* బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వాలన్న ఆర్‌బీఐ అంతర్గత కమిటీ ప్రతిపాదన మంచి ఆలోచన కాదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు పరిమితులు విధించడం, పటిష్ఠ నిబంధనలు అమలు చేయడం కీలకమని పేర్కొన్నారు. వీరిద్దరూ రాసిన ఓ వ్యాసాన్ని రాజన్ లింక్డిన్‌లో పోస్ట్ చేశారు.
* నిరుద్యోగులు, ఆశావహులకు శుభవార్త! ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మళ్లీ కొవిడ్-19కు ముందునాటి స్థితికి చేరుకుంటోందని నియామక సంస్థలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేయడంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని క్వెస్ కార్పొరేషన్ పేర్కొంది. ఫలితంగా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ తిరిగి జోరందుకుందని వెల్లడించింది.
* లక్ష్మీ విలాస్ బ్యాంక్(ఎల్‌వీబీ)ను డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీనం చేసేందుకు ఆర్‌బీఐ పథకం ప్రకటించడం ఆ బ్యాంక్ షేర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వరుసగా ఐదో రోజు ఎల్‌వీబీ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. విలీన ప్రతిపాదన, మారటోరియం కారణంగా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో బ్యాంక్ షేరు ధర 5 రోజుల్లో 48.24శాతం కుంగడం గమనార్హం. సోమవారం ట్రేడింగ్ ఆరంభమైన కాసేపటికే బీఎస్‌ఈలో బ్యాంకు షేరు ధర 10శాతం నష్టపోయి రూ. 8.10 వద్ద కనిష్ఠ సర్క్యూట్ పరిమితికి పడిపోయింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ షేరు విలువ 10శాతం పతనమైంది.
* ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకుల్లో ట్విటర్ ఫాలోయర్ల పరంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రపంచ రికార్డు సాధించింది. 10 లక్షల మందికి పైగా ఆర్‌బీఐ ట్విటర్ ఖాతాను అనుసరిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్, యురోపియన్ సెంట్రల్ బ్యాంక్‌లను (ఈసీబీ) తోసిరాజని ఈ రికార్డును ఆర్‌బీఐ సొంతం చేసుకోవడం విశేషం. ఆదివారం నాటికి ఆర్‌బీఐ ట్విటర్ ఖాతాను ప్రపంచ వ్యాప్తంగా 10,00,513 మంది అనుసరిస్తున్నట్లు లెక్క తేలింది. 85 ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్‌బీఐ 2012 జనవరిలో ట్విటర్ ఖాతా ప్రారంభించింది. గత సెప్టెంబరు 27 నాటికి 9.66 లక్షల మంది ఆర్‌బీఐ ట్విటర్ ఖాతాను అనుసరిస్తుండగా, ఈనెల 22కు ఆ సంఖ్య 10 లక్షలు దాటినట్లు చూపిస్తోంది. ‘ఆర్‌బీఐ ట్విటర్ ఖాతా 1 మిలియన్ ఫాలోయర్స్ మార్కును దాటింది. ఇది సరికొత్త మైలురాయి. ఆర్‌బీఐలోని మిగతా సహచరులందరికీ అభినందనలు’ అని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ట్వీట్ చేశారు.
* భారత తయారీ రంగంలో నియామకాలపై అస్పష్టత ఉన్నప్పటికీ జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఈ రంగం రికవరీ దిశగా అడుగులు వేసిందని పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ తాజా త్రైమాసిక సర్వే వెల్లడించింది. జూన్ త్రైమాసికంతో పోలిస్తే, అధిక ఉత్పత్తిని నివేదించిన వారి నిష్పత్తి 10 శాతం నుంచి 24 శాతానికి పెరిగిందని సర్వే తేల్చింది. తక్కువ లేదా అదే మొత్తంలో ఉత్పత్తిని నివేదించిన వారి నిష్పత్తి 90 నుంచి 74 శాతానికి తగ్గిందని పేర్కొంది. నియామకాల విషయానికొస్తే వచ్చే 3 నెలల పాటు అదనపు ఉద్యోగుల్ని తాము నియమించుకోవట్లేదని 80 శాతం తయారీ సంస్థలు పేర్కొనడం గమనార్హం. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే (85 శాతం) రెండో త్రైమాసికంలో కొత్త నియామకాలకు సిద్ధంగా లేమని చెప్పిన తయారీ సంస్థలు స్వల్పంగా తగ్గడం రికవరీని సూచిస్తోందని ఫిక్కీ వివరించింది.
* కొవిడ్ లాక్‌డౌన్ వల్ల పూర్తిగా క్షీణించిన ‘డెలివరీ సిబ్బంది’ నియామకాలు, అన్‌లాక్ అనంతరం ఒక్కసారిగా పెరిగాయని నియామక సంస్థ వాహన్ తెలిపింది. గిరాకీ అయితే కొవిడ్ ముందటి స్థాయికి వచ్చేసిందని పేర్కొంది. ముఖ్యంగా ఆహారం, నిత్యావసరాల సరఫరా రంగాల్లో వీరికి అధిక డిమాండ్ ఉందని వివరించింది. ప్రతినెలా 2.5-3.0 లక్షల మందికి ఈ రంగాలు కొత్తగా ఉపాధి చూపుతున్నాయని వెల్లడించింది. పండుగల సీజన్ బాగా కలిసొచ్చిందని తెలిపింది. తయారీ, విడిభాతాల తయారీ, బీపీఓ రంగాల్లోనూ నియామకాలు పుంజుకున్నట్లు విశ్లేషించింది.