Politics

చంద్రబాబు యాత్రపై విచారణ. జగన్ సర్కార్‌కు హైకోర్టు అక్షింతలు.

చంద్రబాబు యాత్రపై విచారణ. జగన్ సర్కార్‌కు హైకోర్టు అక్షింతలు.

రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేసి ప్రస్తుతం తరలిస్తామనడం ప్రభుత్వ మతిలేని చర్య (మైండ్‌లెస్‌ యాక్షన్‌) కాదా? అని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. రాజధాని కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేశాక ఎక్కడి పనుల్ని అక్కడే నిలిపేయడం ఏమిటని మండిపడింది. ప్రభుత్వం ఖర్చు చేసిన ఆ సొమ్మంతా ప్రజలదని.. పనులు నిలిపేయడంతో అంతిమంగా వ్యథకు గురయ్యేది ప్రజలేనని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో చాలా భవనాలు నిర్మించి.. ఎక్కడివాటిని అక్కడే వదిలేశారని వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు ఖర్చు చేసిందంతా ప్రభుత్వానికి, ప్రజలకు జరిగిన నష్టమా, కాదా అని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పిటిషనర్‌ తన అఫిడవిట్లో ‘ప్రస్తుత ప్రభుత్వం మతిలేని చర్య’ అని పేర్కొంటే తప్పేమిటని ప్రత్యేక సీనియర్‌ కౌన్సెల్‌ ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ను ప్రశ్నించింది. తమ భూముల నుంచి ఖాళీ చేయించకుండా రెవెన్యూ అధికారుల్ని నిలువరించాలంటూ దాఖలైన పలు వ్యాజ్యాల్లో చట్ట నిబంధనలు అనుసరించాలనీ తామే ఆదేశించినట్లు కూడా గుర్తు చేసింది. నిబంధనలను పాటించకుండా పిటిషనర్లను ఖాళీ చేయించడం రాష్ట్ర ప్రభుత్వ మతిలేని చర్య కాదా? అని నిలదీసింది. పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తుల్ని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వాదనల కొనసాగింపునకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ప్రజాచైతన్య యాత్రకు పోలీసుల అనుమతితో విశాఖ వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సీఆర్‌సీపీ సెక్షన్‌ 151 కింద నోటీసిచ్చి పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని, ప్రతిపక్ష పార్టీలు చేపట్టే ర్యాలీలు, సమావేశాలను పోలీసులు అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ తెదేపా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం విచారణ జరిగింది. పోలీసుల తరఫున సీనియర్‌ కౌన్సెల్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ మతిలేని చర్య (మైండ్‌లెస్‌ యాక్షన్‌)పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతిపక్షనేత యాత్ర చేపట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారన్నారు. ‘మతి లేని చర్య’ అనడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో రాజధాని అమరావతిలో పనులు నిలిపేయడాన్ని గుర్తు చేసిన ధర్మాసనం అది ప్రభుత్వ మతిలేని చర్య కాదా? అని ప్రశ్నించింది.