తెలంగాణాలో గరంగరంగా రాజకీయం-TNI ప్రత్యేక వార్తా కథనాలు

1. పాలేరులో తుమ్మల ప్రచారం
టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా నాయకన్‌గూడెం నుంచి కూసుమంచి వరకు బైక్, కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఓపెన్ టాప్ వాహనంలో తుమ్మల నాగేశ్వరరావు ర్యాలీలో పాల్గొన్నారు.
2. ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం – ఈసీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సంతృప్తి చెందాకే నిర్ణయం ఉంటుందని, నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు.కలెక్టర్లు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, ప్రతి గ్రామంలో ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలను పరిశీలిస్తున్నామన్నారు. ఎన్నికల ఏర్పాట్లను సీఈసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని రజత్‌కుమార్‌ చెప్పారు.
3. టీఆర్ఎస్ లో చేరికలు
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్ళుగా సాగుతున్న ప్రజరంజక పాలనకు ..అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలీకృతమైంద‌ని గృహ నిర్మాణ‌న్యాయ‌దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి సమక్షంలో నిర్మల్ నియోజకవర్గంలోని లక్ష్మణ‌చాంద మండ‌లం క‌న‌కాపూర్సారంగాపూర్ మండ‌లం బీరవెల్లిలోకేశ్వరం మండ‌లం మ‌న్మడ్ గ్రామాల‌కుదిలావ‌ర్ పూర్ మండ‌ల కేంద్రానికినిర్మల్ ప‌ట్టణానికి చెందిన ప‌లువురు ఇత‌ర పార్టీల నేత‌లుకార్యక‌ర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారంద‌రికి మంత్రి అల్లోల గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
4.తెరాస అభ్యర్థిని ఓడిస్తాం
ఉద్యమంలో కష్టపడ్డ వారిని కాదని, తెలంగాణ ద్రోహులకు తెరాసలో ప్రాధాన్యమిచ్చారని ఆ పార్టీ అసమ్మతి నేత, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి విమర్శించారు. ఉద్యమ ఆకాంక్షల మేరకు పనిచేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తనను సస్పెండ్‌ చేయాలంటూ జిల్లాకు చెందిన తెరాస ప్రజాప్రతినిధులు గత డిసెంబరులో తీర్మానం చేశారని.. ఈ ఫిర్యాదుపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తన తప్పుంటే సస్పెండ్‌ చేయాలని, లేదంటే క్షమాపణ చెప్పించాలని అధిష్ఠానాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.
5.కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం కోడందరం
నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ నియంతృత్వ పాలనను కూకటివేళ్లతో పెకిలిద్దామని తెజస రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. ఆయన్ను గద్దె దించడమే లక్ష్యంగా అన్ని శక్తులనూ ఏకం చేస్తామని చెప్పారు. ‘నవ్య తెలంగాణ నిర్మాణానికి కదలిరండి.. తెలంగాణ జన సమితి మీకు అండగా నిలుస్తుంది’ అంటూ భరోసా ఇచ్చారు. తెజస రూపంలో రాష్ట్రంలో కొత్త శక్తిని ఆవిష్కరించామనీ.. అమరుల స్ఫూర్తితో, నిస్వార్థంతో, అంతే త్యాగనిరతితో కలిసి సాగుదామన్నారు. మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1,200 మంది అమరుల జ్ఞాపకార్థం రాష్ట్ర సర్కారు స్మృతిచిహ్నం ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ తెజస ఆధ్వర్యంలో బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో కోదండరాం ‘అమరుల స్మరణ’ పేరుతో ఒకరోజు దీక్ష నిర్వహించారు.
6.టీఆర్ఎస్ కు కేఎస్‌ రత్నం
చేవెళ్ల మాజీ శాసనసభ్యుడు కె.ఎస్‌.రత్నం తెరాసను వీడారు. ఈ ఎన్నికల్లో తెరాస తరఫున టిక్కెట్‌ ఆశించగా అధిష్ఠానం తాజా మాజీ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు కేటాయించింది. తీవ్ర నిరాశకు గురైన రత్నం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, నవాబుపేట్‌ మండలాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన అనుచరులు, కార్యకర్తలతో చేవెళ్లలోని కేజీఆర్‌ గార్డెన్‌లో సమావేశమయ్యారు. ఇతర పదవులు ఇస్తామంటే లొంగవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ చేవెళ్ల నుంచే పోటీ చేయాలని అనుచరులు పట్టుబట్టారు.
