గన్నవరం నుండి ఈ సర్వీసులు పెంచాలి

గన్నవరం విమానాశ్రయం దేశంలోనే ప్రయాణికుల వృద్ధిలో గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఏటేటా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు పెరుగుతూ వెళుతోంది. మూడేళ్ల కిందటి వరకూ ఏటా నాలుగు లక్షల మంది దేశీయ ప్రయాణికులు ఉండగా.. ప్రస్తుతం ఏటా 12 లక్షలకు పెరిగారు. కానీ.. విమానాశ్రయం నుంచి ఇప్పటికీ దేశంలోని కేవలం ఐదు ప్రధాన మెట్రో నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు నడుస్తున్నాయి. దీంతో ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లేందుకు హైదరాబాద్‌కు వెళ్లి విమాన సర్వీసులను ఎక్కాల్సి వస్తోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి నాలుగు జిల్లాల నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకూ నిత్యం వేల సంఖ్యలో వివిధ పనులు, పర్యాటక ప్రదేశాల సందర్శన, ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లి వస్తుంటారు. దేశవ్యాప్తంగా విమాన కనెక్టివిటీ ఏర్పడాలంటే.. గన్నవరం నుంచి అత్యవసరంగా కోచి, అహ్మదాబాద్‌, గోవా, కోల్‌కతా, షిరిడి ఐదు ప్రాంతాలకు అనుసంధానం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వ్యాపార, వాణిజ్య వర్గాలు సహా అందరి నుంచి డిమాండ్‌ వస్తోంది.
*గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం దేశంలోని ఎనిమిది ప్రదేశాలకు సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో మూడు రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి, కడప ఉండగా.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ నగరాలకు మాత్రమే ఇక్కడి నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఐదు నగరాల్లోనూ హైదరాబాద్‌ మినహా మిగతా నాలుగూ.. గత రెండేళ్లలోనే కొత్తగా ఏర్పాటయ్యాయి. ఈ నగరాలకు సైతం సర్వీసులను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ దశాబ్దాలుగా ఉన్నా.. ఇక్కడి నుంచి పెద్దగా ప్రయాణికులు ఉండరని విమానయాన సంస్థలు ముందుకు రాలేదు. విమానాశ్రయ అధికారులు, స్థానిక వ్యాపార, వాణిజ్య, రాజకీయ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు.. ఒక్కొక్కటిగా హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ సర్వీసులను ఏర్పాటు చేశారు. కానీ.. అనూహ్యంగా వాటికి డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం విమానయాన సంస్థలు పోటీ పడి మరీ విజయవాడ విమానాశ్రయం నుంచి సర్వీసులను నడుపుతున్నాయి. ఈ ఐదు మెట్రో నగరాలకూ విజయవాడ నుంచి వెళ్లే ప్రతి విమాన సర్వీసూ.. 80శాతం పైగా ఆక్యుపెన్షీతో నడుస్తున్నాయి.
**ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రదేశాలు..
*షిరిడి
దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతమైన షిరిడికి నాలుగు జిల్లాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో యాత్రికులు వెళుతుంటారు. వీళంతా నిత్యం రైలు, బస్సుల్లోనే వెళ్లాల్సి వస్తోంది. కనీసం 18 గంటల పైనే ప్రయాణం పడుతోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి కనీసం రోజూ ఒక్క విమాన సర్వీసు షిరిడికి నడిపినా.. ఫుల్‌ ఆక్యుపెన్షీతో నడుస్తుంది. గన్నవరం నుంచి నడుస్తున్న సర్వీసుల్లో ఎక్కువగా 72 సీట్లు ఉండే ఏటీఆర్‌ సర్వీసులే ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి ఓ సర్వీసును షిరిడికి వేస్తే.. నిండకపోవడం అనే ప్రశక్తే ఉండదు. రద్దీని బట్టి విమానయాన సంస్థలు ఎలాగూ కొత్త సర్వీసులను నడిపేందుకు ముందుకొస్తాయి.
*గోవా, కొచ్చి
కేరళలోని కోచి, గోవాలకు పర్యాటకులు ఇక్కడి నుంచి ఏటా లక్షల మంది వెళ్లి వస్తున్నారు. ఈ మధ్య డెష్టినేషన్‌ వెడ్డింగ్‌లు, పార్టీలూ ఎక్కువగా ఈ రెండు ప్రాంతాల్లోనే నిర్వహించుకుంటున్నారు. ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో ఆ వేడుకల్లో పాల్గొనేందుకు హాజరవుతున్నారు. వేసవిలో ఈ రెండు ప్రాంతాలకు ఇక్కడి నుంచి భారీగా ప్రయాణికుల డిమాండ్‌ ఉంటోంది.
*అహ్మదాబాద్‌
గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌ నుంచి పెద్దఎత్తున వ్యాపార సంబంధాలు విజయవాడ, గుంటూరు సహా చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉన్నాయి. ప్రధానంగా మార్వాడీలు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నారు. వస్త్ర వ్యాపారం అహ్మదాబాద్‌ కేంద్రంగానే ఎక్కువగా సాగుతుంది. అధిక సంఖ్యలో అక్కడి నుంచే దిగుమతి అవుతుంటాయి. ఈ వ్యాపార కార్యకలాపాల కోసం నిత్యం వెళ్లి వచ్చే ప్రయాణికులు ఉన్నారు.
*కోల్‌కతా
పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాతో ఇక్కడి వాళ్లు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు అధికంగా నిర్వహిస్తుంటారు. ప్రధానంగా వస్త్ర వ్యాపారం అక్కడి నుంచే జరుగుతుంటుంది. ఇక్కడి నుంచి నిత్యం పెద్దసంఖ్యలో వెళ్లి వస్తుంటారు. పైగా.. ఒడిస్సా రాజధాని భువనేశ్వర్‌ను కలుపుతూ ఇక్కడి నుంచి ఓ విమాన సర్వీసును నడపాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది.
*అన్ని ప్రాంతాలకూ అనుసంధానం..
దిల్లీ, ముంబయి వంటి మెట్రో నగరాలకు ఇక్కడి నుంచి విమాన సర్వీసులను ఆరంభించిన తర్వాత.. ఇక్కడి వారికి ఎంతో సౌలభ్యం ఏర్పడింది. గతంలో రైలులో ఒక రోజుకు పైగా ప్రయాణించాల్సి వచ్చేది. లేదంటే హైదరాబాద్‌కు వెళ్లి విమానం ఎక్కాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ బాధ తప్పింది. డిమాండ్‌ కూడా బాగా పెరిగింది. దేశంలోని ఈ ఐదు ప్రధాన ప్రాంతాలను కలిపేలా సర్వీసులను ఏర్పాటు చేస్తే.. దేశమంతా సంపూర్ణంగా అనుసంధానం ఏర్పడుతుంది. షిరిడి, కోచి, గోవా, అహ్మదాబాద్‌, కోల్‌కతా ప్రాంతాలకు నిత్యం ఇక్కడి నుంచి వెళ్లి వచ్చేవాళ్లు వేల మంది ఉంటారు. రోజుకు ఈ ఐదు ప్రాంతాలకూ కనీసం ఒక్క సర్వీసును ఏర్పాటు చేసినా.. విపరీతమైన రద్దీ ఉంటుంది. తర్వాత అదనంగా నడిపేందుకు విమానయాన సంస్థలే పోటీ పడే పరిస్థితి ఉంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com