DailyDose

రేపు రాములమ్మ జంప్. కేసీఆర్ సంచలన హామీ-GHMC-TNI బులెటిన్

GHMC 2020 Election Bulletin - Vijayashanthi To BJP.KCR Waives Power And Water Bills.

* టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలోనే విజయశాంతి బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆమె గ్రేటర్‌లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా విజయశాంతి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మంగళవారం (రేపు) రాములమ్మ బీజేపీలో చేరుతున్నట్లు తెలియవచ్చింది. కొద్ది రోజుల క్రితం విజయశాంతి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ విజయశాంతిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె మెత్తబడలేదు. ఈ పరిస్థితుల్లో రాములమ్మ పార్టీ మారితే కాంగ్రెస్‌కు నష్టం తప్పదని భావిస్తున్నారు.

* కేసిఆర్ సంచలన హామీ. డిసెంబర్ నుంచి నీటి బిల్లు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్ లకు ఉచిత విద్యుత్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమ లు, షాపులు, ఆరు నెలల(March-October) మినిమం విద్యుత్ బిల్లులు రద్దు.

* కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని మోసం చేసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం గోల్నాక డివిజన్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆయన మాట్లాడుతూ బీజేపీని విమర్శించే స్థాయి కల్వకుంట్ల కుటుంబానికి లేదన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హైదరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ మార్పు బీజేపీతోనే అని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని అన్నారు. రూ.67 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అరాచకాలను, విధ్వంసాలను బీజేపీ సమర్థించదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

* బంజారాహిల్స్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడారు. బల్దియాపై ఎగిరేది గులాబీ జెండానే అని అన్నారు. బీజేపీ కుట్రల‌ను ప్రజ‌లు తిప్పికొట్టాలని ఆయన సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు వ‌ర‌ద సాయం ఆపి పేదవాళ్ల కడుపు కొట్టారని మండిపడ్డారు. గ్రేట‌ర్‌లో కాంగ్రెస్‌కి అభ్యర్థులు దొర‌క‌ని ప‌రిస్థితి నెలకొందన్నారు.

* కేంద్రం ఏమిచ్చిందని అంటున్న మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌కు ఏం చేశారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను హిందూ– ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దని కోరారు. చింతమడకకు కేసీఆర్‌ ఇచ్చింది రూ. 1.5 లక్షలేనని, కేంద్రం రూ. 8 లక్షలు ఇచ్చిందని, అలాగే భాగ్యనగరంలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. దేవాలయాల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్, కేటీఆర్‌లకు లేదన్నారు. నగరంలో మాకు నచ్చిన ఆలయానికి వెళ్తామని, గుడికి వెళ్లాలంటే కేసీఆర్‌ అనుమతి తీసుకోవాలా లేక ఒవైసీల అనుమతి కావాలా అని ప్రశ్నించారు. హిందూగాళ్లు.. బొందుగాళ్లు అన్నందుకు కరీంనగర్‌ ప్రజ లు టీఆర్‌ఎస్‌కు సరైన సమాధానం చెప్పారని వ్యాఖ్యానించారు.

* వందలాది మంది బలిదానాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌కు అది తెస్తున్నాం.. ఇది తెస్తున్నామంటున్నాయని, నిజాం హయాంలోనే హైదరాబాద్‌కు ఎన్నో పెట్టుబడులు వచ్చాయని రేవంత్ అన్నారు. నిజాం కట్టడాలు, పెట్టుబడుల ద్వారా హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదని, చెరువులు, పార్కులను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే హైదరాబాద్‌ను వరదలు ముంచాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.

