కుంభమేళాకు భారీ సన్నాహాలు

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కుంభమేళాకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆధునికతను, సంప్రదాయాన్ని మేళవించి, భక్తులకు అనేక ఆకర్షణలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా యువత సెల్ఫీలపట్ల చాలా ప్రేమను పెంచుకున్న నేపథ్యంలో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అత్యవసర సమయాల్లో ఉపయోగపడేందుకు ఎయిర్ అంబులెన్స్, వాటర్ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతోంది.వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో అలహాబాద్‌లో కుంభమేళా జరుగుతుంది. రూ.3 వేల కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. ప్రవాస భారతీయులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని నిర్ణయించింది. దాదాపు 196 దేశాల్లోని ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.భక్తులకు సమాచారం అందించేందుకు ‘అటల్ కార్నర్’ పేరుతో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ బ్యాలే ఆర్టిస్టులతో రామలీలా నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమం 55 రోజులపాటు జరుగుతుంది. కుంభ మేళా చరిత్ర, ప్రాధాన్యాలను వివరించేందుకు 10 ఎకరాల విస్తీర్ణంలో సంస్కృతి గ్రామాన్ని ఏర్పాటు చేస్తోంది.
2.విపణిలోకి పతంజలి ఆవుపాలు -రూ.1000 కోట్ల విక్రయాలే లక్ష్యం
పతంజలి ఆయుర్వేద్ సంస్థ ఆవు పాల వ్యాపారంలోకీ అడుగుపెట్టింది. ఆవు పాలు, వాటితో తయారయ్యే ఉత్పత్తుల్ని గురువారం విపణిలోకి తీసుకొచ్చింది. సాధారణ పాలతోపాటు హెర్బల్ ప్లేవర్ కలిగిన పాలు, టెట్రా ప్యాక్లను కూడా ప్రవేశపెట్టబోతోంది. వీటితోపాటు ప్యాక్ చేసిన తాగునీరునూ సరఫరా చేయబోతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,000 కోట్ల విక్రయాలే లక్ష్యంగా పెట్టుకొన్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం దిల్లీ ఎన్సీఆర్, రాజస్థాన్, మహారాష్ట్రలో 56,000 రిటైలర్ల ద్వారా రోజుకు 4 లక్షల లీటర్ల ఆవు పాలు సరఫరా చేయబోతున్నట్లు తెలిపింది. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1,000 కోట్ల విక్రయాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. 2019-20 నాటికి రోజుకు 10 లక్షల లీటర్ల ఆవు పాలను విక్రయించే స్థాయికి ఎదగాలని అనుకుంటున్నాం. లక్ష మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తాం. అలాగే మిగతా బ్రాండ్ల పాల కంటే పతంజలి ఆవు పాలు రూ.2 తక్కువకే (లీటరు రూ.40) విక్రయిస్తున్నామ’ని బాబా రామ్దేవ్ వివరించారు.
3. పద్మం సమర్పయామి
‘పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్‌ పాదపద్మంమయి సన్నిధత్స్వ…’ అని స్తుతిస్తూ వరలక్ష్మీపూజలో సమర్పించే కమలం… ఆధ్యాత్మికతనీ అమరత్వాన్నీ ఆరోగ్యాన్నీ అందాన్నీ అనుగ్రహించే అపురూప పుష్పం..! లక్ష్మీదేవిని మాత్రమే కాదు, సరస్వతీ, బ్రహ్మ, విష్ణువు… ఇలా దేవీదేవతలందరినీ పద్మనామంతో స్తుతిస్తుంటారు. విష్ణుమూర్తి నాభి నుంచి పద్మం ఉద్భవించడంతో ఆయన్ని పద్మనాభుడనీ, ఆ నాభి నుంచి పుట్టి, ఆ పద్మాన్నే ఆసనంగా చేసుకున్న బ్రహ్మదేవుణ్ణి పద్మాసనుడనీ అంటారు. దేవతలూ రాక్షసులూ చేసిన క్షీరసాగరమథనంలో హాలాహలం తరవాత రెండు చేతుల్లో కమలాలతో సహా ఆవిర్భవించిన శ్రీలక్ష్మి, గులాబీరంగు తామరపువ్వునే ఆసనంగా చేసుకుందని చెబుతూ ఆ పద్మాలతోనే మహాలక్ష్మిని పూజిస్తారు. శుభాల్ని అందించే వినాయకుడికి గులాబీరంగు కమలమూ, చదువులతల్లి సరస్వతీదేవికి తెల్లని తామరపువ్వే ఆసనాలు. బౌద్ధులకీ ఈ సుందర సరోజం పవిత్రమైనదే. ఆ నీరజ రూపమే ఓ శక్తి కేంద్రంగా విశ్వసించే బహాయీలు నిర్మించుకున్నదే దిల్లీలోని లోటస్‌ టెంపుల్‌.
