* సహారా గ్రూప్ సంస్థల అధినేత సుబ్రతా రాయ్ తక్షణమే రూ.62,600 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డబ్బు జమ చేయని పక్షంలో ఆయన పెరోల్‌ను రద్దు చేయాలని కోరింది. 2012, 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సహారా గ్రూప్ పాటించలేదని సెబీ పిటిషన్లో పేర్కొంది. ఓవైపు రోజురోజుకీ రుణాలు పెరుగుతున్నా.. వారు మాత్రం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ బయట ఆనందంగా తిరుగుతున్నారని సెబీ ఆరోపించింది. సహారా గ్రూప్ తక్షణమే బకాయిలు మొత్తం జమచేసేలా ఆదేశించాలని, లేదంటే వారి పెరోల్‌ను రద్దు చేసి తిరిగి జైలుకు పంపాలని న్యాయస్థానాన్ని కోరింది.
* ఆదాయపన్ను ఏడాది 2020-21కి సంబంధించి జూన్, జులైలోనే పన్ను చెల్లింపుదారులు రిటర్నులు సమర్పించారు. ఇప్పటికీ వారిలో అనేక మందికి రీఫండ్ లభించలేదు. ఐటీఆర్‌ల ప్రక్రియ చేపట్టే వేదిక (సీపీసీ 2.0)ను ఉన్నతీకరిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సాంకేతికత మార్పుల వల్లే ఇంకా డబ్బులు చెల్లించలేదని ఆదాయపన్ను శాఖ ట్విటర్ ద్వారా తెలిపింది. అనేక మంది రీఫండ్ గురించి ఐటీ శాఖకు ఫిర్యాదులు చేస్తుండటంతో ఇలా స్పందించింది.
* ప్రైవేటు బ్యాంకుల యాజమాన్యం, కార్పొరేట్ స్ట్రక్చర్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అంతర్గత కమిటీ శుక్రవారం ఓ నివేదికను విడుదల చేసింది. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 15 ఏళ్ల తర్వాత ప్రమోటర్ల చెల్లింపు ఈక్విటీ వాటా పరిమితిని 26 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్యాకింగ్ నిబంధనల ప్రకారం ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ప్రమోటర్లు తమ యాజమాన్య వాటాను మూడేళ్లలో 40%, 15 ఏళ్లలో 15 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ వంటి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు రాణించడంతో గురువారం నాటి నష్టాల నుంచి సూచీలు కోలుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపు నష్టాలోకి వెళ్లాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ కోలుకుని లాభాల్లోకి దూసుకెళ్లాయి.
* మనీలాండరింగ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హామీ ఇచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ – వీడియోకాన్ గ్రూప్ కేసులో నమోదైన ఈసీఐఆర్‌ను అనుసరించడంలో దర్యాప్తు సంస్థ ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడదని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నేడు సుప్రీం కోర్టుకు తెలిపారు. తన భర్త దీపక్ కొచ్చర్ అరెస్టును సవాల్ చేస్తూ చందా కొచ్చర్ వేసిన పిటిషన్‌పై వాదనల సందర్భంగా తుషార్ మెహతా వెల్లడించారు.
* దేశీయ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 43,780 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 52 పాయింట్లు ఎగబాకి 12,825 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.14 వద్ద కొనసాగుతోంది. నిన్నటి నష్టాల నేపథ్యంలో మదుపర్లు షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతుండడంతో సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అమెరికాలో కరోనా ఉద్దీపన పథకంపై ఆ దేశ ఫెడరల్ బ్యాంక్, ఆర్థిక శాఖ మధ్య విభేదాలు తలెత్తడంతో అక్కడి మార్కెట్లు నేలచూపులు చూశాయి. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.