సరైన సన్నద్ధత కొరవడింది

ఇంగ్లాండ్‌ పర్యటనకు మళ్లీసారి పూర్తి సన్నద్ధమై వెళ్లాలని టీమిండియా మాజీ సారథి, భారత్‌-ఏ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన కఠిన పరిస్థితులను ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లో చివరి సారి టీమిండియా ద్రవిడ్ ‌సారథ్యంలోనే సిరీస్‌ గెలిచిన సంగతి తెలిసిందే. ‘ముందు మనం నిజాయతీగా ఉందాం. ఇంగ్లాండ్‌లో పరిస్థితులు బ్యాట్స్‌మెన్‌కు ఏ మాత్రం అనుకూలంగా లేవు. రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందులు పడ్డారు. విరాట్‌ కోహ్లీని మినహాయిస్తే బ్యాట్స్‌మెన్‌కు ఈ సిరీస్‌ సులభంగా ఏమీ లేదు. ఇంగ్లాండ్‌లో నేను ఇంతకు ముందు ఆడాను. ఐదు టెస్టుల సిరీస్‌లో పరిస్థితులు కఠినంగా ఉన్నాయి’ అని ద్రవిడ్‌ అన్నారు. ‘నేను ముందుగా చెప్పినట్టు మనమెప్పుడూ భవిష్యత్తును చూడాలి. మళ్లీ సారి మనం ఇంగ్లాండ్‌ పర్యటనకు మెరుగైన సన్నద్ధతతో వెళ్లాలి. అక్కడి కఠిన పరిస్థితుల్లో అత్యుత్తమ ఆటను వెలికితీయాలి. అక్కడ ఇబ్బందిగానే ఉంటుంది. దాన్ని ఎదుర్కోవాలి. రవిశాస్త్రి వ్యాఖ్యలపై ఆసక్తి లేదు. ఆ సిరీస్‌ నుంచి మనం ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. ఇంగ్లాండ్‌ లాంటి దేశాల్లో మూడు నాలుగేళ్లకు ఒకసారి పర్యటిస్తుంటారు. జట్టు ఓటమి పాలవ్వడంతో కోచింగ్‌ బృందం, ఆటగాళ్లు నిరాశపడుతుంటారు. ఈ సారి మనకు ఉత్తమ జట్టు ఉంది. బౌలింగ్‌ బాగుంది కానీ దాంతో తగిన ఫలితాలు రాలేదు. సిరీస్‌ గెలిచేందుకు టీమిండియాకు చాలా అవకాశాలు వచ్చాయి. కఠిన పరిస్థితుల్లో ఆటగాళ్లు కష్టపడ్డారు. అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోలేదు. మ్యాచ్‌లను ముగించడంలో విఫలమయ్యారు. భారత్‌ ఫీల్డింగ్‌, బౌలింగ్‌, క్యాచింగ్‌లో చాలా మెరుగ్గా కనిపించింది. ఆసియా కప్‌లో ఒక పాకిస్థాన్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టడం ఎందుకు? అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ పోటాపోటీగా ఆడుతున్నాయి. అన్ని జట్లపై దృష్టి కేంద్రీకరించాలి. జాగ్రత్తగా ఉండాలి’ అని ద్రవిడ్‌ పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com