అభియోగాల ఆధారంగా అనర్హత వేటు వేయలేం

క్రిమినల్‌ విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులు దోషులుగా తేలక ముందే వారిపై అనర్హత వేటు వేయలేమని సుప్రీంకోర్టు నేడు వెల్లడించింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు నమోదైతే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు కీలక తీర్పు వెల్లడించింది. కేవలం అభియోగాలు నమోదైతే వారిపై అనర్హత వేటు వేయలేమని.. అయితే వారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చో లేదో అన్న విషయాన్ని పార్లమెంట్‌కే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఒక క్రిమినల్‌ కేసులో దోషిగా తేలాకే చట్టసభ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. అయితే అభియోగాల నమోదు దశ నుంచే ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు భాజపా నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌లు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం నేడు తీర్పు వెలువరిచింది. ‘క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేసే స్థాయిలో న్యాయస్థానం లేదు. ఈ విషయంలో లక్ష్మణరేఖ దాటలేం. అయితే నేరస్థులను చట్టసభలకు దూరంగా ఉంచే సమయం వచ్చింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది పార్లమెంట్‌కే వదిలేస్తున్నాం. దీనిపై పార్లమెంట్‌ ఓ చట్టం తీసుకురావాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాక.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదైతే వాటికి సంబంధించిన వివరాలను ఆ అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్‌లో తప్పనిసరిగా పేర్కొనాలని తెలిపింది. పార్టీలు కూడా తమ అభ్యర్థుల కేసుల వివరాలను వెబ్‌సైట్లలో పొందుపర్చాలని ఆదేశించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com