సరికొత్త కూచిపూడికి నాంది

కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లు… కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కూచిపూడి గ్రామం. శతాబ్దాల కిందటే ప్రపంచానికి నృత్యరీతుల్ని నేర్పిన ఈ గ్రామంలో నేటికీ కనీస వసతులు లేకపోవడాన్ని గమనించింది సిలికానాంధ్ర సంస్థ. అందుకే ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని తెలుగు వెలుగు కనిపించేలా అక్కడ వివిధ అభివృద్ధి పనులు చేపడుతోంది.కూచిపూడి… ఆ పేరులో తెలుగుదనం వినిపిస్తుంది. ఆ నాట్యంలో తెలుగుదనం కనిపిస్తుంది. ఈ నృత్యం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందితే, అది పుట్టినగడ్డ అయిన కూచిపూడి గ్రామంలో మాత్రం వెనకబాటు కనిపిస్తోంది. కూచిపూడి అలాంటి పరిస్థితిలో ఉండటాన్ని చూసిన సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్‌ అక్కడి పరిస్థితిని అమెరికాలోని సంస్థ కార్యవర్గంతో చర్చించారు. కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని దాని రూపురేఖలు మార్చుదామన్న ఆయన ఆలోచనకు వారంతా మద్దతు పలికారు. అమెరికాలో తెలుగు భాష, కళల అభివృద్ధికి కృషి చేసే సిలికానాంధ్ర సంస్థ 2015లో కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని ముందుగా పారిశుద్ధ్యంపైన దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గ్రామస్థుల్లో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంపైన అవగాహన కల్పించి ఆచరించేలా చేశారు. చెత్తను వీధుల్లో పడేయకుండా ఎక్కడికక్కడ చెత్త డబ్బాలని పెట్టారు. రోజూ ఆటోమీద చెత్తను తరలించేలా ఏర్పాటుచేశారు. ఇందిరానగర్‌ కాలనీలో చాలా ఇళ్లల్లో మరుగుదొడ్లు లేకపోవడాన్ని గుర్తించి పరిస్థితిని మార్చడానికి పెద్ద యజ్ఞమే చేసింది సిలికానాంధ్ర. కాలనీలోని ప్రతి ఇంటికీ వెళ్లి మరుగుదొడ్లను నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపిన వారికి ప్రభుత్వం ఇచ్చే డబ్బుకు అదనంగా రూ.10వేలు ఇచ్చి మరుగుదొడ్లు నిర్మింపజేశారు. పోరంబోకు స్థలాల్లో ఉండేవారికి పూర్తి ఖర్చు సంస్థే భరించి నిర్మాణాలు పూర్తిచేసింది. ఇలా గ్రామంలో 170 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించి వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్న గ్రామంగా మార్చినందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకుంది సిలికానాంధ్ర సంస్థ. ఒకప్పుడు వర్షం కురిస్తే మోకాళ్లలోతున బురదలో ఇందిరానగర్‌ కాలనీలోని ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చేది. ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా రూ. 4కోట్ల విరాళాల్ని సేకరించి 8కి.మీ. మేర కాలనీతోపాటు కూచిపూడి అగ్రహారంలోని ప్రధాన వీధుల్ని సిమెంట్‌ రోడ్లుగా మార్చారు. కాలనీలో అన్ని ఇళ్లకూ నీటి కుళాయిలు ఏర్పాటుచేశారు. త్వరలో ఊళ్లోని ప్రతి ఇంటికీ కుళాయిలు ఏర్పాటుచేయాలనేది సంస్థ సంకల్పం. గ్రామంలో పాత వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ బల్బుల్ని ఏర్పాటుచేశారు. ఎన్నో ఏళ్లుగా పూడిపోయిన గ్రామంలోని చారిత్రక బావిని బాగు చేయించారు. ఒకప్పుడు కూచిపూడి బస్టాండ్‌ వసతుల లేమితో, ఆవరణలో ముళ్ల పొదలు పెరిగి మురుగు గుంతలతో, చెత్త కుప్పలతో ఉండేది. స్వచ్ఛ కూచిపూడిలో భాగంగా యువత, ప్రజల సహకారంతో బస్టాండ్‌లోని చెత్తను పూర్తిగా తరలించి, మురుగు తొలగించి గుంతల్ని పూడ్పించారు. అనంతరం పూలమొక్కలు నాటి బస్టాండ్‌ ఆవరణని అందంగా మార్చారు. బస్టాండ్‌ గోడలకు రంగులువేయించి కూచిపూడి నృత్య భంగిమల్ని పెయింట్‌ చేయించారు. రూ.27 లక్షలు ఖర్చుచేసి కూచిపూడి ప్రాథమిక పాఠశాలతోపాటు, కూచిపూడి ఓరియంటల్‌ సంస్కృతోన్నత పాఠశాలలో తరగతి గదుల్ని బాగుచేయించి ఆహ్లాదపరిచే కొత్త రంగులు వేశారు. డెస్క్‌లతో కూడిన బల్లల్ని వేయించారు. రూ.10లక్షలు పెట్టి కూచిపూడి పంచాయతీ కార్యాలయాన్నీ! కూచిపూడితోపాటు ఆ చుట్టుపక్కల గ్రామాలలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడటాన్ని గుర్తించింది సిలికానాంధ్ర. ఈ సమస్యకు పరిష్కారంగా స్థానికంగా సువిశాలమైన ప్రదేశంలో 200 పడకలతో రూ.50 కోట్లు వెచ్చించి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. దీనిద్వారా మచిలీపట్నం, పామర్రు, అవనిగడ్డ, గుడివాడ, పెనమలూరు తదితర నియోజకవర్గాల్లోని 100కిపైగా గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందనున్నాయి. ఈ ఆసుపత్రిలో సేవలందించేందుకు అమెరికాలో స్థిరపడిన 70 మంది ప్రవాస వైద్యులు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. టెలీ మెడిసిన్‌తోపాటు అప్పుడప్పుడూ ఆసుపత్రికే వచ్చి వీరు సేవలు అందిస్తారు. ఈ దసరా నుంచీ హాస్పిటల్‌లో సేవలు మొదలవుతాయి. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన నిధుల్ని సేకరించడానికి ప్రత్యేకంగా విద్యార్థులూ, యువతతో క్లబ్‌ ఏర్పాటుచేశారు. సిలికానాంధ్ర నిధులకు అదనంగా వీరంతా తమ కళల్ని ప్రదర్శించి విరాళాలు రాబట్టి వాటిని ఆసుపత్రి నిర్మాణానికి అందిస్తారు. ‘ప్రజా సహకారంతో కూచిపూడిని ఆకర్షణీయ సాంస్కృతిక వారసత్వ గ్రామంగా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యం’ అంటారు కూచిభొట్ల ఆనంద్‌.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com