుకుంటున్నారని ఆయన వర్గీయులు అంటున్నారు.. మొత్తంమీద ఎక్కువ సస్సెన్స్ లేకుండానే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఆళ్ల నాని పేరు ఖరారయ్యిందన్న మాట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com