**పద్మదళ సోయగం
సూర్యోదయంతో విచ్చుకుని సూర్యాస్తమయంతో ముడుచుకునే కమలాన్ని పుట్టుకకీ పరిపూర్ణతకీ స్వచ్ఛతకీ సచ్ఛీలతకీ ధ్యానానికీ జ్ఞానానికీ ప్రతీకగానూ; సిరిసంపదలకీ పునరుత్పత్తికీ సంకేతంగానూ భావిస్తారు ఆధ్యాత్మికవాదులు. ఆ కారణంతోనే కావచ్చు, కమలాన్ని జాతీయ పుష్పంగా గౌరవించింది భారత ప్రభుత్వం. పద్మశ్రీ, పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌… తదితర పురస్కారాల్లోనూ పద్మాన్నే భాగం చేసింది. కమలం రేకులు వెడల్పుగా ఉండి, అందంగా విప్పారతాయి. అందుకే విశాలమైన కళ్లున్న స్త్రీని పద్మాక్షి అనీ, పురుషుడిని పద్మనేత్రుడనీ అంటారు. మొగ్గదశలోనూ కమలం సౌందర్యం అద్వితీయమే. అయితే ఆ పవిత్ర పుష్పాన్ని ఏ చెరువులో వికసించినప్పుడో చూసి ఆనందించడమే తప్ప, గులాబీ, లిల్లీ, మందారం, నందివర్ధనం… వంటి పూలమొక్కల మాదిరిగా పెరట్లో పెంచడం అరుదే. కాస్త బురద ఎక్కువగా ఉండే మంచినీటి కొలనుల్లోనే- అదీ అనుకూల వాతావరణ పరిస్థితుల్లోనే కమలం వికసిస్తుంది. కానీ ఆ పద్మదళ సోయగానికి ముగ్ధులైన పూలప్రేమికులు ఇప్పుడు వాటిని తొట్టెల్లోనో, చోటు ఉంటే పెరట్లో చిన్నకొలనులు కట్టించుకునో పెంచుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఇప్పుడు రంగురంగుల హైబ్రిడ్‌ రకాలూ మీనియేచర్‌ కమలాలూ వస్తున్నాయి. కమలంలో తెలుపు, గులాబీ రంగులే కాదు, ఎరుపు, నీలం, పసుపు…ఇలా ఎన్నో రంగులూ…రెండు, మూడు, నాలుగు… ఇలా మరెన్నో రేకుల వరసలున్నవీ ఉన్నాయి. మనం పవిత్రమైనదిగా భావించే కమలం రకం గులాబీరంగులో అందంగా విచ్చుకుంటే, పసుపు రంగులోని పెర్రీస్‌ జెయింట్‌ సన్‌బరస్ట్‌ పెద్దగా కప్పులా ఉంటుంది. ఈ పచ్చని పద్మం పగలు విచ్చుకుంటూ రాత్రికి మూసుకుంటూ అలా మూడురోజులకి పూర్తిగా విప్పారుతుంది. గులాబీ రంగులో విచ్చుకుని రెండో రోజుకి పసుపూగులాబీ రంగులోకీ మూడోరోజుకి పసుపురంగుకీ మారే మిసెస్‌ పెర్రీ డి స్లోకమ్‌ సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. గులాబీని తలపించే చైనీస్‌ డబుల్‌ రోజ్‌, తెల్లని తెలుపురంగులో మధుర పరిమళంతో వికసించే ఆల్బాగ్రాండిఫ్లోరా, తెలుపూ గులాబీ కలగలిసిన చావన్‌ బసు, ముద్దగులాబీలా విరిసే మోమోబోటాన్‌… ఇలా ఎన్నో రకాలు.
