ఫేస్‌బుక్‌లో ప్రణయ్-అమృతల ఫోటోషూట్ మారుతీరావును రెచ్చగొట్టింది!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య ఘటనకు సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. శుక్రవారం ఉదయం ప్రణయ్‌ను ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదుట నరికి చంపింది నల్గొండకు చెందిన రౌడీషీటర్‌ అని పోలీసులు భావిస్తున్నారు. ప్రణయ్‌ భార్య అమృత తండ్రి మారుతీరావు.. హంతకుడికి రూ.10 లక్షలు చెల్లించినట్లు తెలిసింది. ఈ హత్యకు సూత్రధారి నల్గొండకు చెందిన రౌడీషీటర్‌ అబ్దుల్‌ బారీ అని విచారణలో తేలిందని విశ్వసనీయ సమాచారం. బారీ ఉగ్రవాద మూలాలున్న వ్యక్తి. గుజరాత్‌ మాజీ హోం మంత్రి హరేన్‌ పాండ్య హత్యకేసులో శిక్ష అనుభవించి వచ్చాడు. హత్యకు సంబంధించి మారుతీరావుకు తొమ్మిది నుంచి పది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ పరువు హత్య కేసులో ప్రధాన నిందితులు మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌, మారుతీరావు స్నేహితుడు, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కరీం, మారుతీరావు కారు డ్రైవర్‌, హత్యకు సూత్రధారి అబ్దుల్‌బారీ, హంతకుడిగా భావిస్తున్న షఫీ, హత్యకు సహకరించిన రంగం రంజిత్‌, శ్రీకర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. మారుతీరావు కొంతకాలంగా ప్రణయ్‌ హత్యకు కుట్ర పన్నుతున్నారు. దీనిలో భాగంగా ఆయన తన స్నేహితుడు కరీంను సంప్రదించారు. వీరిద్దరూ తమకు పరిచయస్తుడైన నల్గొండకు చెందిన రౌడీషీటర్‌ అబ్దుల్‌ బారీని కలిశారు. వీరంతా ప్రణయ్‌ హత్యకు పథకం రూపొందించారు. మారుతీరావు 20 రోజుల క్రితం అబ్దుల్‌బారీకి హైదరాబాద్‌ సమీపంలోని బాహ్యవలయ రహదారి వద్ద రూ.15 లక్షలిచ్చారు. నాలుగు రోజుల తర్వాత మరో రూ.3 లక్షలు చెల్లించారు. ప్రణయ్‌ను హత్య చేయడానికి నల్గొండకే చెందిన ఓ రౌడీషీటర్‌ (షఫీ?)ని అబ్దుల్‌బారీ రంగంలోకి దించినట్లు సమాచారం. ఈ రౌడీషీటర్‌ ఇటీవల హైదరాబాద్‌ పాతబస్తీ కేంద్రంగా, బారీ తరపున దందా నడిపిస్తున్నాడు. ప్రణయ్‌- అమృత కదలికలను స్థానికంగా ఉన్న కరీం సన్నిహితులు కొందరు ఎప్పటికప్పుడు మారుతీరావుకు చేరవేసేవారని తెలిసింది. కరీం, ప్రణయ్‌ ఇళ్లు దగ్గరగా ఉండటంతో అక్కడి కదలికలు ఎప్పటికప్పుడు వీరికి తెలిసేవి. హత్యకు ముందు రోజు హంతక ముఠాకు కరీం మిర్యాలగూడలోనే ఆశ్రయం ఇచ్చారని సమాచారం. ప్రణయ్‌ను హత్య చేయడానికి శుక్రవారం మధ్యాహ్నం రౌడీషీటర్‌ మరో వ్యక్తితో కలిసి ఆసుపత్రి వద్దకు వచ్చాడు. రెండో వ్యక్తి ఆసుపత్రికి కొద్ది దూరంలో ద్విచక్రవాహనాన్ని నిలిపి ఎదురుచూస్తుండగా రౌడీషీటర్‌ వచ్చి.. ప్రణయ్‌పై వేటకొడవలితో రెండుసార్లు దాడి చేశాడు. వేటకొడవలిని కొద్ది దూరంలో పడేసి ద్విచక్రవాహనంపై వేచిచూస్తున్న వ్యక్తితో కలిసి పరారయ్యాడని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అంతకుముందే మారుతీరావు మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌ వైపు కారులో వెళుతున్న దృశ్యాలు మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద నమోదయ్యాయి. అంటే హత్యకు కొద్దిసేపటి ముందే అతను మిర్యాలగూడ నుంచి నల్గొండకు చేరుకున్నట్లు సమాచారం. నల్గొండలో తాము ప్రయాణిస్తున్న కారును ఓ ప్రైవేటు కాంప్లెక్స్‌ వద్ద పార్కు చేసిన మారుతీరావు.. అబ్దుల్‌బారీ స్నేహితుడు ఏర్పాటు చేసిన వాహనంలో హైదరాబాద్‌కు చేరుకున్నారని సమాచారం. హత్య జరిగిన సమయంలో తన కూతురు అమృతకు హాని తలపెట్టవద్దని మారుతీరావు మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ హత్య కేసులో నయీం ముఠా సభ్యులకు సంబంధాలున్నాయా అనే కోణంలోనూ పోలీసు విచారణ సాగుతున్నట్లు సమాచారం. అబ్దుల్‌బారీ, నయీం ముఠా సభ్యులకు ఉన్న సంబంధాలేంటి? గతంలో మారుతీరావుకు, అబ్దుల్‌బారీకి ఉన్న పరిచయాలు తదితర విషయాలపైనా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. హత్యకు పథకం రూపొందించిన మహ్మద్‌ అబ్దుల్‌ బారీ, హంతకుడు, హత్య అనంతరం నిందితుడిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లిన వారి కోసం పోలీసులు రెండు నుంచి మూడు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్లు తెలిసింది. వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం ఒకటి రెండు రోజుల్లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టవచ్చని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జనవరిలో ప్రణయ్‌- అమృత పెళ్లి చేసుకున్నారు. తర్వాత అమృతను వదిలేయాలని మారుతీరావు చాలాసార్లు ప్రణయ్‌ను బెదిరించారని, అయితే అమృతపై ప్రేమతో అతను అందుకు అంగీకరించలేదని ప్రణయ్‌ బంధువులు చెబుతున్నారు. కొన్నాళ్లపాటు మారుతీరావు స్తబ్దుగా ఉన్నా.. ఆగస్టులో జరిగిన ప్రణయ్‌, అమృతల వివాహ విందుతో అతనిలో పగ బుసలు కొట్టిందని అంటున్నారు. వీరి వివాహ విందు ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో తన పరువు తీస్తున్నారని భావించిన మారుతీరావు సాధ్యమైనంత తొందరలో ప్రణయ్‌ను వదిలించుకోవాలని భావించాడని సమాచారం. ఈ హత్యోదంతంలో కరీం, అబ్దుల్‌ బారీ, ప్రణయ్‌ను హత్య చేసిన రౌడీషీటర్‌ గ్రూప్‌ల మధ్య భారీ ఎత్తున నగదు చేతులు మారినట్లు సమాచారం. హత్యకు పథకం రూపొందించిన అబ్దుల్‌బారీకి అప్పటికే రూ.18 లక్షలు చెల్లించారు. అందులో రూ.10 లక్షలను హంతకుడికి ఇచ్చారు. మరికొంత నగదు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. తన భర్త ప్రణయ్‌ హత్యలో నల్గొండ జిల్లా నకిరేకల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పాత్ర ఉందని హతుడి భార్య అమృత ఆరోపించారు. ఆయన తమను బెదిరించారని, తన వద్దకు వచ్చి మాట్లాడాలని ఫోన్‌ చేశారని చెప్పారు. ప్రణయ్‌ మృతదేహాన్ని చూసిన కన్నీటి పర్యంతమైన అమృత మాట్లాడుతూ.. తన తండ్రికి వేముల వీరేశంతో మంచి సంబంధాలున్నాయని, ప్రణయ్‌ హత్యలో వీరేశం పాత్ర కూడా ఉందని చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com