7.ఎన్నికల ప్రణాళికపై భాజపా కసరత్తు
అసెంబ్లీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)పై తెలంగాణ భాజపా కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మేనిఫెస్టో సన్నాహక కమిటీ సమావేశం బుధవారం జరిగింది. రంగాల వారీగా వివిధ అంశాలపై నిపుణులు సలహాలు, సూచనలు అందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ. సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. స్థానిక సమస్యల ఆధారంగా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఓ మేనిఫెస్టో ప్రకటించే ఆలోచన ఉందన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి వైకుంఠం, ఔటా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని బలోపేతం చేసి మంచి వైద్యం అందించడాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నేత చంద్రారెడ్డి సూచించారు. ఓయూ విశ్రాంత ఆచార్యులు జి.లక్ష్మణ్‌, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఎంపీ దత్తాత్రేయ, పార్టీ నేతలు మల్లారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
8.ఈసీ అపాయింట్‌మెంట్‌ కోరిన మర్రి శశిధర్‌ రెడ్డి
ఈ గురువారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్‌ కోరారు. ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో శశిధర్‌ రెడ్డి ఈసీ అపాయింట్‌మెంట్‌ కోరటం చర్చనీయాంశంగా మారింది. జాబితాలో జరిగిన అవకతవకలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.దాదాపు 30లక్షల ఓటర్ల నమోదులో అనేక అవకతవకలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. పాత షెడ్యూల్‌ ప్రకారమే ఓటర్ల జాబితాను సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జనవరి తర్వాతే ఎన్నికలకు వెళతామంటున్నారు.
9. రాహుల్‌ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్లగణేశ్ శుక్రవారం ఉదయం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఫస్ట్ టైం మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
*బండ్ల మాటల్లోనే…
” కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నది నా కల. భారతదేశాన్ని నిర్మించిన పార్టీ కాంగ్రెస్. త్యాగాలకు ప్రతిరూపమైన పార్టీ ఇది. పార్టీ కోసం ఇందిరాగాంధీ కుటుంబం అహర్నిశలు కష్టపడుతోంది. పార్టీలో చేరడానికి నాకు అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ, ఉత్తమ్‌, కుంతియాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను రాహుల్‌ను ఎలాంటి కమిట్మెంట్‌లు అడగలేదు.. సేవ చేస్తానని మాత్రమే ఆయనకు చెప్పాను” అని గణేశ్ స్పష్టం చేశారు.
*జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేస్తారా..!?
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తారా? అని మీడియా ప్రతినిధి అడగ్గా.. ఈ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ” అధిష్ఠానం ఏం చెబితే అది చేస్తాను. పోటీ చేయమంటే కచ్చితంగా చేస్తాను.. వద్దంటే ఆగిపోతాను. నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం అందుకే పార్టీలో చేరాను. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం నాకుంది. నేను టీఆర్ఎస్‌లో సీటు అడగలేదు.. అక్కడ ఇవ్వనందుకే నేను కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలు .అవాస్తవం. నా మీద కేసులున్నాయని.. అందుకే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నానని కొందరు అంటున్నారు అవన్నీ పుకార్లే. ఇప్పటికీ సినిమా రంగం అంటే నాకు ప్రాణం. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనిపించింది.. అందుకే కాంగ్రెస్‌లోకి వచ్చాను” అని ఆయన చెప్పారు.
*జనసేనలో ఎందుకు చేరలేదు.!?
” నాకు చిన్నప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీ ఇష్టం.. గౌరవం. అందుకే ఇవాళ పార్టీలో చేరాను. ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాకు తండ్రిలాంటి వారు. ఆయన నాకు దేవుడితో సమానం. ఆయనే నాకు గురువు.. కానీ కాంగ్రెస్ అంటే నాకు అభిమానం. సినీరంగం నుంచి ఇంకా ఎవరెవరు రాజకీయాల్లోకి వస్తారో నాకు తెలియదు. ప్రస్తుతానికి ‘బండ్ల గణేశ్ అనే నేను’ మాత్రమే రావడం జరిగింది. కచ్చితంగా ఇలానే ప్రమాణం చేస్తాను.. ఇదే నా కోరిక” అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చారు.
*జూబ్లిహిల్స్ నియోజకవర్గం విషయానికొస్తే…
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ టీడీపీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఇటీవల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. 2014 ఎన్నికల్లో మాగంటి గోపినాథ్.. ఎంఐఎం అభ్యర్థిపై 9,242 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి దివంగత నేత పి జనార్ధన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి. 2014లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్‌కు 41,656 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి విష్ణుకు మాత్రం 33,642 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ సారి ఎలాగైనా సరే ఇక్కడ్నుంచి మళ్లీ పోటీ చేసి గెలిచి తీరాలని ప్రజల్లో కలియతిరుగుతున్న విష్ణుని కాదని బండ్ల గణేశ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం సీటిస్తుందా..? లేదా విష్ణుకే సీటిస్తుందా..? అన్నదానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. మొత్తానికి అసలు ఎవరెవర్ని బరిలోకి దింపాలి..? అనే విషయంపై ఇవాళ రాహుల్ గాంధీతో ఉత్తమ్ చర్చించి రెండ్రోజుల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
10. నలభై మంది పేర్లు ఖరారు చేయనున్న కాంగ్రెస్
త్వరలో జరగనున్న ఎన్నికలకు గానూ మొదటి విడతలో 40 మంది అభ్యర్ధులను ప్రకటించే అవకాశముందని తెలిసింది. ఈమేరకు ఓ జాబితాను సిద్ధం చేసిన టీ పీసీసీ… దానిని పరిశీలన నిమిత్తం ఏఐసీసీకి పంపినట్లు సమాచారం. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తూ అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్న నేపధ్యంలో అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అలాగే టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలతో పొత్తుల వ్యవహారం నడుస్తుండడం, సీట్ల సర్దుబాటు జరుగుతుండడంతో అభ్యర్ధుల ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా… ప్రస్తుతం 40 మంది అభ్యర్ధులను టీ పీసీసీ ఎంపిక చేసిందని, మొదటి విడతలో వారి పేర్లను నేడో రేపో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే… మొదటి విడతలో ప్రకటించే అభ్యర్ధుల జాతకాలు కూడా తారుమారయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇతర పార్టీలతో పొత్తులు ఏర్పడుతున్న నేపధ్యంలో అందులో కొన్ని స్థానాలను ‘త్యాగం’ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారని, త్వరలోనే ఆ జాబితాను విడుద చేయనున్నారని తెలుస్తోంది.
