* మారటోరియం కాలానికి చక్రవడ్డీ మాఫీ కల్పించి రుణగ్రహీతలకు ఊరట కల్పించామని, ఇంకా ఉపశమనాలు ఇస్తే ఆ ఆర్థిక ఒత్తిడిని బ్యాంకింగ్ రంగం తట్టుకోలేదని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇది పూర్తిగా ఆర్థిక విధానాలకు సంబంధించిన అంశమని, దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.
* దేశీయ మార్కెట్ల వరుస రికార్డులకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఐటీ, ఆర్థిక రంగాల షేర్లలో లాభాల స్వీకరణ సూచీలను కుదిపేశాయి. ఫలితంగా మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 580 పాయింట్లు పతనమవగా.. నిఫ్టీ 12,800 దిగువకు పడిపోయింది.
* లక్ష్మీ విలాస్ బ్యాంకును డీబీఎస్ బ్యాంకులో విలీనానికి గడువు సమీపిస్తుండటంతో ఆ బ్యాంకు షేర్లు వరుసగా రెండో రోజూ పడిపోతున్నాయి. దాదాపు 20 శాతం నష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి బీఎస్ఈ ట్రేడింగ్లో 20 శాతం నష్టంతో రూ.12.40 వద్ద స్థిర పడిన షేరు ధర ఇవాళ మళ్లీ 19.68 శాతం క్షీణించి రూ.10 వద్ద కొనసాగుతోంది. మరోవైపు బ్యాంకు విలీనానాన్ని వ్యతిరేకిస్తూ లక్ష్మీ విలాస్ బ్యాంకు మదుపర్లంతా ఆర్బీఐని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
* ‘ప్రస్తుత పరిస్థితుల్లో మంచి వ్యాపారం అంటే నైతిక విలువలు పాటించాలి. సమాజాన్ని సంరక్షించుకోవడం, అందరినీ మమేకం చేయడం’.. అని మహీంద్రా గ్రూప్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. తమ గ్రూపు 75 వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ సహా 10 మెట్రో నగరాల్లోని వ్యాపార, వృత్తిగత రంగాల ప్రతినిధులు 2,089 మంది అభిప్రాయాలను టెలిఫోన్ ద్వారా సమీకరించినట్లు సంస్థ తెలిపింది మదుపర్లు, వినియోగదార్లు, ఉద్యోగుల కోణంలో మంచి వ్యాపారం ఎలా ఉండాలో నివేదిక రూపొందించింది. మంచి వ్యాపారం చేసే వ్యక్తుల ఆలోచనలు ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో ఎలా మార్పు చెందుతున్నాయనేది ఇందులో ప్రస్తావించింది. మంచి వ్యాపారం అంటే వ్యక్తిగత విలువలు, జీవిత అనుభవాల ఆధారంగా ఏర్పడే లోతైన వ్యక్తిగత అభిప్రాయమని అధ్యయనంలో పేర్కొంది. ‘ వినియోగదార్లు, వాటాదార్లు, ఉద్యోగులు, సమాజ అంచనాలకు అనుకూలంగా వ్యాపారాల్లో మార్పులు రావల్సిన అవసరం ఉంది. ఇరు పక్షాలకూ మేలు జరిగేదే మంచి వ్యాపారం’ అని అధ్యయన అంశాలపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు.