‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ చిత్రీకరణలో సత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్ రామలింగరాజు సూచనలతో నిక్షిప్తపరిచిన సమాచారాన్ని వినియోగించుకోవడానికి ఆయన మేనేజరు హరి అనుమతులు ఇచ్చారని… అయితే ఇప్పుడు హరి ఎవరో తనకు తెలియదంటూ రామలింగరాజు మాట మార్చారని నెట్‌ఫ్లిక్స్ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ఈ డాక్యుమెంటరీ విడుదలకు ముందు కూడా వివరాలను హరికి పంపామని, ఆయన అభినందనలు తెలిపారని వివరించారు. అయినా అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించుకోవడానికి, డాక్యుమెంటరీ పేరు పెట్టడానికి ఎవరి అనుమతులూ అవసరం లేదన్నారు. ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ డాక్యుమెంటరీని నిలిపివేస్తూ కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై నెట్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ ఇండియా హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణను కొనసాగించింది. నెట్‌ఫ్లిక్స్ తరఫు న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపిస్తూ ఇది రామలింగరాజు ప్రైవేటు, వ్యక్తిగతానికి సంబంధించిన అంశం కాదని, కార్పొరేట్ వ్యవహారమని, ఇది పెద్ద ఆర్థిక నేరమని తెలిపారు. ఇందులో ప్రజలకు, వాటాదారులకు, కంపెనీలకు సంబంధం ఉందన్నారు. 12 ఏళ్లుగా ప్రజాబాహుళ్యంలో సమాచారం ఉందని, రామలింగరాజు చేసిన తప్పును అంగీకరిస్తూ స్వయంగా లేఖ విడుదల చేశారని చెప్పారు. కోర్టు రికార్డులోని సమాచారాన్ని వాడుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం రికార్డుల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని వినియోగించుకోవడంలో చట్టం ఏమేరకు అనుమతిస్తుందన్న దానిపై వాదనలు వినిపించాలంటూ తదుపరి విచారణను డిసెంబరు 4కు వాయిదా వేసింది.
రామలింగరాజువి అన్నీ అబద్ధాలు
Related tags :