**తామర సాగు!
పద్మం పుట్టింది మనదేశంలోనే అయినా ప్రస్తుతం అది తామరతంపరగా వికసించేది మాత్రం చైనాలోనే. జపాన్‌, ఆస్ట్రేలియా, వియత్నాం, ఈజిప్టు, అమెరికా దేశాల్లోనూ పంకజం పరిమళిస్తుంది. ఆ తేజస్సుకి మురిసే కొరియా, చైనా, జపాన్‌ వాసులు ఏటా లోటస్‌ వేడుకల్ని జరుపుకుంటారు. అదీగాక తామర రకాలను పూలకోసమే కాదు, నేలలో ఊరే వాటి దుంపవేళ్లూ, కాడలూ, ఆకులకోసం కూడా ప్రాచీనకాలంనుంచీ ప్రత్యేక నీటి కొలనుల్లో పెంచుతున్నారు. ఉష్ణోగ్రతని సమన్వయం చేసుకునే శక్తి తామర మొక్కకి ఉన్న మరో ప్రత్యేకత. తామరపూలు పూయడానికి కనీసం 30-35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. వాతావరణంలో ఆ ఉష్ణోగ్రత లేకపోతే లోపలి నుంచే వేడిని ఉత్పత్తి చేసుకుంటుంది. ఇలా మొక్కల్లో వేడి పుట్టడం అరుదైన ప్రక్రియ. తామరగింజలకి మరణం లేదు. దాదాపు 1500 సంవత్సరాలనాటి తామరగింజ కూడా మొలకెత్తిన నిదర్శనాలు ఉన్నాయి. అందుకే ఉష్ణోగ్రత సమన్వయానికీ విత్తనాల్లో కణాల రక్షణకీ కారణమైన వీటి ప్రొటీన్లను బయోఇంజినీరింగ్‌ ప్రక్రియ ద్వారా మందుల తయారీలోనూ వాడుతున్నారు.
**ఆరోగ్యం-ఆహారం..!
గింజలతోపాటు తామరతూళ్లు- అంటే కాడల్లోపలి భాగాన్నీ వేళ్లలోని దుంపభాగాల్నీ ఆహారంగా వాడతారు. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాల్లో వీటి వాడకం ఎక్కువ. అందుకే అక్కడ వీటిని ప్రత్యేక కొలనుల్లో పెంచుతారు. పైగా దుంప వేళ్లు, గింజలు, పువ్వులు… ఇలా ఒక్కోభాగంకోసం ఒక్కో రకం మొక్కను పెంచుతారు. చైనాలో దుంపలకోసమైతేనేం, గింజలకోసం అయితేనేం, సుమారు ఏడు లక్షల యాభై వేల ఎకరాల్లో తామరను పెంచుతారు. వేయించిన తామరగింజలే ఫూల్‌ మఖానా. ఈ గింజల్ని కూరలతోబాటు, పిండి పట్టించి కేకులూ ఐస్‌క్రీముల్లో వాడుతుంటారు. తామరపూలలో కూడా విటమిన్లూ ఖనిజాలూ ఇతరత్రా పోషకాలూ లభ్యమవుతాయి. అందుకే పూరేకుల్ని గ్రీన్‌ టీ మాదిరిగా తాగితే గ్యాస్ట్రిక్‌ అల్సర్లు తగ్గడంతోబాటు రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఆకుల్లోనూ బోలెడు పోషకాలు. పైగా పద్మ రేకుల్ని ఫుడ్‌ డెకరేషన్‌లో వాడితే, కొన్ని రకాల వంటకాల్ని ఉడికించేందుకు తామరాకుల్ని ఉపయోగిస్తారు. దుంపల్లోనూ కాడల్లోనూ సి-విటమిన్‌ ఎక్కువ. దుంపల్ని ఉడికించి తిన్నా, సూపులా తీసుకున్నా రక్తహీనత తగ్గుతుంది. నెలసరిలో రక్తం ఎక్కువగా పోయేవాళ్లకి ఇవి ఎంతో