మాల్యాకు సీబీఐ సాయపడటం మోడీకి ముందే తెలుసు

దేశం విడిచి వెళ్లిపోయే ముందు తాను అరుణ్‌ జైట్లీ కలిసినట్లు విజయ్‌ మాల్యా చేసిన ఆరోపణలు రాజకీయ వివాదానికి తెరతీశాయి. ఈ విషయంపై కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. అరుణ్‌జైట్లీ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తాజాగా రాహుల్‌.. ప్రధాని మోదీపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. మాల్యా దేశం విడిచి వెళ్లిపోవడం వెనుక ప్రధాని హస్తం ఉందని విమర్శించారు. ‘మాల్యా పారిపోవడానికి సీబీఐ సాయం చేసింది. అందుకు తగినట్లుగా లుక్‌అవుట్‌ నోటీసుల్లో మార్పులు చేసింది. ఈ విషయంపై సీబీఐ నేరుగా ప్రధానికి నివేదించింది. ఓ కీలకమైన, వివాదాస్పదమైన కేసులో ప్రధానమంత్రి అనుమతి లేకుండా లుక్‌అవుట్‌ నోటీసుల్లో సీబీఐ మార్పులు చేయగలదా’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. జైట్లీపై మాల్యా వ్యాఖ్యలు చేయడంతో కేంద్రంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. మాల్యా పారిపోవడానికి ప్రభుత్వమే సాయం చేసిందంటూ ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో సీబీఐ చేసిన వ్యాఖ్యలు తాజాగా మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విజయ్‌మాల్యాకు వ్యతిరేకంగా లుక్అవుట్‌ నోటీసులను ‘డిటెన్షన్‌’కు బదులుగా ‘రిపోర్ట్‌’గా మార్చి జారీ చేసినట్లు సీబీఐ అంగీకరించింది. ‘అక్టోబరు 16, 2015న జారీ చేసిన లుక్‌అవుట్‌ నోటీసులను నవంబరు 24న రిపోర్ట్‌ ఆన్‌ అరైవల్‌గా మార్చాం. ఎందుకంటే మాల్యా తరచూ యూకేకు వెళ్లి వస్తుంటారు. అలాగే వస్తారనుకున్నాం. అంతేగానీ ఆయన పారిపోతారు అని అనుకోలేదు’ అని సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్‌ ప్రధానిపై విమర్శలు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com