పాకిస్థాన్ ప్రస్తుతం ఆత్మవిశ్వాస రాహిత్యంతో కనిపిస్తోందని ఆ జట్టు కోచ్ మికీ ఆర్థర్ అన్నారు. ఆసియాకప్‌లో భారత్ చేతిలో రెండోసారి ఓడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పాక్ చెత్త ప్రదర్శనల్లో ఇదొకటని పేర్కొన్నాడు. ‘దాటవేసేందుకు ఏమీ లేదు. పాక్ క్రికెటర్లు ఆత్మవిశ్వాస రాహిత్యంతో బాధపడుతున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఓటమి భయం పట్టుకుంది. ఒక క్రికెట్ జట్టుగా తామిప్పుడు ఎక్కడున్నామో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది’ అని మికీ అన్నారు. సూపర్ -4 మ్యాచ్‌లో భారత్‌కు పాక్ 238 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. రోహిత్, ధావన్ శతకాలు బాదడంతో భారత్ 9 వికెట్ల తేడాతో 39.3 ఓవర్లలోనే ఘన విజయం సాధించింది. ‘మా స్ట్రైక్‌రేట్ బాలేదు. బంతితో త్వరగా వికెట్లు తీయాలి. మాకు కొన్ని అవకాశాలు లభించాయి. వాటిని జారవిడిచాం. ఇలాంటి జీవన దానాలు ఇస్తే ప్రత్యర్థి ఎవరైనా రెచ్చిపోతారు. త్వరగా ఓపెనర్ల వికెట్లు తీస్తే భారత్ మిడిలార్డర్ ఇబ్బంది పడేది. మేమది చేయలేకపోయాం’ అని ఆర్థర్ పేర్కొన్నారు. టీమిండియా బౌలర్లను ఆర్థర్ ప్రశంసించారు. ‘మనం నిజాలు మాట్లాడుకోవాలి. సర్ఫరాజ్, ఆమిర్ మాత్రమే 50 మ్యాచ్‌లు ఆడారు. మాలిక్‌కు 200 మ్యాచ్‌ల అనుభవం ఉంది. మిగతా అందరూ కొత్తవాళ్లే. టీమిండియాలో బుమ్రా అద్భుతంగా బంతులు విసిరాడు. ఐచ్చిక సాధన సెషన్లో టీమిండియా శిబిరం పక్కన నేను కూర్చున్నా. అప్పుడు బుమ్రా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా యార్కర్లు విసురుతున్నాడు. అది నన్నెంతో ఆకట్టుకుంది. అతడిని, డెత్ ఓవర్లలో భువి ఎలా బౌలింగ్ చేస్తాడో నేను మా కుర్రాళ్లకు చూపిస్తాను. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ మాకు సెమీస్ లాంటింది. తప్పక గెలవాలి. మా వద్ద మంచి ఆటగాళ్లు ఉన్నారు’ అని ఆర్థర్ అన్నాడు.