Agriculture

పేటేరు కొడవళ్లు…చాలా ఫేమస్!

Guntur District Peteru Village Is Famous For Agricultural Scythe

వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైందంటే చాలు.. గుంటూరు జిల్లా తీర ప్రాంతమైన రేపల్లె మండలం పేటేరు వైపు అన్నదాతల చూపంతా. వరి కోతలకు అవసరమైన కొడవళ్ల తయారీలో ఆ ఊరికి మంచి పేరు ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడి కొడవళ్ల తయారీ ప్రాంతం.. శ్రామికనగర్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో నిపుణులైన కార్మికులు రూపొందించే కొడవళ్లకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా మంచి డిమాండ్‌ ఉంటోంది. ఇక్కడ ఉన్న 40కు పైగా కార్ఖానాల్లో కొడవళ్ల తయారీపై ఆధారపడి దాదాపు 150 కుటుంబాల వరకు జీవనం సాగిస్తున్నాయి. ఏడాది పొడవునా పనిచేస్తూ.. ఖరీఫ్, రబీ సీజన్లలో కోతలకు అవసరమైన కొడవళ్లను అందిస్తున్నాయి.
*చెన్నై, విశాఖ నుంచి దిగుమతి
కొడవలి తయారీకి ప్రధాన ముడిసరుకు.. ఐరన్‌ బేళ్ల కట్లకు ఉపయోగించి పనికిరాని ఇనుముగా పడవేసే బేల్‌ బద్దలు. చెన్నై, విశాఖపట్నం, కాకినాడ పోర్టులు, విజయవాడ వంటి నగరాల నుంచి వీటిని కిలోల వంతున కొనుగోలు చేస్తారు. ముడి ఇనుము పేటేరుకు చేరే సరికి కిలో రూ.30 ధర పడుతోంది. కొలిమికి అవసరమైన బొగ్గులు, కొడవలి పిడికి అవసరమైన కలప ధరలు, రవాణా చార్జీలు అదనం.
*వరికోత యంత్రాలతో తగ్గుతున్న గిరాకీ
వ్యవసాయంలో ఆధునిక యంత్ర పరికరాల వాడకం కొడవళ్ల విక్రయాలపై ప్రభావం చూపుతోంది. వరికోత యంత్రాల రాకతో కూలీల అవసరం క్రమంగా తగ్గుతోంది. అందుకు తగినట్టుగానే కొడవళ్లకు డిమాండ్‌ పడిపోతోంది.
*నెలకు లక్షకుపైగా కొడవళ్లు
ఆరు దశాబ్దాలుగా పేటేరు శ్రామికనగర్‌ కొడవళ్లను తయారుచేస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలోని జంపనికి చెందిన జేమ్స్‌ అలియాస్‌ జంపని జేమ్స్‌ ఇందుకు ఆద్యుడు. కొడవళ్ల తయారీని వృత్తిగా చేసుకొని ఆయన పేటేరులో స్థిరపడ్డారు. ఆయన నుంచి చందోలు సుబ్బారావు, తదితరులు నేర్చుకున్నారు. కొడవలి తయారీలో ముందుగా ఇనుప బద్దను కొలిమిలో కాల్చి కొడవలి ఆకారంలో మలుస్తారు. కోతకు తగినట్టుగా సానపట్టి నొక్కులు కొడతారు. చేతితో పట్టుకునేందుకు వీలుగా చెక్కపిడిని అమర్చుతారు. ఇలా మూడు దశల్లో కొడవలి సిద్ధమవుతుంది. ఒక్కో కొలిమిలో రోజుకు 200 వరకు కొడవళ్లు తయారవుతాయి. నెలకు కనీసం లక్షకు పైగా కొడవళ్లను ఇక్కడ సిద్ధం చేస్తుంటారు. మూడు కేటగిరీల్లో చేసే కొడవళ్లను నాణ్యత ప్రకారం.. ఒక్కోటి రూ.30, 60, 90కు విక్రయిస్తుంటారు