Movies

లెక్కల క్లాసు తప్పించుకుని సినిమాల్లోకి

లెక్కల క్లాసు తప్పించుకుని సినిమాల్లోకి

ఇష్టంతో సినిమాల్లోకి వచ్చామని చెప్పే వాళ్లని చూస్తుంటాం. వేరొకరు ప్రోత్సహిస్తే ఇటువైపు వచ్చే వాళ్లు కొంతమంది కనిపిస్తుంటారు. అదృష్టం కలిసొచ్చి అనుకోకుండానే నటులు అనిపించుకునే వాళ్లు మరికొంతమంది. సాయిపల్లవి మాత్రం లెక్కల క్లాస్‌ని తప్పించుకొనేందుకే సినిమాల్లోకి రావాలనుకుందట. తెలుగు ప్రేక్షకుల్ని తొలి అడుగుల్లోనే ‘ఫిదా’ చేసిన అందం పేరు… సాయిపల్లవి. పాత్రలకి సహజత్వాన్ని తెచ్చిపెట్టడంలో ఆమెకి ఆమే సాటి. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘లవ్‌స్టోరీ’లో నటిస్తోంది. స్కూల్‌ రోజుల్లోనే నటించే అవకాశాలొచ్చినా, ఆలస్యంగా సినిమాల్లోకి వచ్చారెందుకని అడిగితే… ‘‘ఏదైనా జరగాలనుకుంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరనేది నేను నమ్మే సిద్ధాంతం. మనం ఒకటి తలచినప్పుడే అదే పనిగా ఆలస్యం జరుగుతోందంటే అది అలా జరగడమే సమంజసమేమో అని నమ్ముతా. నిజానికి నాక్కూడా అప్పుడే సినిమాల్లోకి రావాలని ఉండేది. కానీ సినిమాపై ఇప్పుడున్నంత ఇష్టంతో మాత్రం కాదు. లెక్కల క్లాస్‌ అంటే వణుకు వచ్చేది. ఆసక్తి ఉండేది కాదు. దాన్ని తప్పించుకునేందుకైనా సినిమాల్లోకి వెళ్లాలనుకున్నా. కానీ మా అమ్మానాన్నలు ఒకవేళ ఐదారేళ్ల తర్వాత నీకు అవకాశాలు రాకపోతే ఏం చేస్తావని అడిగారు. ఆ మాట ఆలోచించేలా చేసింది. మళ్లీ చదువులపై దృష్టి పెట్టేలా చేసింది. ఒకవేళ అప్పుడే వచ్చుంటే నేనింతగా పాత్రల్ని అర్థం చేసుకునేదాన్ని కాదేమో. ఏం జరిగినా మన మంచికే అనుకునే తత్వం నాద’’ని చెప్పింది సాయి పల్లవి.