బెదరూ…ఇండియాలో తెల్లకార్డు ఉంటే అమెరికాలో పచ్చకార్డు ఇవ్వరు!

అమెరికాలో నివసిస్తున్న భారతీయులు మరింత కష్టాలను ఎదుర్కోనున్నారు. గ్రీన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకు నిరాశే ఎదురైంది. గ్రీన్‌ కార్డు జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలు విధించింది. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు స్వదేశం అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందకూడదదనే కొత్తనిబంధనను విధించింది. ఈ నిబంధనల ప్రకారం..గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు భారతీయులైతే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న పథకాల ద్వారా లబ్ధి పొంది ఉండకూడదు. ఆహార, నగదు సంబంధిత పథకాల్లో వీరి పేర్లు నమోదై ఉండకూడదు. విద్యా,వైద్య, ఆహార, సంక్షేమ పథకాల ప్రయోజనాలు వీరికి వర్తించకూడదు. అంతేకాకుండా గ్రీన్‌కార్డు వస్తే అమెరికాలో నిలదొక్కుకోగలం అని రుజువు చేస్తూ ఆర్థిక వివరాలను వెల్లడించాలి. ఈ నిబంధనలకు సంబంధించి ఇప్పటికే హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ సంతకం చేసినట్లు హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ప్రభుత్వ ప్రయోజనాల నుంచి ఎలాంటి లబ్ధి పొందడం లేదని దరఖాస్తుదారు ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించిన తరువాతే గ్రీన్‌కార్డు దరఖాస్తు ప్రక్రియను మొదలు పెట్టాలి. ఈ నిబంధలన్నింటీని త్వరలోనే అమలు చేయనున్నారు. ఒకవేళ దరఖాస్తుదారు సమర్పించిన పత్రాలు నకిలీవని తేలితే వారిపై నిషేధం విధిస్తారు. ఇప్పటికే హెచ్‌ 1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వాముల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి పని అనుమతిని రద్దుచేసే విషయంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుంటామని ట్రంప్‌ సర్కార్‌ నేడు ఫెడరల్‌ కోర్టుకు తెలిపింది. హెచ్‌4 వీసాదారుల (హెచ్‌ 1బీ భాగస్వాములకు ఇచ్చే వీసా) పని అనుమతిని రద్దు చేస్తామని గత కొంతకాలంగా ట్రంప్‌ ప్రభుత్వం బహిరంగంగానే చెబుతోంది. తాజాగా మరో మూడు నెలల్లోగా దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్లు కోర్టుకు చెప్పింది. దీంతో హెచ్‌4 వీసాదారులు ఆందోళనకు గురవుతున్నారు.హెచ్‌4 వీసాదారుల పని అనుమతిని రద్దు చేస్తే ఎక్కువగా నష్టపోయేది భారతీయులే. 2017 డిసెంబరు 25 నాటికి 1,26,853 మంది హెచ్‌4 వీసాదారులకు యూఎస్‌సీఐఎస్‌ పని అనుమతిలను మంజూరు చేసింది. వీరిలో 93శాతం మంది భారత్‌కు చెందినవారే. ఇక ఐదు శాతం మంది చైనా దేశస్థులు ఉన్నారు. ఒకవేళ వీరికి పని అనుమతిని రద్దు చేస్తే హెచ్‌-1బీ వీసాదారులు ఒక్కరి వేతనంతోనే కుటంబాన్ని నడపాల్సి ఉంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com