* నగర ప్రజలకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదని, 2014కు ముందే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్‌ను కొన్ని వేలకోట్లు పెట్టి ఖర్చుపెట్టామని టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, పీవీ ఫ్లైఓవర్ బ్రిడ్జి, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, గోదావరి, కృష్ణా జలాలు.. ఇవన్నీ గత ప్రభుత్వాలు టీడీపీ, కాంగ్రెస్ హయాంలో వచ్చినవేనన్నారు. ఎక్కడైనా ప్రారంభోత్సవాలు పెండింగ్ ఉంటే.. వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేసి గొప్పలు చెబుతోందని విమర్శించారు. నిజాయితీగా ఒక్క నిజం అయినా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెబుతారేమోనని..చూశారని, అలాంటి పరిస్థితి కనిపించలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

* దుబ్బాక గెలుపు అంటే…సీఎం కేసీఆర్‌పై గెలిచినట్లే అని బీజేపీ నేత బాబూమోహన్ అన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని బాబూమోహన్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని తెలిపారు. రాబోవు ఎన్నికలలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని బాబూమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

* అభివృద్ధిలో హైదరాబాద్ వెనుకబాటుకు టీఆర్ఎస్సే కారణమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో ప్రచారం చేస్తున్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఆరేళ్లలో హైదరాబాద్‌కు టీఆర్ఎస్‌ చేసిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ఇప్పటికీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. వరద బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించకపోవడం చాలా బాధాకరమని బండి సంజయ్ అన్నారు.

* జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా రేపు ‘బస్తీ నిద్ర’ కార్యక్రమం చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. సోమవారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ఇన్‌ఛార్జీలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘బస్తీ నిద్ర’పై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ‘బస్తీ నిద్ర’ ప్రాధాన్యతను వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ‘బస్తీ నిద్ర’ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకులను, కార్యకర్తలను, డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పిలుపునిచ్చారు. ‘బస్తీ నిద్ర’ కార్యక్రమంలో తనతో పాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వీలైనంత మేరకు ‘బస్తీ నిద్ర’ చేస్తామని తెలిపారు.

* జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ అన్ని కులాలకూ సమాన ప్రాధాన్యతనిచ్చాయి. రిజర్వేషన్ల ప్రకారం అధికార పార్టీ ఏ సామాజిక వర్గానికి టికెట్‌ కేటాయించిందో.. ప్రతి పక్షాలు కూడా అదే కులానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాయి. కొన్ని డివిజన్లలో సంబంధిత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి దొరకకపోవడంతో.. ఇతర కులానికి చెందిన వారిని తీసుకొచ్చారు. దీంతో నగరంలోని 150 డివిజన్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నడుమ ఆసక్తి పోరు నెలకొంది.కులాల వారీగా టీఆర్‌ఎస్‌ టికెట్లు…150 డివిజన్లలో అధికార టీఆర్‌ఎస్‌ అన్ని కులాలను ప్రోత్సహిస్తూ టికెట్లు ఇచ్చింది. రెడ్డి సామాజిక వర్గానికి-30, కమ్మలకు-5, యాదవులకు-14, గౌడలకు-16, ముదిరాజ్‌లకు-5, మున్నూరుకాపులకు-14, మైనారిటీలకు-17, కాపులకు-1, ఎస్సీలకు-8, ఎస్టీలకు-1 చొప్పున సీట్లను కేటాయించారు. మిగతా సీట్లను రిజర్వేషన్‌ ప్రకారం ఇతర బీసీ కులాలకు కట్టాబెట్టారు.బీజేపీలో ఇలా…బీజేపీలో.. రెడ్డి కులస్తులకు-26, కమ్మలకు-2, యాదవులకు-16, గౌడలకు-10, ముదిరాజ్‌లకు-5, మున్నూరుకాపులకు-10, మైనారీటీలకు-1, కాపులకు-4, ఎస్సీలకు-10, ఎస్టీలకు-1 టికెట్‌ ఇచ్చారు. మిగతా సీట్లను రిజర్వేషన్‌ ప్రకారం ఇతర బీసీలకు కేటాయించారు.కాంగ్రెస్ పార్టీలో…కాంగ్రెస్‌ పార్టీ సైతం అన్నివర్గాలకూ ప్రాధాన్యమిచ్చింది. రెడ్లలకు-16, కమ్మలకు-1, యాదవులకు-8, గౌడలకు-12, ముదిరాజ్‌లకు-5, మున్నూరుకాపులకు-2, మైనారీటీలకు-34, కాపులకు-1, ఎస్సీలకు-8, ఎస్టీలకు-1 టికెట్‌ ఇచ్చారు. మిగిలిన సీట్లను రిజర్వేషన్‌ ప్రకారం ఇతర కులాలకు కేటాయించారు.