పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనకు అవకాశం ఇస్తే పెట్రోలు, డీజిల్‌లను లీటర్ రూ.35-40కే విక్రయిస్తానని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ అన్నారు. పెట్రో ధరలు నియంత్రించడంలో భాజపా ప్రభుత్వం విఫలమైందని తానేమీ ఎద్దేవా చేయడం లేదని, కానీ, తనకు అవకాశం ఇస్తే మాత్రం ధరలు తగ్గించి చూపుతానని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త గరిష్ఠాలకు చేరిన సంగతి తెలిసిందే. నేడు లీటర్ పెట్రోలు ధర దేశ రాజధాని దిల్లీలో రూ.82 ఉండగా, ముంబయిలో రూ.89 ఉంది. ఇక డీజిల్ ధర రూ.78.33గా ఉంది. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాబా రామ్‌దేవ్ మాట్లాడారు. ‘‘నాకు ప్రభుత్వం అవకాశం ఇచ్చి, పన్నుల విషయంలో కాస్త ఉపశమనం ఇస్తే, పెట్రోల్, డీజిల్‌లను లీటరు రూ.35-40 విక్రయించేలా చేస్తా’’ అని అన్నారు.