తెలంగాణలో ఎన్నికల రణరంగం-TNI ప్రత్యేక కథనాలు

1. రాజగోపాల్‌రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం
పార్టీ నాయకులపై, క్రమశిక్షణ కమిటీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఆయన వ్యవహారాన్ని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీకి రాజగోపాల్‌రెడ్డి సోమవారం తన వివరణను షీల్డ్‌ కవర్‌లో అందజేశారు. గత శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో లో క్రమశిక్షణ కమిటీపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. తనకు నోటీసులు ఇచ్చే అర్హత క్రమశిక్షణ కమిటీ ఉందా? అంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ కమిటీల్లో బ్రోకర్లు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈవిధంగా కమిటీలను, కమిటీలు ఏర్పాటు చేసిన అధిష్టానాన్ని తన వ్యాఖ్యలతో రాజగోపాల్‌రెడ్డి అవమాన పరిచారని టీపీసీసీ భావిస్తోంది.
2. రాక్షస పాలన త్వరలో అంతం- ఉత్తమ్‌
మరో రెండు నెలల్లో దుష్ట రాక్షస టీఆర్‌ఎస్‌ పాలన అంతమై రాష్ట్రానికి పట్టిన శని విరగడ కానుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. పరిగిలోని తాజా మాజీ ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి నివాసంలో ఆదివారం నిర్వహించిన చండీయాగానికి ఆయన సతీసమేతంగా హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అ«ధికార పార్టీ నేతలు, వారి అండతో కొందరు అధికారు లు ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే వాళ్ల పని పడతామని హెచ్చరించారు.
3. కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముహుర్తం ఖారారైంది. ఈనెల 27న కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని దాదాపు ఖారారు అయిందని విశ్వసనీయ సమాచారం. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఇవ్వకపోవటంతో నిరాశ చెందిన ఆయన తన అనుచరగణంతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి పార్టీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదట్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమన్న ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 27న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
4. టీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలు విసుగెత్తారు
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనను చూసి తెలంగాణ ప్రజలు విసిగి పోయారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయ మని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన లంబాడీ గర్జన లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్‌ వల్లే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిందన్నారు.
5. ‘టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా పోలీసులు’
ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న టీఆర్‌ఎస్‌ పోలీసులను వాడుకొని ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, శాసన మండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు లేఖ రాశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ ఐతే కేసులు తీసేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని, తన అనుమతి లేకుండానే టెలిఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై గవర్నర్‌ చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని కోరారు.
6. టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోయింది
అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోయిందని షబ్బీర్‌ అలీ అన్నారు. దీంతో కేసీఆర్‌కి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం వరకు టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ మరింత పడిపోతుందన్నారు. శాసనమండలి ఎప్పుడు నిర్వహిస్తారో అధికారులకు క్లారిటీ లేదని విమర్శించారు. జగ్గారెడ్డికి బెయిల్‌ రావడాన్ని స్వాగతిస్తున్నామని షబ్బీర్‌ పేర్కొన్నారు. వచ్చేది కచ్చితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని షబ్బీర్‌ అలీ ధీమా వ్యక్తం చేశారు.
7. ‘నవంబర్ 24న తెలంగాణ ఎన్నికలు?’
తెలంగాణ ఎన్నికలు నవంబర్ 24న జరగొచ్చని ఓ ఆంగ్ల దినపత్రికలో వార్త వచ్చిందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా నవంబర్‌లోనే ఎన్నికలొస్తాయని సూచనలు ఇస్తున్నట్లుగా సమాచారం ఉందని తెలిపారు. ఇది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లీకు వ్యవహారంగా భావిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల సంఘం చెప్పాల్సిన విషయాలు కేసీఆర్ చెబుతున్నారన్నారు.
8. టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు ఖాయం- హరీశ్
ప్రజా స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు ఖాయమని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్ని కూటమిలు కట్టినా ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కోతలు, ఎరువుల కొరత తప్ప ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు గెలవమని తెలిసి ఆపద మొక్కులు మొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. ఓడిపోయే నాయకులే మాటలెక్కువ మాట్లాడుతారని విమర్శించారు. కేసీఆర్‌ నేతృత్వంలో గజ్వేల్ నియోజకవర్గం.. దేశానికే రోల్ మోడల్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అంటూ కొనియాడారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవీ.. చెప్పనివీ అమలు చేశామని హరీష్‌‌రావు చెప్పారు.
9. కాంగ్రెస్ మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలు నమ్మరు
జనగామజిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, డాక్టర్ సుధాకర్ రావులు పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… కాంగ్రెస్ మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలు నమ్మరని తేల్చి చెప్పారు. దశాబ్దాలు పాలించిన కాంగ్రేస్ ఏనాడూ తన మేనిఫెస్టో ను అమలు చేయలేదు. ఇచ్చిన హామీలతో పాటు.. ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఘనత టిఆర్ఎస్ పార్టీది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అభివృద్ధి చేస్తున్న అభివృద్ధితో కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
10. హైదరాబాద్…అమీర్ పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో లైను
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి మెట్రో స్టేషన్ను తీర్చిదిద్దామని, వీటి నిర్మాణంలో అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించామన్నారు. ప్రజలు నడక మార్గాల ద్వారా మెట్రో స్టేషన్లకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రోకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. ప్రపంచంలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇదేనని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఎల్ అండ్ టీ రూ.12వేల కోట్లు ఖర్చు చేసిందని, భూ సేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించిందని తెలిపారు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com