Politics

తితిదే ఆభరణాల పరువునష్టం కేసులో నూతన ట్విస్ట్

తితిదే ఆభరణాల పరువునష్టం కేసులో నూతన ట్విస్ట్

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. వారిపై దాఖలు చేసిన పరువునష్టం ఉపసంహరణ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామంటూ తిరుపతి కోర్టులో తితిదే పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయింది. ఈ కేసుపై తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 23కి వాయిదా వేసింది.

తెదేపా ప్రభుత్వ హయాంలో తితిదేకు చెందిన ఆభరణాలు, స్వామి వారి పింక్‌ డైమండ్‌ ఇతర దేశాలకు తరలించారంటూ గతంలో రమణదీక్షితులు ఆరోపించారు. ఆయన ఆరోపణలను విజయసాయిరెడ్డి అప్పట్లో సమర్థించారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇంట్లో సోదాలు చేస్తే స్వామివారి ఆభరణాలు బయటపడతాయంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో స్వామివారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని.. ఆ ఆరోపణలను నిరూపించాలంటూ విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై తితిదే అప్పట్లో రూ.200 కోట్లకు పరువునష్టం దావా వేసింది. ఈ కేసు విచారణలో ఉండగానే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ కేసును వెనక్కితీసుకోవాలని తితిదే నిర్ణయించి.. రెండు నెలల క్రితం పరువునష్టం కేసు ఉపసంహరణ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే దీనిపై పలు విమర్శలు వచ్చాయి. ఆరోపణలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేసును ఉపసంహరించుకోవడంపై ప్రజాసంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా పరువునష్టం కేసుపై విచారణ కొనసాగించాలంటూ న్యాయస్థానంలో తితిదే మళ్లీ పిటిషన్‌ దాఖలు చేసింది.