11.ఓదెలుకు కేసీఆర్ ఓదార్పు
టీఆర్‌ఎస్‌లో చెన్నూరు టికెట్ లొల్లి సమసింది. నల్లాల ఓదెలును క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించుకొని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుజ్జగించారు. సముచిత స్థానం కల్పిస్తానని ఓదేలుకు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓదేలు మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెప్పారు. పార్టీ అభ్యర్థి గెలుపుకోసం పనిచేస్తానన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ చెప్పినట్లు ఓదేలు తెలిపారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే చెన్నూరులో మళ్ళీ టీఆర్‌ఎస్‌ గెలవాలని అన్నారు. కార్యకర్తలు తొందరపడకుండా పార్టీ వెంటే నడవాలని నల్లాల ఓదేలు పిలుపు నిచ్చారు.
12.కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్న కోదండరాం
తెలంగాణ జనసమితి మహాకూటమిలో చేరడానికి అంగీకరించింది. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు రమణ నివాసంలో సీపీఐ, టీజేఎస్ నేతల భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహాకూటమితోనే తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కొనగలమని టీజేఎస్ భావిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కోదండరాం తెలిపారు.
13. తిట్టిన వాళ్లే కేసీఆర్‌ క్యాబినేట్‌లో ఉన్నారు’.
టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉద్యమకారులకు అవమానాలు, అన్యాయాలు జరుగుతున్నాయని టీఆర్‌ఎస్‌ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులకు టీఆర్‌ఎస్‌ పార్టీలో పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. అందుకే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి మారుతున్నానని వెల్లడించారు. పదవులు తనకు ముఖ్యం కాదన్నారు. అనర్హత వేటు వేసినా తాను సిద్ధంగానే ఉన్నానని తెలిపారు. 14 సంవత్సరాల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీని నిర్మించామని, కానీ పార్టీని వీడిపోవాల్సి వస్తోందని అన్నారు.నాలుగున్నర సంవత్సరాల నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో పూర్తిగా కేసీఆర్‌ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంశాల్లో ఇంకా న్యాయం జరగలేదని అన్నారు. రైతు బంధు పథకం వల్ల అసలైన రైతులకు న్యాయం జరగలేదని, కౌలు రైతులకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదని చెప్పారు. సరైన గిట్టుబాటు ధర ఇచ్చి ఉంటే బాగుండేదని, కానీ కేసీఆర్‌ అలా చేయలేదని చెప్పారు. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణాగా మార్చివేశారని విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్‌ చుట్టూ తెలంగాణ ద్రోహులే ఉన్నారని ధ్వజమెత్తారు.ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్‌, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తానని చెప్పి మాట తప్పారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ప్రాణత్యాగం చేస్తే 400 మందిని కూడా ఆదుకోలేదని విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టిన వాళ్లే కేసీఆర్‌ క్యాబినేట్‌లో ఉన్నారని, నిజాయతీగా ఉండి పార్టీకి సేవ చేసిన వాళ్లను బయటికి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ పార్టీ పనిచేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ బడుగు బలహీనవర్గాలకు చెందిన పార్టీ, ఇవ్వన్నీ కాంగ్రెస్‌ పార్టీతో సాధ్యమౌతుందన్న నమ్మకం ఉందన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలన్న కోరికని ఆయన వెల్లడించారు.
14.రేపు అమిత్ షా హైదరాబాద్ పర్యటన
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రేపు హైదరాబాద్ నగరానికి రానున్నారు. పర్యటన సందర్భంగా అమిత్ షా రాష్ట్రంలోని బీజేపీ శక్తి సంఘాలతో సమావేశం కానున్నారు. అదేవిధంగా ఎన్నికలకు సమాయత్తంపై రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా అమిత్ షా పాలమూరు వెళ్తారు. స్థానిక ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల శంఖారావం పూరించనున్నారు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com