మేలు. అయితే గింజల్లో పోషకాలు ఎక్కువ. వీటిలో ప్రొటీన్లూ విటమిన్లూ ఖనిజాలూ దొరుకుతాయి. బి, బి2, బి6, ఇ-విటమిన్లూ సమృద్ధిగా ఉంటాయి. గింజల్లోని సంక్లిష్ట పిండిపదార్థాలూ పాలీఫినాల్సూ బీపీ, పిత్తాశయ రాళ్లూ, మధుమేహమూ మంటా తగ్గడానికి తోడ్పడతాయి. గింజల్లోని నెఫెరిన్‌ అనే పదార్థానికి క్యాన్సర్‌ను నిర్మూలించే శక్తి ఉందనేది తాజా పరిశోధన.
తామరమొక్క భాగాలన్నింటినీ తరతరాలనుంచీ ఆయుర్వేదం, చైనా సంప్రదాయ వైద్యాల్లో ఉపయోగిస్తున్నారు. గింజల్ని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి పంచదార కలిపి తాగితే డయేరియా తగ్గుతుందట. గింజల్ని పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. పూలను కూడా డయేరియా, కలరా, జ్వరాలు తగ్గడానికి వాడతారు. మృదువైన చర్మసౌందర్యంకోసం లినోలిక్‌ ఆమ్లం, ప్రొటీన్లూ ఇతరత్రా పదార్థాలూ ఉండే పద్మదళాలను ఫేషియల్‌ క్రీముల తయారీలో వాడతారు. అలాగే పూల తైలం మెలనిన్‌ ఉత్పత్తికి తోడ్పడటం ద్వారా తెల్లజుట్టుని నిరోధిస్తుంది. ఆయురారోగ్యాల్నీ పంచి ఇచ్చే కమలం, మానవాళికి మనోవికాసాన్నీ కలిగిస్తుంది. ‘రాగద్వేషాలకతీతంగా ధర్మబద్ధంగా తన విధిని తాను నిర్వర్తించి, ఫలితాన్ని మాత్రం ఆ భగవంతుడికి వదిలేసేవాళ్లకి- నీళ్లలోనే ఉన్నా తామరాకుమీద నీరు నిలవనట్లే, బురదనీటిలో పుట్టినా కమలానికి బురదేమీ అంటనట్లే- ఎలాంటి పాపమూ సోకద’ని చెబుతున్నాయి పురాణాలు. అదే కమలంలోని గొప్పతనం. అందుకే పద్మం… పవిత్ర పూజాపుష్పం..!
4. ఘనంగా మలయప్పస్వామి సింహవాహన సేవ
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల మూడో రోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై విహరించారు. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతం సింహ వాహనం. జగన్నాయకుడి అవతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. సింహ బలమంత భక్తిభావం కలిగి ఉన్నవారికి స్వామి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. శౌర్య ప్రతాపాలకు ప్రతీకగా నిలిచే సింహాన్ని తన వాహనంగా మలచుకుని తిరువీధులలో స్వామివారు విహరించారు. యోగ నృసింహునిగా సింహ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈరోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంలో విహరించనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com