సోమశిలలో 12శివరూపాలు

బోళాశంకరుడి అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాలను చెబుతారు. వీటిలో ఏ ఒక్క క్షేత్రాన్ని దర్శించినా చాలనుకుంటారు. అలాంటిది దేవదేవుడు ఒకేచోట పన్నెండు రూపాల్లో పూజలందుకుంటున్న ప్రాంతం సోమశిల. ప్రకృతి అందాలకు నెలవైన ఇక్కడ పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలూ కొలువై ఉండటం విశేషం.మనసుదోచే నల్లమల అందాలూ పరవళ్లు తొక్కే కృష్ణమ్మ గలగలలూ మధురానుభూతిని మిగిల్చే పడవ ప్రయాణాలూ… ఇలా ప్రకృతి సోయగాలకు చిరునామాగా నిలుస్తున్న సోమశిల ఆధ్యాత్మికంగానూ అంతే ప్రసిద్ధి చెందింది. కృష్ణుడి ఆనతిమేరకు ద్వాపరయుగంలో పాండవులు ప్రతిష్ఠించిన ఆలయాలుగా సోమశిలలో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలకు పేరు. ఒకవైపు ఆధ్యాత్మికతనూ మరోవైపు ప్రకృతి అందాలనూ తనలో ఇముడ్చుకున్న సోమశిల నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్వాటర్ ఇక్కడికివచ్చి చేరడంతో కృష్ణమ్మ కొత్త అందాలను సంతరించుకుని పర్యటకులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. పుష్కర ఘాట్లో స్నానాలు చేసి పన్నెండు జ్యోతిర్లింగాలనూ దర్శించుకున్న తర్వాత నదిలో పడవ ప్రయాణం ద్వారా చుట్టుపక్కల ఉన్న పర్యటక ప్రాంతాలనూ వీక్షించవచ్చు. కృష్ణానదికి అవతలి ఒడ్డున ఉన్న సంగమేశ్వరస్వామి దివ్యమంగళ స్వరూపాన్నీ దర్శించుకోవచ్చు.
*స్థలపురాణం
ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారిని కలిసిన కృష్ణుడు సోమశిల ప్రాంతంలోని రెండు కొండల మధ్య ప్రవహిస్తున్న సప్తనదుల సంగమంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెబుతాడు. అందుకు అంగీకరించిన ధర్మరాజు శివలింగాన్ని తీసుకొచ్చే బాధ్యతను భీముడికి అప్పగిస్తాడు. భీముడు కాశీకి వెళ్లి లింగాన్ని తీసుకొచ్చే క్రమంలో కాస్త జాప్యం అవుతుంది. సమయం మించిపోతుందని భావించిన ధర్మరాజు మరోలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాడు. తాను తెచ్చిన లింగాన్ని పెట్టలేదని ఆగ్రహించిన భీముడు కాశీనుంచి తీసుకొచ్చిన లింగాన్ని దూరంగా విసిరేస్తాడు. దీంతో ఆ లింగం పన్నెండు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోతుంది. తర్వాతికాలంలో ఆ శకలాలే పన్నెండు లింగాలుగా ఆవిర్భవించాయని భక్తుల నమ్మకం.
*ఒకే చోట…
పదకొండో శతాబ్దంలో చాళుక్యులు సోమశిల ఆలయాన్ని పునరుద్ధరించినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునే విధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలనూ ఇక్కడ తీర్చిదిద్దారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే సోమేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, కాశీవిశ్వనాథుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, భీమశంకరుడు, రామలింగేశ్వరుడు… ఇలా పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ పూజలు చేస్తే అవివాహితులకు వివాహమవుతుందనీ సంతానం లేనివారికి సంతానం కలుగుతుందనీ భక్తుల విశ్వాసం. ఒకసారి వచ్చి మనసులోని కోర్కెలు స్వామికి తెలియజేస్తే అవి తప్పక నెరవేరతాయని చెబుతారు.ఎలా **వెళ్లాలంటే…
ప్రకృతి ప్రేమికులకు సోమశిల ప్రయాణం ఒక మరపురాని మధురానుభూతి. శ్రీశైలం బ్యాక్ వాటర్ పూర్తిస్థాయిలో రావడంతో ప్రస్తుతం పుష్కరఘాట్లు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక్కడి కృష్ణానది ఈత కొట్టడానికి అనువైనది కావడం, చుట్టూ పర్యటక ప్రదేశాలు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఎక్కువ సంఖ్యలో పర్యటకులూ, భక్తులూ వస్తుంటారు. హైదరాబాద్కి 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి రోడ్డు, జల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లా కేంద్రాల నుంచి కొల్లాపూర్ వరకు ప్రతి అరగంటకూ ఒక ఆర్టీసీ బస్సు సిద్ధంగా ఉంటుంది. జలమార్గం ద్వారా అయితే… కర్నూలులోని శ్రీశైలం, నందికొట్కూరు నుంచి పడవల్లో రావచ్చు.
1. ముగిసిన కాణిపాక బ్రహ్మోత్సవాలు -నేటి నుంచి ప్రత్యేకోత్సవాలు
చిత్తూరు జిల్లాలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం జరిగిన ధ్వజావరోహణ కార్యక్రమంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆదివారం నుంచి అక్టోబరు 3 వరకు 11 రోజులపాటు స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆలయంలోని బంగారు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభంపై ఉన్న మూషిక పటాన్ని సంప్రదాయబద్ధంగా కిందకు దించారు. అనంతరం ధ్వజస్తంభాన్ని పవిత్ర జలంతో అభిషేకించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కట్టిన రక్షాబంధనాలను తొలగించి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శుభం పలికారు. ఈ క్రమంలో రాత్రి స్వామివారికి వడాయత్తు ఉత్సవం, ఏకాంత సేవలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెనుమాక పూర్ణచంద్రరావు, పాలకమండలి ఛైర్మన్ వడ్లమూడి సురేంద్రబాబు, ఆలయ అధికారులు, సిబ్బంది, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.
2. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్కుమార్ కైట్ దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com