నడక వలన పక్షవాతం రాదు

ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో శారీరక శ్రమ బొత్తిగా తగ్గిపోయింది. ఒళ్లు వంచి పనిచేసే కార్మికుల విషయం పక్కనబెడితే కార్యాలయాల్లో కూర్చొని ఉద్యోగం చేసే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు కొంతమంది కసరత్తులు చేస్తుండగా.. చాలా మంది కనీస శారీరక శ్రమ చేయడం లేదు. దీనివల్ల వయసు పెరిగాక పలువురు అనారోగ్యం పాలవుతుంటారు. చిన్న వయసులోనే గుండెజబ్బులు, చక్కెర వ్యాధులు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ చుట్టుముట్టిన ఘటనలు ఎన్నో ఉంటున్నాయి. అయితే రోజుకు కనీసం 35 నిమిషాలు నడవడం ద్వారా భవిష్యత్తులో బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముప్పు తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది. వారానికి కనీసం నాలుగు గంటల చొప్పున నడక వ్యాయామం చేసేవారికి మిగతా వారితో పోలిస్తే స్ట్రోక్‌ తీవ్రత బాగా తక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వారానికి కనీసం రెండు గంటలపాటైనా ఈత, రన్నింగ్‌ వంటి ఓ మోస్తరు కసరత్తులు చేసే వారు స్ట్రోక్‌ తీవ్రతను బాగా ఎదుర్కోవచ్చునని పరిశోధన స్పష్టం చేసింది. ‘‘కసరత్తుల వల్ల ఆరోగ్య పరంగా అనేక విధాలుగా లాభం పొందవచ్చు. రోజూ కనీస శారీరక వ్యాయామం చేసినా భవిష్యత్తులో వచ్చే స్ట్రోక్‌ ముప్పును చాలా వరకూ తగ్గించుకోవచ్చని మా పరిశోధన తేల్చింది.’’ అని పరిశోధకురాలు కేథరినా ఎస్‌.సన్నర్‌హాగెన్‌ అన్నారు. స్వీడెన్‌కు చెందిన గొతన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ పరిశోధక బృందం ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా గుర్తించారు. సరాసరి వయసు 73 ఏళ్లు ఉండి స్ట్రోక్‌కు గురైన మొత్తం 925 మందిపై ఈ పరిశోధన జరిపారు. వీరిలో 481 మంది ఎలాంటి వ్యాయామాలూ చేయని వారు ఉండగా.. వారిలో 73 శాతం మంది స్ట్రోక్‌కు గురయ్యారు. మరో 384 మంది నడక వ్యాయామం చేసేవారిలో 85 శాతం మందికి తేలికపాటి స్ట్రోక్‌ వచ్చింది. వీరిలో 59 మంది ఓ మోస్తరు వ్యాయామం చేసే వారు ఉండగా.. ఇందులో 89 శాతం మంది తేలికపాటి స్ట్రోక్‌ ఎదుర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com