హత్య చేయించినందుకు నాకు ఎలాంటి బాధ లేదు


నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్యకేసులో ఏ1 నిందితుడు నోరు విప్పాడు. తన కుమార్తె అమృత వర్షిణిపై ప్రేమతోనే ప్రణయ్‌కుమార్‌ను హత్యచేయించానని పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. నిన్న మధ్యాహ్నం కిరాయి హంతకుడు ప్రణయ్‌ను హతమార్చిన తర్వాత .. పరారీలో ఉన్న అమృత తండ్రి మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యకు దారితీసిన కారణాలను మారుతీరావు పోలీసుల ఎదుట వెల్లడించినట్లు తెలుస్తోంది. ‘‘నా కుమార్తె జోలికి రావద్దని ఎన్ని సార్లు చెప్పినా ప్రణయ్‌ వినలేదు. అతన్ని చంపించినందుకు నాకు ఎలాంటి బాధలేదు. నా కూతురు కంటే సొసైటీలో పరువే ముఖ్యమని భావించా. జైలుకు వెళ్లేందుకు సిద్ధపడే హత్య చేయించా’’ అని మారుతీరావు చెప్పినట్లు తెలుస్తోంది. మిర్యాలగూడలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన బాలస్వామి, ప్రేమలతల కుమారుడు పెరుమాళ్ల ప్రణయ్‌(24), అదే పట్టణానికి చెందిన వ్యాపారవేత్త తిరునగరు మారుతీరావు కుమార్తె అమృత పదోతరగతి నుంచి స్నేహితులు. జనవరిలో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తి ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. అమృత తన భర్త దగ్గరే ఉంటానని పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది. అప్పటి నుంచి తన భర్త ఇంటి వద్దే ఉంటోంది. గొడవలు సద్దుమణిగిన తర్వాత ఇటీవలే వరుడి తల్లిదండ్రులు మిర్యాలగూడలో వివాహ విందు ఏర్పాటు చేయగా… అమ్మాయి తరఫు బంధువులు హాజరుకాలేదు. ప్రస్తుతం అమృత గర్భిణి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం అమృతను తీసుకుని ప్రణయ్‌, ఆయన తల్లి ఆసుపత్రికి వచ్చారు. అనంతరం తిరిగి వెళుతుండగా.. ప్రధాన ద్వారం వద్దకు ప్రణయ్‌ చేరుకోగానే ఆసుపత్రిలోనే మాటు వేసిన దుండగుడు వెనకనుంచి వచ్చి అతడి మెడపై కత్తితో వేటువేశాడు. దీంతో ప్రణయ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దుండగుడు మరో వేటు వేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com