రాజమండ్రి-బీహార్-మలక్‌పేట-మిర్యాలగూడ-ప్రణయ్ హత్య.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. నిందితులను మంగళవారం మీడియా ఎదుట హాజరుపరిచి.. ప్రణయ్‌ హత్యకేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ‘‘ప్రణయ్‌ హత్యకు తొలుత రెండున్నర కోట్ల రూపాయలు సుపారీ అడిగారు. చివరకు మారుతీరావు కోటి రూపాయలకు కాంట్రాక్టు కదురుర్చుకున్నాడు. ఏ1 నిందితుడు సుభాష్‌ శర్మ బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి. గతంలోచోరీ కేసులో నిందితుడైన సుభాష్‌కు మహమ్మద్‌ బారికి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో పరిచమయ్యాడు. మహమ్మద్‌ బారీ స్వస్థలం హైదరాబాద్‌లోని మలక్‌ పేట. సుభాష్‌ శర్మ మిర్యాలగూడలో ఆసుపత్రి వద్ద కత్తితో ప్రణయ్‌ను నరికాడు. అస్గర్‌ అలీ స్పాట్‌లో ఉండి డైరెక్టక్షన్‌ ఇచ్చాడు. అస్గర్‌ ఆలీ వివేక్‌ పాండ్యా హత్యకేసులో నిందితుడు. ఏ4 మహ్మద్‌ బారీ హైదరాబాద్‌ మలక్‌పేటలో ఉంటాడు. అస్గర్‌ అలీ, బారీ మిత్రులు. ఏ5 అబ్దుల్‌ కరీం మిర్యాలగూడలో ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్‌. ఏ6 మారుతీరావు సోదరుడు శ్రవణ్‌, ఏ7 శివ (మారుతీరావు డ్రైవర్‌). ప్రణయ్‌, అమృత 9వ తరగతి నుంచే ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదివేటప్పడు కూడా ప్రేమ కొనసాగింది. ఇంజినీరింగ్‌ చదువును మధ్యలోనే మానేశారు. ఈ విషయం తండ్రికి తెలిసి పలుమార్లు మందలించాడు. జనవరి 30న ఇంటి నంచి వెళ్లిపోయి హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత మిర్యాల గూడలోనే నివాసముంటున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి ప్రణయ్‌ను అంతమొందించాలని మారుతీరావు నిర్ణయించుకున్నాడు. ప్రణయ్‌, అమృత అభద్రతతో ఉండటంతో పోలీసుల సూచన మేరకు వారి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. జూన్‌ నెల నుంచి మారుతీరావు అమృతకు ఫోన్‌ కాంటాక్టులోకి వెళ్లాడు. అప్పటి నుంచి హత్యకు పకడ్బంధీగా ప్లాన్‌ చేశాడు. అమృతకు గర్భస్రావం చేయించేందుకు తండ్రి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. జులై మొదటి వారంలో ప్రణయ్‌ హత్యకు.. అస్గర్‌, బారీ మిర్యాలగూడ ఆటో నగర్‌లో మారుతీరావుతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2011 నుంచి మారుతీరావుతో బారీకి పరిచయాలున్నాయి. అస్గర్‌, బారీకి జూలై 9, 10 తేదీల్లో అడ్వాన్స్‌గా రూ.10లక్షలు కరీం ద్వారా ఇచ్చారు. ఆగస్టు 9 నుంచి రెక్కీ నిర్వహించారు. ఆగస్టు 14న మొదటిసారి హత్యకు ప్రయత్నించారు. అమృత బ్యూటీ పార్లర్‌ వద్దకు వచ్చినప్పడు ప్రణయ్‌ను చంపేందుకు ప్రయత్నించారు. వారితో పాటు ప్రణయ్‌ సోదరుడు కూడా ఉండటంతో కన్ఫ్యూజన్‌కు గురై ఆగిపోయారు. వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు ప్లాన్‌చేయడం కూడా మారుతీరావుకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. సెప్టెంబరు మొదటి వారంలో కూడా మరో ప్రయత్నం జరిగింది. అమ్మాయిని కిడ్నాప్‌ చేసి ప్రణయ్‌ను చంపాలని భావించారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి కొందరిని తీసుకొచ్చారు. కానీ కుదరలేదు. ఆ తరువాత సెప్టెంబరు 14న జ్యోతి ఆసుపత్రి వద్ద హత్యచేశారు. హత్య జరిగిన తర్వాత సుభాష్‌ శర్మ బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి పట్నా వెళ్లాడు. పట్నాలో సుభాష్‌ శర్మను అరెస్టు చేశారు. రేపు లేదా ఎల్లుండి సుభాష్‌ను నల్గొండ తీసుకొస్తాం. మారుతీ రావుపై భూ దందాలకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. మారుతీ రావు తొలుత కష్టాన్ని, తర్వాత మోసాన్ని నమ్ముకుని ఎదిగాడు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. హత్య జరగడానికి రెండు గంటల ముందే మారుతీరావు నల్గొండ చేరుకున్నాడు. మార్గ మధ్యలో ఎదురు వచ్చిన పోలీసులకు కూడా మారుతీరావు కనిపించి సీన్‌లో తాను లేనని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఈ కేసులో అమృత తల్లి పాత్ర ఏమీలేదు. కేవలం ఆమె ద్వారా సమాచారం తెలుసుకుని హత్యకు పథక రచన చేశాడు. ఈ కేసులో నిందితులంతా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ఇది వ్యక్తిగత వ్యవహారమే తప్ప రాజకీయాలకు సంబంధం లేదు. ఇదంతా డబ్బులతో చేశారు. ఈ కేసులో నయీం ముఠా హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేమీ లేదు. జిల్లాలో నయీం ముఠా లేదు. ఈ కేసుకు సంబంధించి మీడియాలో రకరకాలు అసత్య సమాచారంతో వార్తలు రాస్తున్నారు. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ రంగనాథ్‌ విజ్ఞప్తి చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com