1999లో పాకిస్థాన్‌తో తలపడిన చెన్నై టెస్టులో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్ సౌరభ్ గంగూలీ వివాదాస్పదమైన ఔట్‌పై నాటి క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ స్పందించాడు. తాజాగా టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో వీడియో ఛాట్ సందర్భంగా పాక్ మాజీ సారథి ఆరోజు ఏం జరిగిందనే విషయాన్ని వివరించాడు. నిజం చెప్పాలంటే అది సందేహాస్పదమైన ఔట్ అని పేర్కొన్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో గంగూలీ (2) పరుగుల వద్ద ఉండగా సక్లెయిన్ ముస్తాక్ బౌలింగ్‌లో కీపర్ మొయిన్ ఖాన్ చేతికి చిక్కాడు. పాక్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్లు కాసేపు చర్చించి దాదాను ఔట్‌గా ప్రకటించారు. ‘ఆ సంఘటనలో ఇద్దరు ఆటగాళ్లు భాగమయ్యారు. ఒకరు అజర్ మహమ్మద్, రెండోది మొయిన్‌ఖాన్. గంగూలీ ఆడిన షాట్‌కు బంతి అజర్ శరీరానికి తాకి కిందపడుతుండగా మొయిన్ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఇక్కడేం జరిగిందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేను. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో నా ఆరోగ్యం బాగోలేకపోతే అజర్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. గంగూలీ ఔటైనప్పుడు నేను మైదానంలో లేను. కానీ, అది మాత్రం సందేహాస్పదమైన ఔటే’అని ఇంజమామ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే, రీప్లేలో ఆ బంతి అజర్ కాలికి తాకాక నేలపై పడిన తర్వాత మొయిన్ క్యాచ్ అందుకున్నట్లు కనిపించడం గమనార్హం. అనంతరం టీమ్‌ఇండియా 258 పరుగులకు ఆలౌటై 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ క్యాచ్‌ను సందేహాస్పదమైనదిగా పేర్కొన్నందుకు ఇంజమామ్‌ను అశ్విన్ అభినందించాడు.
నాకు కూడా అనుమానమే!
Related tags :