Health

ఎండు మిరపకాయలతో దీర్ఘాయుష్షు

Red Chillies For Health - Increases Life Expectancy

నాలుకకు కొద్దిగా మసాలా ఘాటు రుచి తగలాలనుకునే వారు వంటల్లో ఎండు మిరపకాయల కారాన్ని కాస్త ఎక్కువగానే దట్టిస్తారు ఈ అలవాటు ఎసిడిటి, అల్సర్‌కు దారితీయొచ్చనే హెచ్చరికలను పక్కనబెడితే కాస్త భోజనంలో స్పైసీని ఆస్వాదించేవారికి అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ) అధ్యయనం గొప్ప ఊరటనిచ్చేదే. ఎందుకంటారా? ఎండు మిరప కారంతో వండిన పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందట. కారం ఘాటుతో వాపు, నొప్పిని నివారించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ.. బ్లడ్‌ సెల్స్‌ సరిగా పనిచేయడం ద్వారా హృద్రోగాలను నివారించేందుకు దోహదపడే యాంటీఆక్సిడెంట్లు వృద్ధి చెందుతాయట. బ్లడ్‌ గ్లూకోజ్‌ అదుపులో ఉండటంతో పాటు కేన్సర్‌ నిరోధకాలు పెరుగుతాయట. వీటితోపాటు గుండెకు, శరీరంలో రక్త ప్రసరణకు సంబంధించిన నాళాలు సరిగా పనిచేయడంతో మరణం ముప్పు తక్కువగా ఉంటుందని తమ పరిశోధనలో ఏహెచ్‌ఏ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మేరకు అమెరికా, ఇటలీ, చైనాకు చెందిన 5.7లక్షల మందికిపైగా హెల్త్‌ రికార్డులను పరిశీలించి గట్టి అంచనాకు వచ్చారు. గుండెకు, శరీరంలో రక్త ప్రసరణ నాళాల సమస్యతో మరణం 26, కేన్సర్‌ మరణం 23, అన్ని రకాల మరణం 25 తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.