Politics

సాహ్నీ మేడం…మీ అనుమతి మాకు అక్కర్లేదు!

SEC Nimmagadda Writes To Neelam Sawhney About Final Decision On Elections

పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య మొదలైన ప్రచ్ఛన్నయుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల తేదీలను నిర్ణయించేది ఎన్నికల సంఘమే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం కాదని స్పష్టం చేస్తూ గురువారం ప్రధాన కార్యదర్శికి ఎస్‌ఈసీ లేఖ రాశారు. ఎన్నికల తేదీలను నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదన్న భ్రమల్లో ఉంటే తొలగించుకోవాలని, దీనిపై ఏమైనా సందేహాలుంటే కోర్టును అడిగి స్పష్టత తెచ్చుకోవాలనీ ఆయన లేఖలో సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వం తన స్వీయ, సంకుచిత ప్రయోజనాల కోసం ప్రజల్లో భయాందోళనలు ప్రేరేపించడం అనైతికమని ఎస్‌ఈసీ అభిప్రాయపడినట్టు తెలిసింది. మరోవైపు ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో సమావేశం నిర్వహించేందుకు ఆయన చేసిన ప్రయత్నం రెండోరోజు గురువారమూ సఫలం కాలేదు. వీడియో సమావేశానికి హాజరవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారుల్ని ఆదేశించాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాల్గొనాలని నీలం సాహ్నికి ఆయన మరోసారి సమాచారమిచ్చినా ఆమె సానుకూలంగా స్పందించలేదు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, కాబట్టి ప్రస్తుతం కలెక్టర్లతో వీడియో సమావేశమూ అక్కర్లేదని ఆమె పునరుద్ఘాటించారు. వీడియో సమావేశంలో పాల్గొనాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ నుంచి వర్తమానం వెళ్లకపోవడంతో గురువారం కూడా సమావేశం జరగలేదు. మంత్రి కొడాలి నాని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్య తీసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు రమేశ్‌కుమార్‌ గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు మరోసారి విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ నుంచి సానుకూల స్పందన రాకపోతే కోర్టుకెళ్లాలని ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు సమాచారం.

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యం కాదని, కలెక్టర్ల సమావేశం కూడా అవసరం లేదని సీఎస్‌ రాసిన లేఖకు.. ప్రభుత్వ వైఖరి రాజ్యాంగ విరుద్ధమంటూ బుధవారం రమేశ్‌కుమార్‌ ప్రత్యుత్తరమిచ్చారు. దానిపై సీఎస్‌ గురువారం ఆయనకు మరో లేఖ రాశారు. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని ఆమె పునరుద్ఘాటించినట్టు సమాచారం. ఈ అంశంపై నిరంతరం సంప్రదింపులు కొనసాగిద్దామని, ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తాము భావించినప్పుడు తెలియజేస్తామని మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో రమేశ్‌కుమార్‌ సీఎస్‌కు ఈసారి కాస్త ఘాటుగానే లేఖ రాసినట్టు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ‘ఎన్నికల తేదీలను మీరు చెప్పాకే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇవ్వాలనడం రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధం. మీరు చెప్పిందే జరగాలన్న, జరుగుతుందన్న భ్రమలో ఉండటం సరికాదు. ఎన్నికల తేదీ నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానిదేనని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలే తప్ప సమ్మతి తీసుకోవాల్సిన అవసరం లేదనీ కోర్టు చెప్పింది. ప్రభుత్వ సమ్మతి తీసుకోవాలని చెప్పినట్టుగా వక్రభాష్యం చెప్పడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. అభివృద్ధి పనులకు సంబంధించి ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరా? అన్న అంశంపై ప్రభుత్వం ఇటీవల కోర్టుకెళ్లగా, దానిపై కోర్టు స్పష్టత ఇచ్చింది. ఎన్నికల తేదీలు ఎవరు నిర్ణయించాలన్న విషయంలోనూ మీకు సందేహం ఉంటే కోర్టునే అడగండి. అంతే తప్ప మీకు తోచినట్లుగా వక్రభాష్యం చెప్పడం శిక్షార్హమైన నేరం’’ అని ఆ లేఖలో రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎన్నికలపై నిరంతరం సంప్రదింపులు కొనసాగిద్దామని ఒకపక్క చెబుతూ.. కలెక్టర్లతో తాను నిర్వహించాలనుకున్న వీడియో సమావేశం జరగకుండా అడ్డుకోవడం రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధమని లేఖలో రమేశ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. కలెక్టర్లతో తాను సమావేశం పెట్టింది కూడా సంప్రదింపులు జరపడానికేనన్నారు. ప్రభుత్వ వైఖరి పరస్పర విరుద్ధంగా, కపటత్వంతో కూడినదిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘కరోనా కేసుల నమోదును రోజుకు 10 వేల నుంచి 2 వేల కంటే తక్కువకు తీసుకురావడంలో వైద్య సిబ్బంది కృషి అభినందనీయం. వారి గొప్పతనాన్ని, పనితనాన్ని కించపరిచే రీతిలో ప్రభుత్వం సంకుచిత ప్రయోజనాల కోసం కొవిడ్‌ బూచిని చూపించి ప్రజల్లో భయాందోళనలు కలిగించాలనుకోవడం అనైతికం. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులను మేం నిరంతరం సంప్రదిస్తూనే ఉన్నాం. అన్ని అంశాలపై అవగాహనకు వచ్చాకే ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నాం’ అని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.